Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ

Published Sat, May 4 2024 5:09 AM

Lok sabha elections 2024: Congress MP Rahul Gandhi Files Nomination From Raebareli

అమేథీ నుంచి కిశోరీలాల్‌ 

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోటలపై ఉత్కంఠకు తెర  

సోనియా గాంధీ 20 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి తనయుడి పోటీ  

ఈసారి పోటీకి దూరంగా ప్రియాంకా  గాంధీ  

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాల్లో ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్టానం శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి అనూహ్యంగా రాహుల్‌ గాంధీ పోటీకి దిగుతున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన కిశోరీలాల్‌ శర్మ అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్, కిశోరీలాల్‌ శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్‌            జరుగనుంది.
  
    రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ  అభ్యరి్థత్వం ఖరారు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఈ స్థానంలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దింపాలని పలువురు కాంగ్రెస్‌ సీనియర్లు పట్టుబట్టారు. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలు చేస్తోందని, ఆ పారీ్టలో సోనియా గాంధీ కుటుంబానిదే అసలు పెత్తనం అంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 దీంతో ఎవరూ ఊహించని విధంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన సోనియా గాంధీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆమె ఇప్పటికే రాజస్తాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. రాహుల్‌ గాం«దీని పోటీ చేయించడం ద్వారా ఇక్కడ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని, తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. తన తల్లి సోనియా గాంధీ 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది.  

రాయ్‌బరేలీలో రాహుల్‌ నామినేషన్‌   
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«దీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రాలతో కలిసి రాహుల్‌ తన నామినేషన్‌ పత్రాలను రాయ్‌బరేలీ జిల్లా మెజిస్ట్రేట్‌ హర్షితా మాథుర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ‘గో బ్యాక్‌ రాహుల్‌’ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యరి్థగా ఉత్తరప్రదేశ్‌ మంత్రి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌తో బరిలో నిలిచారు.   

రూ.20 కోట్లకు పైగా ఆస్తులు   
తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు రాహుల్‌ తన నామినేషన్‌ పత్రాల్లో వెల్లడించారు. రూ.3.81 కోట్ల విలువైన షేర్లతో కలిపి రూ.9.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలియజేశారు. రూ.26.25 లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్, రూ.15.21 కోట్ల విలువైన గోల్డ్‌ బాండ్ల ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేతిలో రూ.55 వేల నగదు ఉందని, రూ.49.79 లక్షల అప్పులు ఉన్నాయని ప్రస్తావించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్‌ వార్షికాదాయం రూ.1.02 కోట్లు.  

మా కర్మభూమి రాయ్‌బరేలీ  
రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడం తనకు భావోద్వేగ సమయమని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘మా కుటుంబానికి కర్మభూమి అయిన రాయ్‌బరేలీని మా తల్లి సోనియా గాంధీ ఎంతో నమ్మకంతో నాకు అప్పగించారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే భాగ్యం కల్పించారు. అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలు నాకు వేర్వేరు కాదు. ఇవి రెండూ నా సొంత కుటుంబం లాంటివే. 40 ఏళ్లుగా ఆమేథీ నియోజకవర్గానికి సేవలందిస్తున్న కిశోరీలాల్‌ శర్మ ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యరి్థగా పోటీ చేస్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు సాగుతున్న ఈ పోరాటంలో అందరూ నాకు అండగా నిలుస్తున్నారన్న విశ్వాసం ఉంది’’ అని రాహుల్‌ వెల్లడించారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement