ఇది మాయ కాక మరేమిటి? | Sakshi Guest Column On EVM Machines | Sakshi
Sakshi News home page

ఇది మాయ కాక మరేమిటి?

Published Fri, Dec 13 2024 12:32 AM | Last Updated on Fri, Dec 13 2024 12:32 AM

Sakshi Guest Column On EVM Machines

విశ్లేషణ

నిరూపించ లేనంత మాత్రాన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో ధ్రువీకరించినట్టు కాదు. అభియోగాలు మోపేవారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకు రావాలి. వాటిని స్వీకరించి బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జర పాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో, అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబు దారీతనం ముఖ్యం. అది జరగటం లేదు.

అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. కానీ, కొన్ని రాజకీయేతర తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్‌ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ధ ఫలితాలనూ... ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్నీ అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

ఓట్‌ ఫర్‌ డెమాక్రసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్‌ ఫర్‌ డెమాక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), సిటిజన్‌ కమిషన్‌ ఆన్‌ ఎలక్షన్‌ (సీసీఈ) వంటి పౌర సంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’, ‘దురుద్దేశ పూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!

ఓటు వ్యత్యాసాల పైనే సందేహాలు
సాయంత్రం వరకు పోలింగ్‌ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్య, అసాధారణ ఓటింగ్‌ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల్లోనే కాకుండా హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. 

గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా, ఆఖరు నిమి షపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. 

ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్‌ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో 0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామ మాత్రంగానే ఉండ టంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించ లేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్‌ సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. 

జార్ఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్‌ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో 17 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్‌ సందర్భంగా ఓటింగ్‌ శాతం పెరుగుదల 0.86%కి పరిమితమైనందునేమో, 38లో 7 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎంల మాయా జాలమే అని విమర్శకులంటారు.

కళ్లకు కట్టినట్టు గణాంకాలు
మహారాష్ట్రలోని అకోట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్‌ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్‌ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్‌’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. 

ఒకే విడత పోలింగ్‌ జరిగిన నవంబరు 20, సాయంత్రం 6.15 గంటలకు ఒకసారీ, రాత్రి 11.45 గంటలకు ఒకసారీ ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్‌ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్‌ స్టేషన్లలో గడువు లోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటు వేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగు తుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 

288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి అయ్యేటప్పటికి 65.02% (6,30,85,732 ఓట్లు) నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లన్న మాట! నవంబరు 22న ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు ముందు, ‘యాప్‌’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర మంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్‌ శాతం 66.05%కి చేరింది. ఏమిటీ వ్యత్యాసాలన్న ప్రశ్న ఈవీఎంలపై శంకకు తావిస్తోంది. 288 నియోజక వర్గాల్లోని 1,00,186 పోలింగ్‌ బూత్‌లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ‘క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం!సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమా ధానం ఇవ్వాలనే డిమాండ్‌ వస్తోంది. 

చైతన్యమే దారిదీపం 
మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లా మాల్‌శిరాస్‌ తాలూకా మార్కడ్‌వాడి అనే చిన్న గ్రామంలో జనం తిరగబడ్డారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్థులు బ్యాలెట్‌ ద్వారా ‘మళ్లీ పోలింగ్‌’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. 

కానీ పోలీస్‌ ఆంక్షలు విధించి సదరు రీపోల్‌ను అధికారులు జరుగనీయ లేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్‌ పవార్‌) అభ్యర్థి ఉత్తమ్‌రావ్‌ జన్‌కర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా... ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరో పించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా... గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్‌ సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. 

రీపోల్‌ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీపోల్‌ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్‌ ఏజెంట్లుగా పోలింగ్‌ ముగిసే సమయంలో, కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆ యా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది.
 
ఈవీఎంలలో మాయ ఉందంటే... దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలు న్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది... పారదర్శక పాలనా వ్యవస్థలూ, పాలకుల నుంచి జవాబుదారీతనం... దట్సాల్‌!

దిలీప్‌ రెడ్డి 
వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్,
పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చి సంస్థ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement