రాయ్‌బరేలీ వ్యూహం | Sakshi Editorial On Rahul Gandhi Rae Bareli | Sakshi
Sakshi News home page

రాయ్‌బరేలీ వ్యూహం

Published Tue, May 7 2024 12:14 AM | Last Updated on Tue, May 7 2024 12:14 AM

Sakshi Editorial On Rahul Gandhi Rae Bareli

ఎట్టకేలకు ఒక చర్చ ముగిసింది, మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌ శుక్రవారం రాయ్‌బరేలీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయడంతో ఉత్తర ప్రదేశ్‌లో ఆయన పోటీ చేస్తారా, లేదా అన్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతుల్లో ఓటమి పాలైన అమేథీని కాకుండా, ఇటీవల రాజ్యసభకు వెళ్ళేంత వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీని ఆయన ఎన్నుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. 

భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్‌ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు రాహుల్‌ తీసుకున్న నిర్ణయంపై అంచనాలున్నాయి, అనుమానాలూ ఉన్నాయి. ఈ పోటీతో ఎన్నికల వ్యూహంలోనూ, ఇటు విస్తృత రాజకీయ కథనంలోనూ కాంగ్రెస్‌ పార్టీ గట్టి మార్పు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి దీన్ని ఒక అవకాశంగా కాంగ్రెస్‌ భావిస్తోంది. 

అమేథీ స్థానంలో కాకున్నా కుటుంబానికి కలిసొచ్చిన రాయ్‌బరేలీని ఎంచుకోవడం ద్వారా యూపీ ఎన్నికల క్షేత్రంలో పార్టీకి రాహుల్‌ కొత్త ఉత్సాహం తెచ్చారనుకోవాలి. చిరకాలంగా గాంధీ కుటుంబ వారసులే పోటీ చేస్తున్న కంచుకోట లాంటి అమేథీ స్థానాన్ని... నియోజకవర్గం బాగోగులు చూసే మరో విధేయ నేత కేఎల్‌ శర్మకు కట్టబెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 ఎన్నికల్లో 17 సార్లు కాంగ్రెస్‌కే జై కొట్టిన స్థానం రాయ్‌బరేలీ. ప్రధాని ఇందిరాగాంధీ మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులకు పట్టం కట్టిన మరో కంచుకోట. 

అక్కడ పోటీ ద్వారా యూపీలో క్రియాశీలకంగా నిలవడమే కాక, తనపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాహుల్‌ వీలు చిక్కించుకున్నారు. అయితే, ఆఖరు నిమిషంలో ప్రకటించిన ఈ అభ్యర్థిత్వంతో అనేక సవాళ్ళూ తప్పవు. వాటిని ఎలా అధిగమించి, సంక్లిష్ట సామాజిక – రాజకీయ కోణాలున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లో పట్టు సాధిస్తారన్నది చూడాలి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నంత బలమైన ఎన్నికల యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ప్రస్తుతం కాంగ్రెస్‌కు లేకపోవడం లోటు. వాటిని అధిగమించి, ప్రస్తుత ఉత్సాహాన్ని ఎన్నికల లబ్ధిగా ఎలా మలచగలుగుతారో వేచిచూడాలి. 

నిజానికి, క్రితంసారి ఉత్తరాదిన కాంగ్రెస్‌ ఊపు తగ్గినా దక్షిణాదిలో ఉనికి నిలిపిన కేరళలోని వయనాడ్‌ స్థానమంటే సహజంగానే రాహుల్‌కు ప్రత్యేక అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాదిన హస్తం హవా కొనసాగేందుకు వయనాడ్‌ భావోద్వేగ బంధంగా ఉపకరిస్తుందని ఆయన ఆలోచన. అందుకే, ఈసారీ ఆయన అక్కడ నుంచి కూడా పోటీ చేశారు. 

వయనాడ్‌లో రాహుల్‌ స్థానికేతరుడనీ, యూపీలో గెలిస్తే ఈ స్థానాన్ని వదిలేస్తాడనీ ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నందు వల్లే అక్కడ ఎన్నికలయ్యేంత వరకు తెలివిగా తన రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఆఖరి వరకూ అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ అంశాన్ని సస్పెన్స్‌లోనే ఉంచుతూ, అధికార పార్టీని ఇరుకునపెట్టారు. బీజేపీ సైతం పోటీకి భయపడి రాహుల్‌ వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారంతో ఒత్తిడి పెంచింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, ముఖాముఖి పోరుకు వెరవడం లేదని నిరూపించేందుకు రాహుల్‌కు ఈ రాయ్‌బరేలీ అభ్యర్థిత్వం ఉపకరించనుంది. 

హస్తం పార్టీకి రాయ్‌బరేలీ ఎంత అడ్డా అయినా, రాహుల్‌ పోటీలో రిస్కులూ ఉన్నాయి. యూపీలోని మొత్తం 80 లోక్‌సభా స్థానాల్లో క్రితంసారి 64 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అలవాటైన స్థానం వదిలేసి, సాహసించారు. కానీ, ఆయన ఛరిష్మా, కాంగ్రెస్‌కు చిరకాలంగా ఉన్న స్థానిక సంబంధాలు పనికొస్తాయని భావిస్తున్నారు. అసలు అమేథీలో ప్రియాంక, రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ చేయాలన్న ఆలోచనా ఒక దశలో జరిగింది. కానీ, ప్రతిపక్షం ఆరోపిస్తున్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతికి ఊతమిచ్చినట్టు అవుతుందని దానికి స్వస్తి చెప్పారు. 

ఇక, అమేథీలో పోటీచేస్తున్న కేఎల్‌ శర్మ పంజాబ్‌ నుంచి వచ్చినవారైనప్పటికీ, ఇరుగుపొరుగు స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో గత 30 ఏళ్ళుగా పార్టీ తరఫున పనిచేస్తున్నారు. జనంతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన, స్టార్‌ అభ్యర్థి స్మృతీ ఇరానీపై గెలుస్తారని కాంగ్రెస్‌ ఆశ. 1977లో ఇందిరా గాంధీపై రాజ్‌నారాయణ్, గడచిన 2019లో రాహుల్‌పై స్మృతి గెలిచినట్టే, రేపు స్మృతిపై శర్మ గెలవకూడదని ఏమీ లేదు. అధిక సంఖ్యాక ప్రజల మద్దతే కీలకమైన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. 

అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సదరు వ్యక్తుల, పార్టీల నిర్ణయం. అయితే, దేశంలోని అనేక ప్రధాన సమస్యల కన్నా అమేథీ, రాయ్‌బరేలీలలో రాహుల్‌ పోటీ చేస్తారా, లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా జాతీయ టీవీ ఛానళ్ళు దీనిపైనే చర్చోపచర్చలు చేయడం విచిత్రం. 1952లో ఫిరోజ్‌ గాంధీ, తర్వాత ఇందిర, అటుపైన సోనియా, ఇప్పుడు రాహుల్‌ పోటీతో రాయ్‌బరేలీతో కాంగ్రెస్‌ బంధం అమేథీ కన్నా పాతది, పట్టున్నది. కానీ, ఇల్లలకగానే పండగ కాదు. సాక్షాత్తూ ప్రియాంక యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ 398 స్థానాల్లో పోటీ చేసినా, రెండంటే రెండింట్లో గెలిచింది. 

ఇప్పుడు లోక్‌సభకు 17 స్థానాల్లో బరిలో నిలిచింది. అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ రేపు వయనాడ్, రాయ్‌బరేలీ – రెంటిలోనూ రాహుల్‌ గెలిస్తే, దేన్ని వదులుకోవాలన్నదీ చిక్కే. రాగల రోజుల్లో మరిన్ని విడతల పోలింగ్‌తో ఎన్నికల వేడి పెరిగాక కానీ, యూపీలో రాహుల్‌ పోటీ తాలూకు సిసలైన ప్రభావమేమిటో అర్థం కాదు. ఒకవేళ పాచిక పారి, రాయ్‌బరేలీలోనే కాక యూపీ అంతటా రాహుల్‌ ప్రభావం కనిపిస్తే రాజకీయాలు మళ్ళీ మలుపు తిరుగుతాయి. హస్తం పార్టీ ఆశ కూడా అదే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement