అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తిన చంద్ర యాన్–3 విజయం తర్వాత, ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా 2040 నాటికి భార తీయ వ్యోమగాములు చంద్రు నిపైకి వెళ్ళే దిశగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. భవి ష్యత్తుపై దృష్టితో, ‘గగన్ యాన్’ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఇద్దరి నుంచి ముగ్గురు వరకూ భారతీయ వ్యోమగాములను ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్‌ఈఓ) లోకి పంపించి, మూడు రోజుల వరకు అక్కడ ఉంచి, మన దేశంలోని ఒక నీటి వనరుపై వారిని ల్యాండ్ చేసే (దించే) కార్యక్రమంలో మరొక అడుగు ముందుకు వేయాలని ప్రయత్నిస్తోంది ఇస్రో.
ఈ మిషన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ పైలట్‌లను ఆస్ట్రోనాట్– డెసిగ్నేట్‌లుగా ఎంపిక చేశాం. ప్రస్తుతం, వారు బెంగ ళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ఏటీఎఫ్)లో మిషన్–నిర్దిష్ట శిక్షణ పొందుతున్నారు. హ్యూమన్– రేటెడ్ (మానవులను సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం) లాంచ్ వెహికల్ (హెచ్‌ఎల్‌వీఎమ్3), క్రూ మాడ్యూల్ (సీఎమ్), సర్వీస్ మాడ్యూల్ (ఎస్‌ఎమ్) లతో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్; లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లతో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో ప్రారంభ దశలో ఉంటుంది. ఇంటి గ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లైట్‌లతో పాటు రెండు ఒకేలా ఉండే అన్– క్రూడ్ మిషన్‌లు (జీ1, జీ2) మనుషులతో కూడిన మిషన్‌కు ముందు ఉంటాయి.
సీఎమ్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. సీఎమ్ అనేది సిబ్బంది కోసం అంతరిక్షంలో భూమి–వంటి వాతా వరణంతో నివాసయోగ్యంగా ఉండే స్థలం. వ్యోమగా ములు సురక్షితంగా తిరిగి రావడం కోసం ఉద్దేశించింది ఇది. భద్రతా చర్యలలో అత్యవసర పరిస్థితుల కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) కూడా ఉంటుంది.టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) యొక్క మొదటి డెవలప్‌మెంట్ ఫ్లైట్ 2023 అక్టోబరు 21న ప్రారంభించబడింది. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క ఫ్లైట్ అబార్ట్‌ను విజయవంతంగా పరీక్షించగలిగింది. ఆ తర్వాత క్రూ మాడ్యూల్ వేరుపడటం, బంగాళాఖా తంలో ఇండియన్ నావికదళం దానిని సురక్షితంగా రికవర్ చేయడం కూడా జరిగాయి. మానవ రహిత మిషన్‌లూ, అంతిమంగా మానవ సహిత అంతరిక్ష మిషన్ 2025లో ప్రారంభించబడుతుందనీ అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఫ్లైట్ విజయం కీలకమైనది.
ఇస్రో మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్, భారతదేశపు తొలి సౌర అన్వేషణ మిషన్ అయిన ఆదిత్య ఎల్1. ఇది ‘లాగ్‌రేంజ్ పాయింట్ 1’ యొక్క ప్రత్యేకమైన వాన్టేజ్ పాయింట్ నుండి సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. చంద్రునిపైనా సూర్యునిపైనా చేసే పరిశోధ నల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. వివిధ ఇస్రో కేంద్రాలు, విద్యా సంస్థల సహకారంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఏడు సైంటిఫిక్ పేలోడ్‌లతో నిండిన ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక çసూర్యుని రహస్యాలను ఛేదించడానికి ప్రయోగిస్తున్నాం. 2023 సెప్టెంబర్ 2న ప్రారంభించిన ఆదిత్య ఎల్1 ఐదేళ్ల పాటు పని చేస్తుందని భావిస్తున్నాం. ఇది భూమి నుండి సుమారు 1.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉన్న సూర్యుడు–భూమి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1) వైపు ఉద్దేశించిన మార్గంలో ఉంది. ఇక్కడే అది జనవరి 2024లో హాలో కక్ష్యలోకి చేర్చబడుతుంది.
చంద్రయాన్–3 మిషన్ ఒక చరిత్రాత్మక విజయం. ఆ విజయం సిద్ధించిన ఆగస్టు 23ను ‘భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించడం ముదావహం. 14 రోజుల (ఎర్త్ డేస్) మిషన్ జీవిత కాలంలో, ఇది చంద్రుని మట్టిలో అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సల్ఫర్, మేంగనీస్, సిలికాన్, ఆక్సి జన్‌లను కనుగొన్న విలువైన డేటాను అందించింది. మనం తలపెట్టిన చిన్న శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ), పునర్వినియోగ ప్రయోగ వాహనం (ఆర్‌ఎల్‌వీ) ప్రోగ్రామ్, ఎక్స్–రే ఆస్ట్రానమీ మిషన్ ‘ఎక్స్‌పోశాట్’, స్పేస్ డాకింగ్ ప్రయోగం, ఎల్‌ఓఎక్స్ –మీథేన్ ఇంజన్ వంటి పరివర్తనాత్మక కార్యక్రమాలు కలిసి, భారత్ అంతరిక్ష అన్వేషణలో కొత్త శకాన్ని నిర్వచించాయి.
మూడు దశల లాంచ్ వెహికల్ అయిన ఎస్‌ఎస్ ఎల్‌వీ 500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 500 కి.మీ. ప్లానార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టగలదు. బహుళ ఉప గ్రహాలను తీసుకెళ్లగలదు. ఉపగ్రహాలను ఎప్పుడు ఎక్కడ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటే అప్పుడు ప్రవేశపెట్టగల (లాంచ్–ఆన్–డిమాండ్ ) సామర్థ్యం దీనికి ఉంది. దీన్ని ప్రయోగించడానికి కనీçస మౌలిక సదుపాయాలు ఉంటే చాలు. అలాగే ప్రయోగించ డానికి ఖర్చు కూడా తక్కువే!
ఎక్స్‌పోశాట్ అనేది భారత్ మొట్టమొదటి నిర్దిష్ట సైన్స్ మిషన్. ఇది శాస్త్రీయ పేలోడ్‌లను ఉపయోగించి తీవ్ర పరిస్థితుల్లోనూ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్–రే మూలాలను పరిశోధిస్తుంది.
అటువంటి దీనిని 2023–2024లో ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధ మయింది. స్పాడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్)ను 2024 మూడవ త్రైమాసికంలో ప్రారంభించాలనేది ప్రణాళిక. ఇది మానవ అంతరిక్షయానంలో అనువర్తనాల పరిధితో డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినజంట అంతరిక్ష నౌక. ఈ మిషన్‌లో రెండు చిన్న– ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి ఛేజర్‌గా, మరొకటి టార్గెట్‌గా, సహ–ప్రయాణికులుగా కలిపి ప్రయోగించబడతాయి. ‘భవిష్యత్తులో ‘చంద్రయాన్’ మిషన్ లలో చంద్రుని నుంచి శాంపిల్స్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేయడంలో డాకింగ్ ప్రయోగ విజయం గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.
రానున్న కాలంలో సాంకేతికత పరంగా అత్యంత ప్రాముఖ్యం కలిగిన ‘ఎల్‌ఓఎక్స్ మీథేన్’ (లిక్విడ్ ఆక్సి జన్ ఆక్సిడైజర్, మీథేన్ ఇంధనం) ఇంజిన్‌ల అభివృద్ధి కూడా ముఖ్యమైనదే. ఇది అంగారక గ్రహం వంటి ఇతర గ్రహాలపై పర్యావరణాల ఉనికి కోసం మాన వుడు చేసే అన్వేషణను సులభతరం చేస్తుంది. అంత రిక్షంలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్ లను సంశ్లేషణ చేయడం ద్వారా తయారు చేయగలిగిన మీథేన్ అంత రిక్షంలో సుదూరం ప్రయాణించే నౌకలకు ఇంధనంగా ఉపయోగిస్తారని భావిస్తున్నారు. అందుకే ఎల్‌ఓఎక్స్ మిథేన్ ఇంజిన్‌ల అభివృద్ధి చాలా ప్రాముఖ్యం కలిగిందని చెప్పాలి.
2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’ ప్రారంభించడం, వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్‌తో కూడిన అంతర్ గ్రహ అన్వేషణను ప్రారంభించడం వంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ప్రధాన మంత్రి నిర్దేశించుకున్నారు. ఇవన్నీ ప్రపంచ అంతరిక్ష పరిశోధనా వేదికపై భారత్ ఉనికిని మరింత పటిష్టం చేస్తాయి. ‘భారత్ అంతరిక్ష కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో కొత్త శిఖరాలను చేరుకోవ డానికి సిద్ధంగా ఉంది. ప్రయోగించబడిన ప్రతి మిషన్, ప్రతి ఆవిష్కరణతో ఇస్రో ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సగర్వంగా పునరుద్ఘాటిస్తుంది.
(‘మలయాళ మనోరమ’కు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అందించిన కథనం ఆధారంగా)
Comments
Please login to add a commentAdd a comment