భూమ్మీదకు దూసుకొస్తున్న స్పేస్క్రాఫ్ట్
స్కైలాబ్ ఘటన గుర్తుందా.. అప్పట్లో అది కుప్పకూలిపోయి భూమి మొత్తం అంతమైపోతుందన్న వదంతులు గట్టిగా వ్యాపించాయి. ఇప్పుడు అలాంటిదే మరో ఉపద్రవం.. అయితే కొంత తక్కువ స్థాయిది రావొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు కావల్సిన సామగ్రిని అందించేందుకు వెళ్లిన మానవరహిత రష్యన్ స్పేస్క్రాఫ్ట్ అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తోంది. అది ఇంకెక్కడికీ వెళ్లేందుకు వీలు లేదని, భూమ్మీదకే వస్తుందని ఓ అధికారి తెలిపారు. దాన్ని అదుపు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఐఎస్ఎస్కు సామాన్లు అందించేందుకు బయల్దేరిన ఎం-27ఎం స్పేస్క్రాఫ్ట్ను తీసుకుని సోయుజ్ రాకెట్ వెళ్లడానికి విజయవంతంగానే వెళ్లింది గానీ, తర్వాత మాత్రం నియంత్రణ కోల్పోయింది. దాన్ని అదుపు చేసేందుకు ఆరు గంటలకు బదులు రెండు రోజులు ప్రయాణించేలా దాని సమయాన్ని పెంచారు. అయితే, అది ఏమవుతుందన్న విషయం బుధవారం రాత్రికి తెలియచ్చని అంటున్నారు. నిజానికి ఐఎస్ఎస్లో ఉన్న ఆరుగురు సిబ్బంది ఈనెల 30వ తేదీన ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసుకొచ్చే సామగ్రి కోసం వేచి చూస్తున్నారు. ఈలోపే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది.