unmanned spacecraft
-
Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి
అవరోహణలో అదుపు తప్పి వేగంగా కిందికి దూసుకెళ్లలేదు. పట్టు తప్పి ధడేల్మని పడిపోలేదు. కూలిపోలేదు... ధ్వంసమవలేదు. చంద్రుడి ఉపరితలంపై దిగడానికైతే సాఫీగానే దిగింది ‘స్లిమ్’ ల్యాండర్. కానీ... తూలిపోయింది! తన ఐదు కాళ్లపై తాను సొంతంగా నిలబడలేకపోయింది. స్వతంత్రంగా నిలదొక్కుకోలేకపోయింది. షియోలీ బిలం వాలులో కిందికి దిగగానే దొర్లి తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తింది. శీర్షాసనం భంగిమలో ఉండిపోయింది. ‘మూన్ స్నైపర్’ దిగీ దిగగానే నెమ్మదిగా పూవు రెక్కల్లా విచ్చుకుని ఆకాశంలోని సూర్యుడిని చూస్తూ కరెంటు తయారుచేసి శక్తినివ్వాల్సిన ల్యాండర్ పై భాగంలోని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్).. ల్యాండర్ తలకిందులవటంతో జాబిలి నేలవైపు ఉండిపోయాయ్. సౌరశక్తి అందే మార్గం మూసుకుపోయింది. ఇక.. ‘స్లిమ్’ ల్యాండరులోని ఆన్‌బోర్డ్ (ఇన్ బిల్ట్) బ్యాటరీ కొన్ని గంటలు పనిచేసి ఈపాటికి ‘డెడ్’ అయివుంటుంది. ‘మూన్ స్నైపర్’ తనంతట తాను పైకి లేచి నిటారుగా నిలబడే ఏర్పాటు, అవకాశం లేవు. అంటే... పవర్ కోల్పోయిన ల్యాండర్ ఈసరికే మూగబోయి శాశ్వత నిద్రలోకి జారుకుని వుంటుంది. మిషన్ కథ ఇక ఇక్కడితో పరిసమాప్తం. జపాన్ సాధించింది పరిపూర్ణ విజయమా? పాక్షిక విజయమా? కనీస విజయమా? అని ప్రశ్న వేసుకుంటే... అది తన ప్రయత్నంలో విఫలం మాత్రం కాలేదనే చెప్పాలి. తమ ‘స్లిమ్’ వ్యోమనౌక అధ్యాయం ముగిసిందనే వార్తను జపాన్ అంతరిక్ష సంస్థ ఈ రోజు కాకపోతే రేపైనా, కొంచెం ఆలస్యంగానైనా అటు స్వదేశంలోనూ, ఇటు బాహ్య ప్రపంచానికి అధికారికంగా ప్రకటించాల్సివుంటుంది. సరిగ్గా తన ల్యాండింగ్ సమయంలో చంద్రుడి మీదికి ‘మూన్ స్నైపర్’ జారవిడిచిన రెండు (LEV-1 & 2) లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్స్... భూమికి ఏం సమాచారం ప్రసారం చేశాయో పరిశీలించాల్సివుంది. దిగేటప్పుడు ల్యాండరును ఈ జంట రోవర్లు తీసిన చిత్రాలు, వీడియో వెల్లడికావలసివుంది. జంట రోవర్లు పంపిన డేటాను ప్రాసెస్ చేశాక ‘జాక్సా’ ఏం చెబుతుందో వేచిచూద్దాం. -జమ్ముల శ్రీకాంత్ చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు! -
గురి తప్పని జపాన్. బుల్లెట్ దింపిన మూన్ ‘స్నైపర్’!
టోక్యో: తమ మానవరహిత అంతరిక్ష నౌక చంద్రమండలంపై దిగిందని జపాన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) చంద్రుడి ఉపరితలంపై ఉదయం 12.20 గంటల సమయంలో దిగిందని పేర్కొంది. తాజా విజయంతో చంద్రుడిపైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది. అయితే.. ఆపరేషన్ సక్సెస్... కానీ పేషెంట్ డెడ్? చంద్రుడిపై సాఫీగానే దిగిన జపాన్ ‘మూన్ స్నైపర్’. భూమ్మీది గ్రౌండ్ స్టేషనుతో సంబంధాలూ బాగానే ఉన్నాయ్. చావు కబురు చల్లగా తెలిసిందేమంటే... ల్యాండరులోని సౌరఘటాలు (సౌరఫలకాలు/సోలార్ ప్యానెల్స్) పనిచేయడం లేదట. అవి విద్యుదుత్పత్తి చేయడం లేదట. ప్రస్తుతం ‘స్లిమ్’ తన సొంత బ్యాటరీపైనే ఆధారపడుతోంది. ల్యాండర్ డేటా భూమికి ప్రసారమయ్యేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ‘జాక్సా’ సిబ్బంది. ‘స్లిమ్’ సొంత బ్యాటరీలో శక్తి అయిపోతే, ఈలోగా సౌరవిద్యుత్ అందుబాటులోకి రాకుంటే... ల్యాండర్ చెల్లుకున్నట్టే! మిషన్ సఫలమా? విఫలమా? అనే విషయం పక్కనపెడితే... ‘మూన్ స్నైపర్’ ల్యాండింగులో జపాన్ వాడిని మెచ్చుకుని తీరాల్సిన అంశం ఒకటుంది. “రాజీపడి ఎక్కడపడితే అక్కడో, సులభంగా ఎక్కడో ఒకచోటనో దింపే టైపు కాదు జపాన్ వాడు. ఎక్కడ దిగాలనుకుంటాడో వాడు అక్కడే దిగుతాడు”. సాధారణంగా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు శాస్త్రవేత్తలు ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్ల వైశాల్యంలో వీలునుబట్టి, సురక్షితం అనుకున్న ఎక్కడో ఒకచోట దిగుతాయి. మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు సైతం ఇస్రో 4 కి.మీ. X 2.4 కి.మీ. విస్తీర్ణమున్న ప్రదేశాన్ని ఎంపిక చేసింది. అంటే... అంత పెద్ద ఏరియాలో అది ఎక్కడో ఒకచోట దిగిందన్నమాట. కానీ ఇప్పుడు జపాన్ అలా కాదు. చుక్కపెట్టి గురి తప్పకుండా కొట్టింది. చంద్రుడిపై జపాన్ కేవలం 100 మీటర్ల వ్యాసంతో ఓ గిరి గీసింది. కచ్చితంగా అదే గిరిలో ల్యాండరును క్షేమంగా దింపింది. ఇదే ప్రెసిషన్ ల్యాండింగ్. పిన్ పాయింట్ ల్యాండింగ్. అంతరిక్షంలో ఇలాంటివి అనితర సాధ్యం. ప్రపంచవ్యాప్త వార్తాసంస్థలు, ఇతర పత్రికలు మనకేల? తమ అంతరిక్ష విజయం గురించి అని పట్టించుకోకపోపయినా.. ‘The Japan Times’ పత్రిక ఏం రాసిందో చూద్దాం. చంద్రుడి ఉపరితలంపై దిగేటప్పుడు జపాన్ ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ ఏమీ దెబ్బతినలేదు. కనుక... బహుశా దాని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) సైతం పాడవకుండా భేషుగ్గానే ఉండి ఉంటాయి. కాకపోతే... తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల సౌరశక్తిని వ్యోమనౌక వినియోగించుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆన్‌బోర్డ్ బ్యాటరీపై అది ఆధారపడుతోంది. కొన్ని గంటలపాటు మాత్రమే ఆ బ్యాటరీ పవర్ అందించగలదు. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఓ ఆశ మిణుకుమిణుకుమంటోంది! ‘మూన్ స్నైపర్’ సౌర ఫలకాలు సూర్యుడి దిశగా లేవని ‘జాక్సా’ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడి దిశ (కోణం) మారగానే అవి సౌర విద్యుత్ తయారు చేస్తాయనేది వారి వాదన. ఒకసారి సోలార్ ప్యానెల్స్ సరిగా పని చేయడమంటూ మొదలైతే ల్యాండర్ కొన్ని రోజులపాటు జీవించి అప్పగించిన విధులు నిర్వర్తిస్తుంది. అనంతరం కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పాడవుతాయి. ఎందుకంటే... చంద్రుడిపై పగటి వేళలో నమోదయ్యే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు అవి క్రమంగా నాశనమవుతాయి. ఏదేమైనా ఈ ల్యాండింగ్ జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి గొప్ప ఊపు, ఉత్తేజాలనిచ్చింది. -జమ్ముల శ్రీకాంత్ -
