లక్నో: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడమే కాకుండా సవాల్‌ల పర్వం మొదలైంది. తాజాగా కేంద్ర మంతి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నేడు (సోమవారం) ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి మళ్లీ రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చాలెంజ్ చేశారు.
‘2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన అమేథీలో ఓడిపోతారు. ఆయనకు అమేథీలో గెలుస్తాననే విశ్వాసం ఉంటే మళ్లీ కేరళలోని వయ్‌నాడ్ లోక్‌సభ నియోజకవగర్గంలో పోటీ చేయకుండా ఆమేథీలో నాతో పోటీపడాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.
ఇక్కడి ప్రజలు రాహుల్ గాంధీ గురించి ఏం అలోచిస్తునన్నారో? అమేథీలోని ఖాళీ రోడ్లను చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని స్మృతి ఇరానీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆమె జన సంవాద్ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల పర్యటనలో పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కంచుకోటగా ఉన్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో 2019లో రాహుల్ గాంధీ.. అనూహ్యంగా 55,000 ఓట్ల తేడాతో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశో గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ తరుఫున రాయ్‌బరేలీ సెగ్మెంట్‌లో సోనియాగాంధీ విజయం సాధించారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో ఓడిపోయి కేరళలోని వయ్‌నాడ్‌లో గెలుపొందారు. అయితే ఇటీవల సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ పెద్దల సభ(రాజ్యసభ)కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ రాయ్‌బరేలీ ప్రజలు తమ కుటుంబంతోనే ఉంటారని అన్నారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్మృతి ఇరానీ స్పందిస్తూ.. గాంధీ కుటుంబంలో ఎవరు? రాయ్‌బరేలీ ప్రజలతో ఉంటారని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం రామ్‌బరేలీ స్థానాన్ని వదిలి వెళ్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. ఇక.. అమేథీ సెగ్మెంట్ నుంచి మళ్లీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? లేదా? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత లేదు.
‘కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ.. అమేథీలో ఎవరు? పోటీ చేస్తారనే విసషంపై నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ ఇక్కడ ఇప్పటీకే మూడుసార్లు గెలిపొందారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా అమేథీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అమేథీ నియోజకవర్గం చాలా ముఖ్యమైంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ యాత్ర రేపు(మంగళవారం) యూపీలోని రాయ్‌బరేలీకి చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment