బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు.
ఇది ఏ దేశానికైనా కష్టం
‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు.
మేడిన్ ఇండియా మిషన్
‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment