పార్లమెంటు ఎన్నికలలో సీపీఐ (ఎమ్‌ఎల్) లిబరేషన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. రెండు సీట్లు గెలుపొంది వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బిహార్‌లోని అరా, కరాకట్ లోక్‌సభ స్థానాల నుండి లిబరేషన్ అభ్యర్థులు సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు విజయ బావుటా ఎగురవేశారు. భారత గడ్డపై ఫాసిస్టు శక్తుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు లిబరేషన్ తన వంతు కృషి చేస్తూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా మారింది.
అరా, కరాకట్, నలందా, కొడర్మ సీట్లలో బరిలో నిలిచింది. నలందా నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సందీప్ సౌరభ్ రెండో స్థానంలో నిలిచారు. జార్ఖండ్‌లో కొడెర్మలో వినోద్ సింగ్ (బాగోదర్ ఎమ్మెల్యే) రెండో స్థానంలో నిలిచారు. బిహార్‌లో అజియాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా దానిని లిబరేషన్ నిలబెట్టుకుంది. ఇక్కడ శివ్ ప్రకాష్ రంజన్ విజయం సాధించారు.
మొదట సాయుధ మార్గాన్ని అనుసరించిన లిబరేషన్ పార్టీ కాలక్రమంలో తన పంథాను మార్చుకుంది. ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్)ను ఏర్పాటు చేసి 1985 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల్లో పాల్గొంది. 1989 పార్లమెంటు, 1990 అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. 1989లో తొలిసారిగా రామేశ్వర ప్రసాద్‌ను అరా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి పంపింది. ఆ తర్వాత జయంతా రోంగ్పి అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ నుంచి పలుమార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇద్దరు ఎంపీలను బిహార్ నుంచి పార్లమెంట్‌కు పంపింది.
1995 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి సీపీఐ (ఎమ్‌ఎల్) లిబరేషన్ పేరుతో పోటీ చేస్తోంది. 2010 ఎన్నికల్లో తప్ప మినహా ఆ పార్టీ ప్రతినిధులు మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసి పదకొండు మంది సభ్యులను అసెంబ్లీకి పంపిన చరిత్ర లిబరేషన్‌కు ఉంది. జైలులో ఉండి శాసన సభకు గెలిచిన చరిత్రా ఉంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లిబరేషన్ అపూర్వ విజయాల్ని సొంతం చేసుకుంది.
19 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలిచింది. ఒక మహిళా ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. సీట్ల సంఖ్యలో తరుగుదల, పెరుగుదల ఉన్నప్పటికీ నికరమైన, స్థిరమైన ఓటు బ్యాంకు, బలమైన ప్రజా పునాది కలిగి ఉండటం విశేషం. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం సుదీర్ఘ కాలంగా ఉంది. గతంలో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 25 రాష్ట్రాలలో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం కలిగి ఉంది.
‘రణవీర్ సేన’ లాంటి ప్రైవేటు సైన్యాలను ఎదుర్కొన్న వీరోచిత చరిత్ర లిబరేషన్‌ది. అణచివేతలపైనా, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగిస్తూ వస్తోంది. విద్య, వైద్యం, భూమిలేని పేదల కోసం, రైతుల హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు నడిపింది. నిరంతరం పేదల కోసం పోరాడిన సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు పేదల హక్కుల్ని కాపాడడం కోసం పార్లమెంట్‌లో తమ గళాన్ని బలంగా వినిపించబోతున్నారు. – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్‌ఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, 78932 30218.
Comments
Please login to add a commentAdd a comment