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
2021 డిసెంబర్లో గగన్‌యాన్
సాక్షి బెంగళూరు: భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపే ‘గగన్‌యాన్’ ప్రయోగాన్ని 2021, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని చేపట్టేముందు పలు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 2020లో ఓసారి, 2021లో మరోసారి మానవరహిత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే క్రూ సపోర్ట్ సిస్టమ్స్, సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్ వంటి పలు సాంకేతికతలను ఇంకా అభివృద్ధి చేయాల్సిఉందని శివన్ పేర్కొన్నారు. 2022 నాటికి భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని ప్రధాని మోదీ ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివన్ మాట్లాడుతూ.. అంతరిక్ష యాత్రకు ఎంతమందిని పంపాలి? అక్కడ ఎన్నిరోజులు ఉండాలి? అన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గగన్‌యాన్‌లో పాల్గొనేందుకు వ్యోమగాములను ఇంకా ఎంపిక చేయలేదని వెల్లడించారు. వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ భారత వాయుసేన(ఐఏఎఫ్)స్వీకరించిందనీ, ఓసారి ఎంపిక పూర్తయితే 2 నుంచి 3 సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములను ఏడు రోజులపాటు అంతరిక్షంలోకి పంపే సామర్ధ్యం తమకుందని శివన్ చెప్పారు. ఈ ప్రయోగం చేపట్టేందుకు మిషన్ కంట్రోల్, ట్రాకింగ్, లాంచ్‌ప్యాడ్ నిర్మాణం వంటి పనుల్లో ప్రైవేటు రంగ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మానవసహిత యాత్రలో పాల్గొనే వ్యోమగాములకు శిక్షణ కోసం ఇతర దేశాల సాయం కూడా తీసుకుంటామని మరో ప్రశ్నకు శివన్ సమాధానమిచ్చారు. -
భూమ్మీదకు దూసుకొస్తున్న స్పేస్‌క్రాఫ్ట్
స్కైలాబ్ ఘటన గుర్తుందా.. అప్పట్లో అది కుప్పకూలిపోయి భూమి మొత్తం అంతమైపోతుందన్న వదంతులు గట్టిగా వ్యాపించాయి. ఇప్పుడు అలాంటిదే మరో ఉపద్రవం.. అయితే కొంత తక్కువ స్థాయిది రావొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు కావల్సిన సామగ్రిని అందించేందుకు వెళ్లిన మానవరహిత రష్యన్ స్పేస్‌క్రాఫ్ట్ అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తోంది. అది ఇంకెక్కడికీ వెళ్లేందుకు వీలు లేదని, భూమ్మీదకే వస్తుందని ఓ అధికారి తెలిపారు. దాన్ని అదుపు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఐఎస్ఎస్కు సామాన్లు అందించేందుకు బయల్దేరిన ఎం-27ఎం స్పేస్‌క్రాఫ్ట్‌ను తీసుకుని సోయుజ్ రాకెట్ వెళ్లడానికి విజయవంతంగానే వెళ్లింది గానీ, తర్వాత మాత్రం నియంత్రణ కోల్పోయింది. దాన్ని అదుపు చేసేందుకు ఆరు గంటలకు బదులు రెండు రోజులు ప్రయాణించేలా దాని సమయాన్ని పెంచారు. అయితే, అది ఏమవుతుందన్న విషయం బుధవారం రాత్రికి తెలియచ్చని అంటున్నారు. నిజానికి ఐఎస్ఎస్లో ఉన్న ఆరుగురు సిబ్బంది ఈనెల 30వ తేదీన ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసుకొచ్చే సామగ్రి కోసం వేచి చూస్తున్నారు. ఈలోపే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది.