అభిప్రాయం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం.
పదమూడేళ్ల కింద (2011 కోపెన్‌హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్‌బైజాన్‌లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది.
ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి.
తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు.
భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్‌హోమ్‌లో 1972 జూన్‌లో జరిగింది.
కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్‌లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు.
అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.
దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనం
స్టాక్‌హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు.
స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు.
‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్‌గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.
పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు.
సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్‌హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్‌హోమ్‌లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment