Who Is Kishori Lal Sharma, Congress Amethi Pick Who Will Face Smriti Irani, Know Details About Him | Sakshi
Sakshi News home page

Amethi: స్మృతి ఇరానీపై కేఎల్‌ శర్మ పోటీ.. ఎవరీయన.. 25 ఏళ్లలో తొలిసారి

Published Fri, May 3 2024 11:47 AM | Last Updated on Fri, May 3 2024 4:09 PM

Who Is Kishori Lal Sharma Congress Amethi Pick Who Will Face Smriti Irani

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై సస్పెన్స్‌కు కాంగ్రెస్‌ తెరదించింది. అందరి ఊహలు పటాపంచల్‌ చేస్తూ లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక హై ఓల్టేజ్‌ స్థానం అమేథీ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కిషోరీలాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. ఈయన గాంధీ, నెహ్రూ కుటుంబానికి చిరకాల విధేయుడు.

కాగా రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ తాజా ప్రకటనతో ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లే తెలుస్తోంది.  ఇప్పటికే వయనాడ్‌ నుంచి మరోసారి నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్‌..  అమేథీలో పోటీకి ఆయన ముందు నుంచి నిరాసక్తి చూపుతూ వస్తున్నారు. కానీ రాహుల్‌ను రాయ్‌బరేలీలో రంగంలోకి దింపి కాంగ్రెస్‌ షాక్‌ ఇచ్చింది. అయితే అమేథీలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ ఘోర ఓటమిని చవిచూశారు.

2004 నుంచి 2014 వరకు రాయ్‌బరేలీలో ఆయన తల్లి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించారు. కానీ ఈసారి ఆమె రాజ్యసభకు వెళ్లడంతో అక్కడ పోటీకి మరో వ్యక్తి అవసరం వచ్చింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌తో పోటీ పడుతున్నారు. 

ఇక ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా..కాంగ్రెస్‌ 17 చోట్ల పోటీ చేస్తోంది. మిగతా 63 స్థానాల్లో ఇండియా కూటమిలో మిత్రపక్షమైన సమాజ్‌వాదీపార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలో పోటీ చేస్తున్నాయి.

ఎవరీ కిషోరీలాల్‌ శర్మ

  • కిషోరీలాల్‌ శర్మీ 1939 సెప్టెంబర్‌ 25న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు.
  • పంజాబ్‌లోని లుధియానాకు చెందిన ఆయనకు గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. 
  • 1983లో తొలిసారి అమేథీకి వచ్చి అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ తరపున పనిచేస్తూ వస్తున్నారు. 
  • కిషోరి లాల్ శర్మ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
  • 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత గాంధీ కుటుంబంతో అతని బంధం మరింత బలపడింది.
  • సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి గెలుపొందడంలో కేఎల్ శర్మ కీలక పాత్ర పోషించారు.
  • రాహుల్ కోసం సోనియా గాంధీ సీటు వదులుకున్న తర్వాత అమేథీ, రాయ్‌బరేలీలో శర్మ పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.

25 ఏళ్లలో తొలిసారి

గత 25 ఏళ్లలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అమేథీ ఎన్నికల బరిలో కనిపించకపోవడం ఇదే తొలిసారి. చివరిసారి 1998లో గాంధీయేతర కుటుంబ సభ్యుడిని  అమేథీ నుంచి పోటీకి దింపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ సతీష్ శర్మను పోటీచేశారు.  అయితేబీ జేపీ అభ్యర్థి సంజయ సిన్హ  చేతిలో ఆయన ఓడిపోయారు. అంతకు ముందు 1996 ఎన్నికలలో శర్మ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజా మోహన్ సింగ్‌పై విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement