
తటస్థతకు తిలోదకాలొదిలి అవకతవకలకు అసలైన చిరునామాగా మారిన ఎన్నికల సంఘం(ఈసీ) సిగ్గుపడాల్సిన విషయమిది. ఆరోపణలొచ్చినప్పుడూ, ఫిర్యాదులందినప్పుడూ మౌనంతోనో, దబా యింపుతోనో తప్పించుకోజూస్తున్న ఈసీపై సోమవారం పార్లమెంటు ఉభయసభలూ దద్దరిల్లాయి. మహారాష్ట్రలో వోటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ ఆరోపణలు చేసి మూణ్ణెల్లవుతోంది.
నెల క్రితం కూడా ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ మీడియా సమావేశంలో ఈసీపై అభియోగాలు మోపారు. అయిదు నెలల వ్యవధిలో కొత్తగా 39 లక్షలమంది వోటర్లు ఎలా పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. అవి ఆధార రహితం, తప్పుదోవ పట్టించే అభాండాలని చెప్పటం తప్ప నిర్దిష్టంగా ఫలానా చోట ఏం జరిగిందో, వోటర్ల సంఖ్య పెరగటానికి కారణమేమిటో వివరించే ప్రయత్నం ఈసీవైపు నుంచి లేదు!
అటు బెంగాల్‌లో ఈ మాదిరి అవకతవకలే బయటపడి ఆ సంస్థ పరువు బజారుపాలు చేశాయి. వోటర్ల జాబితా అవకతవకలతోపాటు నకిలీ వోటరు కార్డులు రాజ్యమేలుతున్నాయని తృణమూల్ ఫిర్యాదు చేస్తే మూడు నెలల్లో సరిచేస్తామన్న జవాబొచ్చింది. వెనువెంటనే దర్యాప్తు చేసి దీనివెనక జరిగిందేమిటో తేల్చిచెప్పడానికి బదులు సరిచేస్తామనటంలో మర్మమేమిటి? అక్కడే కాదు... హరియాణా, గుజరాత్, ఒడిశా, యూపీల్లో సైతం ఇలాగే జరిగిందని విపక్ష సభ్యులు ఆరో పించారు.
ఇటీవల ఎన్నికలు జరిగిన ఢిల్లీలోనూ ఇదే తంతు నడిచిందని ఆప్ ఆరోపణ. రాజ్యాంగ సంస్థగా ఎంతో హుందాగా, నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన సంస్థ ఇలా అడుగడు గునా కంతలతో, లోపాయికారీ వ్యవహారాలతో ఎన్నికలు జరిపించటం సిగ్గుచేటు కాదా?
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ నిష్టగా నిర్వహించాల్సిన క్రతువు. అది కాస్తా ఈమధ్య కాలంలో నవ్వుల పాలవుతున్న వైనం కనబడుతున్నా తనకేం సంబంధం లేనట్టు ఆ సంస్థ ప్రవర్తి స్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమితో కొత్తగా చుట్టరికం కుదిరిందన్న ఏకైక కారణంతో అప్పటి విపక్ష నాయకులు చెప్పినట్టల్లా అధికారు లను బదిలీలు చేశారు.
పర్యవసానంగా ఇతర జిల్లాల్లో జరిగిన దారుణ ఉదంతాల సంగతలా ఉంచి పల్నాడు ప్రాంతం ఎంతటి హింసను చవిచూసిందో, ఎన్ని గ్రామాల ప్రజలు ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణభయంతో పారిపోయారో మీడియా సాక్షిగా వెల్లడైంది. పోలింగ్ కేంద్రాల దురాక్రమణ, తెల్లారుజాము వరకూ పోలింగ్ తంతు కానివ్వటం వంటి అరాచకాలకు అంతులేదు.
సాయంత్రం గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రం గేట్లు మూసి ఆ ఆవరణలో ఉన్నవారికి మాత్రమే స్లిప్‌లిచ్చి వోటు వేయటానికి అనుమతించాలని నిబంధనలు చెబుతున్నాయి. క్యూలో చిట్టచివర గేటు దగ్గర ఉన్నవారికి ఒకటో నంబర్ స్లిప్ ఇవ్వటంతో మొదలెట్టి బూత్ సమీపంలో ఉన్నవారికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్‌లు భద్రపరచాలి.
సీసీ టీవీ ఫుటేజ్‌లు భద్ర పరచాలి. ఇదంతా జరిగిందా? పోలింగ్ ముగిసిన నాలుగురోజుల తర్వాత 12.5 శాతం వోటింగ్ పెరిగినట్టు చూప టానికి ఈసీ ఏమాత్రం మొహమాట పడలేదు. ఇదంతా ఎక్కడ బయటపడుతుందోనన్న కంగా రుతో పరాజితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీప్యాట్ స్లిప్‌లు ధ్వంసం చేశారు.
ఈవీఎంలలో రికార్డయిన ఓట్ల లెక్కలు బయటకు తీసి, అవి వీవీప్యాట్ స్లిప్‌లతో సరిపోల్చాలని కోరితే డమ్మీ గుర్తులతో కొత్తగా నమూనా వోటింగ్ నిర్వహించ టానికి సిద్ధపడ్డారు! ఇక భద్రపరిచిన ఈవీఎంలలో చార్జింగ్ ఎలా పెరుగుతుందో ఇంతవరకూ చెప్పలేకపోయింది. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీస్తే జవాబివ్వటానికి ఈసీకి నోరు పెగలదు.
పార్లమెంటులో ఇంత దుమారం రేగాక డూప్లికేట్ కార్డులపైనా, వోటర్ల జాబితా అవకతవక లపైనా సాధికారికంగా, పద్ధతిగా జవాబివ్వడానికి బదులు వేరే మార్గం ఎంచుకుంది. ‘ఈసీ వర్గాలు’ అనే పేరుతో ఒక వివరణ బయటికొదిలింది. ఆ సంస్థ తనను తాను ఏమనుకుంటున్నదో గానీ ఇలా మీడియాకు లీకులివ్వటం మర్యాదైన సంగతి కాదు. ఒక పార్టీయో లేదా ప్రభుత్వమో తమ ఆలోచనలపై ప్రజాస్పందనేమిటో తెలుసుకోవటానికి లీకులిస్తుంటాయి.
దాని ప్రయోజనం దానికుంటుంది. కానీ ఈసీ అలా చేయటంలో ఆంతర్యమేమిటి? ఉదాహరణకు డూప్లికేట్ వోటర్ కార్డులు వారసత్వపు సమస్యగా తేల్చిచెప్పింది. 2008–13 మధ్యే ఈ కార్డులు జారీ అయ్యాయన్నది. అదే నిజమనుకుంటే ఆ సంగతి ఈసీకి ఎప్పుడు తెలిసింది? తెలిశాక తీసుకున్న చర్యలేమిటి? ఇన్నాళ్లూ సరిచేయక పోవటానికి కారణాలేమిటి? అధికారికంగా ఇలాంటి తెలివితక్కువ జవాబు లిస్తే మరిన్ని ప్రశ్నలు వచ్చిపడతాయన్న భయంతోనే ఆ సంస్థ లీకులతో సరిపెట్టింది.
ఎంతకాలం ఈ దాగుడుమూతలు? ఎన్నాళ్లు ఈ అవకతవకలు? ఎన్నికల ప్రక్రియపైనా, వివిధ దశల్లో చోటుచేసుకున్న అక్రమాలపైనా ఫిర్యాదులొస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఇప్పుడు పార్లమెంటులో పెద్ద రాద్ధాంతం జరిగాక లీకులివ్వటం, అవి మరిన్ని సందేహాలకు తావీయటం అప్రదిష్ట కాదా? ఇందువల్ల తమ విశ్వసనీయత దెబ్బతింటుందన్న ఇంగితజ్ఞానం కూడా లేదా? ఓడిన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు... సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌వై ఖురేషీ సైతం గతంలోనూ, ఇప్పుడూ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు.
ఎన్నికల సంఘం తీరు సవ్యంగా లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నదని హెచ్చరించారు. కనుక ఆ సంస్థ ఇప్పటికైనా పారదర్శకతతో వ్యవహరించటం నేర్చుకోవాలి. తప్పును తప్పుగా ఒప్పుకొనే నిజాయితీ ప్రదర్శించాలి. లేనట్టయితే ప్రజానీకం దృష్టిలో దోషిగా మిగలక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment