
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది.
నిరుడు ఏప్రిల్‌లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్‌ఎల్‌యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.
ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్‌లూ, ఎస్‌ఎల్‌యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్‌లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది.
కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్‌ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్‌వేర్‌నూ, హార్డ్‌వేర్‌నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం.
ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది.
దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.
మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది.
ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు.
ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment