Parliament elections
-
దిస్సనాయకే విజయం సంపూర్ణం
సెప్టెంబర్‌లో శ్రీలంక అధ్యక్షునిగా అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకున్నారు. శ్రీలంక 77 సంవత్సరాల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం ఇది. మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయినప్పటికీ, వాళ్ల పార్టీ సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. అదే కారణంగా ఇండియా పట్ల వ్యతిరేకత చూపింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు అన్ని వర్గాల ఆదరణ లభించడం, ఆయన కూడా ఇండియాతో సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. చైనా, ఇండియాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరువురి మధ్య సమతుల్యత పాటించగలమనీ ప్రకటించటం గమనించదగ్గది.శ్రీలంక అధ్యక్షునిగా గత సెప్టెంబర్‌లో అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, ఈనెల 15న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచారు. ఇది శ్రీలంక 77 ఏళ్ల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం. అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు పోలైన ఓట్లు 55.89 శాతం కాగా, ఇపుడు మరొక సుమారు 10 శాతం పెరిగాయి. పార్లమెంట్ మొత్తం స్థానాలు 225 కాగా, ఆయన పార్టీ జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకత్వాన గల నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) కూటమి గెలుచుకున్నవి 159. ఇందులో ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 196 సీట్లు, శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి కిందకు వచ్చే 29 సీట్లు ఉన్నాయి. ఆ విధంగా మొత్తం 225లో ఎన్పీపీ బలం 160 అవు తున్నది. అయితే, అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు తమిళుల స్థావరం అనదగ్గ శ్రీలంక ఉత్తర భాగమైన జాఫ్నా, తమిళులతో పాటు ముస్లింలు గణనీయంగాగల తూర్పు ప్రాంతాలలో, రాజధాని కొలంబో నగరంలో ఎక్కువ ఆదరణ లభించలేదు. సజిత్ ప్రేమదాస నాయకత్వంలోని సామగి జన బలవేగాయ (ఎస్‌జేబీ) వంటి ప్రతి పక్షాలు, ఇల్లంకి తమిళ అరసు కచ్చి (ఐటీఏకే) వంటి తమిళ పార్టీలు అక్కడి ఓట్లను తెచ్చుకున్నాయి. ప్రేమదాస పార్టీ సుమారు 33 శాతం ఓట్లు, మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్ఎల్ఎఫ్ఫీ) 17 శాతం ఓట్లు సంపాదించగలిగాయి. ఇపుడు పార్లమెంట్లో ప్రేమదాస పార్టీ 40 సీట్ల స్థాయిలో నిలదొక్కుకుని ప్రతిపక్ష హోదా పొందనుండగా, తమిళుల పార్టీ ఆరుకు, రణిల్ పార్టీ ఫ్రంట్ నాలుగుకు, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష పార్టీ రెండుకు పరిమితమయ్యాయి.తమిళ ఈలమ్‌కు వ్యతిరేకంవాస్తవానికి జేవీపీ లోగడ రెండుమార్లు ప్రభుత్వంపై భారీ ఎత్తున సాయుధ తిరుగుబాట్లు జరిపిన మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయి నప్పటికీ, సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. తమిళ ఈలంను వ్యతిరేకించటమే గాక, రాజీవ్‌గాంధీ – జయవర్ధనే మధ్య 1987లో జరిగిన ఒప్పందం ప్రకారం తమిళ ప్రాంతాలకు ఇండియాలోవలె కనీసం ఒక మేర ఫెడరల్ అధికారాలకు సైతం ససేమిరా అన్నది. ఇండియాపట్ల జేవీపీ వ్యతిరేకతకు కారణాలలో ఈ 1987 ఒప్పందంతో పాటు, రాజీవ్‌గాంధీ అక్కడకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరిట సైన్యాన్ని పంపటం వంటివి ప్రధాన మైనవి. నేను శ్రీలంక వెళ్లినపుడు జేవీపీ నాయకులు కొలంబో శివార్లలోని తమ ప్రధాన కార్యాలయంలో ఈ మాటలు స్వయంగా చెప్పారు. ఈలం పోరాటంతో నిమిత్తం లేకుండా కూడా, తమిళులకు ఇండియా సానుభూతి ఎల్లప్పుడూ ఉండటం, శ్రీలంక మధ్య ప్రాంతా లలోని తమిళ తేయాకు తోటల కూలీలకు శ్రీలంక పౌరసత్వం కోసం ఇండియా పట్టుబట్టడం వంటివి ఇతర కారణాలు. నిజానికి తేయాకు తోటల తమిళులు ఎల్టీటీఈ, ఈలం లక్ష్యానికి పెద్ద మద్దతుదారులు కారు. వారి సమస్యలు వేరే. ఈ విషయాలు జేవీపీకి కూడా తెలుసు. అయినప్పటికీ అనుమానాలు తొలగిపోలేదు. ఇదే తరహా అను మానాలు తూర్పున బట్టికలోవా, పశ్చిమాన రాజధాని కొలంబో ప్రాంతాలలో తగినంత సంఖ్యలోగల ముస్లిముల పట్ల కూడా ఉన్నాయి. తమిళులకు ఇండియా వలె, ముస్లిములకు పాకిస్తాన్ మద్దతు ఉందనేది వారి మరొక ఆరోపణ.సాహసించి పార్లమెంటు రద్దుఎన్నికల సందర్భంలో ఈ చర్చ అంతా ఎందుకంటే, ఈ విధమైన దీర్ఘకాలపు విభేదాలు ఉండినప్పటికీ తమిళులు, ముస్లిములు పార్ల మెంట్ ఎన్నికలలో తమ సంప్రదాయిక పార్టీలను, ఇతర జాతీయ పార్టీలను తిరస్కరించి దిస్సనాయకే కూటమిని బలపరచటం. ఈ మార్పులోని రహస్యమేమిటి? ఒకటి, ఉన్నత వర్గాలను మినహాయిస్తే అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల సామాన్య ప్రజలు సంప్రదాయిక, పెద్ద పార్టీలతో విసిగిపోయారు. రెండు, తాము దేశాన్ని బాగుపరచ గలమన్న దిస్సనాయకే మాటను నమ్మారు. శ్రీలంకలో రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అధ్యక్ష విధానం ఉంది. అయినప్పటికీ పూర్తి స్థాయి క్యాబినెట్ నియామకానికి, కొన్ని విధాన నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం అవసరం. అందుకు పార్లమెంట్లో ఆధిక్యత, వీలైతే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. లేనిదే దిస్సనాయకే అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజల కిచ్చిన హామీలను సరిగా అమలు పరచలేరు. పాత పార్లమెంట్లో 225 స్థానాలలో గల మూడంటే మూడు స్థానాలతో చేయగలిగింది శూన్యమైనందున, వెంటనే సాహసించి పార్లమెంట్‌ను రద్దు చేశారు. దేశంలో మార్పులు తెచ్చేందుకు మూడింట రెండు వంతుల ఆధిక్యత నివ్వవలసిందిగా ప్రజలను కోరారు. చివరకు ఆ విధంగానే తీర్పు చెప్పారు ప్రజలు. శ్రీలంకలో పదవీ కాలం ఇండియాలో వలెనే అయిదేళ్ళు. మార్పులు తెచ్చేందుకు దిస్సనాయకేకు తగినంత సమయం ఉందన్నమాట. ఏదెంత జరుగుతుందన్నది అట్లుంచితే, 55 సంవత్సరాల వయసుగల ఆయనను విద్యార్థి దశ నుంచి గమనిస్తున్న వారికి, ఆయన ఆలోచనలు, ఆచరణ పట్ల మాత్రం ఎటువంటి సందే హాలు ఉన్నట్లు కనిపించదు.ఇండియాతో సత్సంబంధాలు?దిస్సనాయకే ప్రభుత్వం చేయవలసింది చాలా ఉంది. 2022లో ప్రజల నుంచి విస్తృతమైన నిరసనలకు కారణమైన ఆర్థికరంగ దివాళాను సరిదిద్దటం, ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అందులో ప్రధానమైనవి. దానితోపాటు ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామనీ, స్థానిక వ్యాపారులను ఆదుకోగలమనీ, అవినీతిపై కఠిన చర్యలుండగలవనీ, ప్రభుత్వంలో వృథా ఖర్చులు లేకుండా చూడగలమనీ కూడా అన్నారాయన. కానీ రుణభారం తక్కువ కాక పోగా, అధ్యక్షుడైనప్పుడు తక్షణ అవసరాల కోసం ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల కొత్త అప్పు తీసుకున్నారు. చైనాతో సత్సంబంధాలు గతం నుంచే ఏ పార్టీ పాలించినా ఉండగా, ఇండియా విమర్శ కుడైన దిస్సనాయకే ఈ పరిస్థితుల దృష్ట్యా ఇండియాతోనూ సత్సంబంధాలకు, ఆర్థిక సహకారానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. తన ఎన్నికకు ముందే భారతదేశాన్ని సందర్శించి ఆయన, ఆ తర్వాత విదేశాంగ మంత్రి విజిత హెరాత్‌ను కూడా పంపారు. భారత ప్రభుత్వం అవసరమైన హామీలనిచ్చింది కూడా. తాము చైనా, ఇండి యాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరు వురి మధ్య సమతుల్యత పాటించగలమని దిస్సనాయకే మొదట్లోనే ప్రకటించటం గమనించదగ్గది. ఇప్పటికే విదేశాంగ మంత్రితోపాటు, ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవంగల హరిణి అమరసూరియను ప్రధానిగా నియమించిన ఆయన, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. విధాన ప్రకటనలు, బడ్జెట్‌ను తెచ్చినపుడు పూర్తి స్పష్టత వస్తుంది.ఇవన్నీ చేసినా తమిళులు, ముస్లిముల సమస్యలు ప్రత్యేకమైనవి గనుక అందుకు పరిష్కారాలను కనుగొనటం ఒక సవాలు. ప్రభాకరన్ మరణం తర్వాత ఈలం నినాదం లేకుండా పోయిందిగానీ, వారికి భూములు, భాష, సమానావకాశాలు, వివక్షల తొలగింపు, పౌర హక్కులు వంటి సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయి. ముస్లిములకు కూడా తమపట్ల వివక్ష వంటి సమస్యలున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే తమిళుల సమస్యలు వేరే. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇవి క్రమంగానైనా పరిష్కార మార్గంలో సాగని పక్షంలో ఏదో ఒక రోజున తిరిగి సమస్యల రూపంలో ముందుకొస్తాయి. వీటన్నింటినీ గమనిస్తూ కొత్త ప్రభుత్వం శ్రీలంక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో NPP విక్టరీ
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఎన్పీపీ కూటమి.. ఇప్పటికే మూడింట రెండో వంతు సీట్లను దక్కించుకుని మెజారిటీని చేరుకుంది.225 మంది సభ్యులున్న లంక పార్లమెంట్లో.. ఇప్పటిదాకా 123 సీట్లను ఎన్పీపీ కైవసం చేసుకుంది. సుమారు 62 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత శ్రీలంకలో ఇది తొలి పార్లమెంట్ ఎన్నిక. సెప్టెంబరు 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయారు అనుర కుమార దిస్సనాయకే. దీంతో.. ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి.దేశాభివృద్ధి కోసం తాను ప్రతిపాదించిన విధానాల అమలుకు 113 సీట్లైనా(సాధారణ ఆధిక్యం) సాధించేందుకు ప్రయత్నిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఎన్పీపీ కూటమికి ఎంతో దోహదపడింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. రాజపక్సే సోదరులు.. మహింద, గొటబాయ, చమల్, బసిల్ ఎవరూ కూడా బరిలో దిగలేదు.శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. మొత్తం 1.70కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకొంటారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యాలను కేటాయించవచ్చు. అయితే.. మొత్తం 225 పార్లమెంట్ సీట్లలో 196 స్థానాలకు మాత్రమే ఎంపీలను ఇలా ఎన్నుకొంటారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8,821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్ట్ సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్‌లకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు/గ్రూప్‌లకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు. -
అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు
టోక్యో: అధికార పగ్గాలు చేపట్టేలోపే జపాన్ కాబోయే ప్రధాని షిగెరు ఇషిబా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిచ్చారు. నేడు ప్రధానిగా ప్రమాణం చేయనున్న ఇషిబా సోమవారం మాట్లాడారు. ‘‘ నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తా’’ అని అన్నారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఇషిబా విజయం సాధించడం తెల్సిందే. దీంతో ఫుమియో కిషిద వారసుడిగా ఇషిబా ఎంపికయ్యారు. మంగళవారం ప్రమాణస్వీకారం కోసం ఎల్డీపీ ముఖ్యనేతలంతా సిద్దమవుతున్న వేళ ఇషిబా తదుపరి ఎన్నికలపై ముందే ఒక ప్రకటనచేయడం గమనార్హం. -
బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మర్... పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం... రిషి సునాక్ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మోదీ కేబినెట్లో ఇదొక సర్ప్రైజ్ ప్యాక్!
కేంద్ర మంత్రివర్గంలో చోటు పొందడం అంటే అది ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. దేశం అంతటిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ముగ్గురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు టీడీపీవారు. తెలుగుదేశం పార్టీ నాలుగు మంత్రి పదవులు ఆశించినా రెండు మాత్రమే లభించాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు లభించింది.వీరిలో అనూహ్యమైన పేరు వర్మ అని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఏపీలో ఒక సాధారణ నేత. భీమవరం ప్రాంతంలో బాగా తెలిసిన వ్యక్తే అయినా, ఇంత వేగంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడు అవుతారని ఎవరూ ఊహించలేదు. రాజకీయాలలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేమనడానికి వర్మ ఒక ఉదాహరణ అవుతారు. ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఆయన టీవీ షోలలో బీజేపీ తరపున చర్చలలో పాల్గొంటుండేవారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. తదుపరి పార్టీ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి కేటాయించిన నరసాపురం నుంచి ఎంపీ పదవికి పోటీచేయాలని వైఎస్సార్సీపీ దూరం అయిన సిట్టింగ్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గట్టి ప్రయత్నం చేశారు. ఆయన కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక పక్షం సీటు ఇస్తుందని ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపలేదు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని అందువల్లే టిక్కెట్ ఇవ్వలేదని ఆ పార్టీవారు చెప్పినా, అది సాకు అని చాలా మంది భావించారు. దాంతో రఘురామ టీడీపీలో చేరి ఉండి స్థానం నుంచి పోటీచేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసాపురంలో క్షత్రియ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఉన్న వారిలో ఈయనే ప్రముఖుడుగా తెరపైకి వచ్చారు. బహుశా వర్మ కూడా ఊహించి ఉండకపోవచ్చు. వర్మను మార్చించాలని కొంతమంది ప్రయత్నం చేయకపోలేదు. అయినప్పటికీ, పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా వర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కలిగించారు. వర్మ ఇక్కడ నుంచి గెలుస్తారా? లేదా? అనే సంశయం తొలుత ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ తన అభ్యర్ధిగా బీసీ నేతను ఎంపిక చేసుకోవడం వర్మకు కలిసి వచ్చిందని చెప్పాలి.నరసాపురంలో ఎక్కువసార్లు క్షత్రియవర్గం వారే ఎంపీలు అవుతూ వచ్చారు. ఆ సామాజికవర్గం తక్కువ సంఖ్యలోనే ఉన్నా, వారి పలుకుబడి చాలా పెద్దదిగా భావిస్తారు. అదంతా వర్మకు ప్లస్ పాయింట్ అయింది. మనిషి కూడా సౌమ్యుడుగా పేరొందారు. అన్నీ కలిసి వచ్చి వర్మ ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఇది కలయో, నిజమో అనుకునేంతలోనే ఈ రాజకీయ పరిణామాలు జరిగిపోయాయి. రాజకీయాలలో కాకలు తీరిన సీ.ఎమ్ రమేష్, పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలను కాదని వర్మవైపు బీజేపీ మొగ్గుచూపి కేంద్రంలో స్థానం కల్పించారు. ఒకరకంగా రమేష్, పురందేశ్వరిలకు కాస్త అసంతృప్తి కలిగించే అంశమే అయినా, దాని గురించి మాట్లాడకపోవచ్చు.పురందేశ్వరి కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి 2014, 2019లలో పోటీచేసినా గెలవలేకపోయారు. అయినా పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. తదుపరి ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దాంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మాజీ సీఎం ఎన్.టి రామారావు కుమార్తెగా కూడా ఆమె అందరికి తెలిసిన నేతగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడంలో ఆమె గట్టి ప్రయత్నం చేశారు. అందుకు అధిష్టానం కూడా అంగీకరించింది. ఆమె రాజమండ్రి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. కారణం ఏమో కానీ ఆమెకు అవకాశం రాలేదు. స్పీకర్ లేదా, డిప్యూటి స్పీకర్ వంటి పదవి ఏదైనా వస్తుందా అని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు.ఇక మరో కీలకమైన నేత సీఎం రమేష్. ఆయన రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతో ముడిపడి ఉంది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత మనిషిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్యభూమిక పోషించారని చాలామంది విశ్వసిస్తారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకునేలా అధిష్టానాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారని చెబుతారు. ఆ తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అనకాపల్లి స్థానాన్ని ఎంపిక చేసుకుని బీజేపీ టిక్కెట్ సాధించగలిగారు.కడప జిల్లాకు చెందినవారైనప్పటికీ, తన అంగ, అర్ధ బలంతోపాటు, అక్కడ ఉన్న టీడీపీ నేతలంతా తనకు బాగా తెలిసినవారే కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా ఆయన విజయం సాధించిన తర్వాత కచ్చితంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కేంద్ర మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పక్షాన కింజారపు రామ్మోహన్ నాయుడు మూడోసారి లోక్ సభకు ఎన్నికై మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పొందారు. ఇది అరుదైన విషయమే. ముప్పై ఆరేళ్ల వయసులోనే ఈ స్థాయికి రావడం గొప్ప సంగతే.రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రంలో యునైటెడ్ ప్రంట్ టైమ్ లో మంత్రి పదవి చేశారు. వాజ్ పేయి ప్రభుత్వ టైమ్ లో స్పీకర్ అవుతారని భావించారు. కానీ ఆ పదవి జి.ఎమ్.సి బాలయోగిని వరించింది. బాలయోగి అనూహ్య మరణం తర్వాత ఆ పదవి వస్తుందని ఆశించారు. కానీ గుజరాత్ పరిణామాల నేపథ్యంలో పదవి తీసుకోవడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దాంతో ఎర్రన్నాయుడు కు మళ్లీ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు పదవి దక్కడం విశేషం. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు, కేంద్రంలో పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ భాషలలో పట్టు ఉండడం ఈయనకు కలిసి వచ్చే పాయింట్ అని చెప్పాలి. యువకుడు, పార్టీకి కట్టుబడి పనిచేయడం ప్లస్ అయింది. టీడీపీ ఎంపీలలో వరసగా మూడుసార్లు ఎంపీ అయిన వ్యక్తి ఈయనే. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. గుంటూరు నుంచి ఈసారి గల్లా జయదేవ్ పోటీచేయకపోవడంతో రామ్మోహన్ కు పోటీ లేకపోయిందని చెప్పవచ్చు. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కూడా కేంద్రంలో పదవి రావడం విశేషం. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఈయనకు చాన్స్ వస్తుందన్న భావన ఏర్పడింది. దానికి తగ్గట్లే టీడీపీ నాయకత్వం ఈయనకు అవకాశం కల్పించింది. ఆరువేల కోట్ల సంపద కలిగిన నేతగా ప్రచారంలో ఉన్న ఈయన కేంద్రంలో మంత్రి అయ్యారు. జనసేన నుంచి వి. బాలశౌరి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా ఎందుకో కాలేకపోయారు. ఆయన గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉండేవారు. ఈ ఎన్నికలలో జనసేన నుంచి మచిలీపట్నంలో గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి తీసుకోవడానికి ప్రస్తుతం సిద్దపడలేదని, అందుకే బాలశౌరికి అవకాశం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పదవి దక్కించుకున్నారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అంబర్ పేట నుంచి ఓటమి చెందడమే ఈయనకు వరం అయింది. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి విజయం సాధించడం, మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కడం జరిగిపోయాయి. ఆ రకంగా ఈయన రాజకీయ భవిష్యత్తు మారిపోయింది. పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో క్యాబినెట్ హోదాకు ఎదిగిన నేత ఈయన. ప్రజలతో మమేకం అవడం ద్వారా ఆదరణ చూరగొన్నారు. మరో నేత బండి సంజయ్ కు కేంద్రంలో స్థానం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈయన రాజకీయ ప్రస్తానం కరీంనగర్ మున్సిపల్ రాజకీయాల నుంచి కావడం విశేషం.అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పొందినా, తదుపరి కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికవడం, ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం ఒక సంచలనం. ఫైర్ బ్రాండ్ గా అనతికాలంలోనే పేరొందిన ఈయన అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే సాగించారు. ఈయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరిని ఆశ్చర్యపరచింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. దానిని గుర్తించిన పార్టీ నాయకత్వం పార్టీలో జాతీయ హోదా కల్పించింది. తిరిగి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది.సీనియర్ నేత డీకే అరుణ, మరో నేత ఈటల రాజేందర్ లు కూడా కేంద్రంలో పదవులు ఆశించారు. కానీ దక్కలేదు. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చినందున అరుణకు అవకాశం ఉండదు. అలాగే బండి సంజయ్ కు లభించిన తర్వాత ఈటలకు చాన్స్ రాదు. కాకపోతే ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని చెప్పడానికి ఈటల రాజకీయ జీవితం కూడా ఉదాహరణే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కున్నారు. ఒక షెల్టర్ గా ఉంటుందని భావించి బీజేపీలో చేరారు. అది ఆయనకు కలసి వచ్చింది. గత శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందినా, మల్కాజిగిరి నుంచి ఎంపీ కాగలిగారు.మొత్తం మీద చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు అందుకే పదవులు దక్కాయి. దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, డి.కె అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కావడం గమనార్హం. టీడీపీ నుంచి ఒక బీసీ నేతకు, బీజేపీ నుంచి మరో బీసీ నేతకు అవకాశం వచ్చింది. ముగ్గురు అగ్రవర్ణాల వారికి మంత్రి పదవులు దక్కాయి. వీరందరికి అభినందనలు చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై: వీకే పాండ్యన్
ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేడీ ఘోర ఓటమి చవిచూడటంతో క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ అధికారి, ఆ పార్టీ నేత వీకే పాండ్యన్ ప్రకటించారు. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కు సాయంగా ఉండేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. -
ఇకపై.. తెలంగాణలో ఆ పార్టీలే కీలక పాత్ర పోషించనున్నాయా?
తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సగం మోదం, సగం ఖేదం దక్కింది. కాంగ్రెస్ పార్టీకి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు వస్తాయని ఆ పార్టీ అంచనా వేసినా, ఎనిమిదితోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. గతంలో నాలుగు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఎనిమిదికి పెరగడం విశేషం. ఈ పార్టీకి శాసనసభలో కూడా ఎనిమిది మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. కచ్చితంగా బీజేపీకి ఇది మేలి మలుపువంటిదే.2028 శాసనసభ ఎన్నికలలో గట్టిగా పోటీ పడడానికి ఈ ఫలితం ఉపకరిస్తుంది. బీఆర్ఎస్కు పార్లమెంటు ఎన్నికలు పూర్తి నిరాశ మిగిల్చాయి. పార్టీకి భవిష్యత్తు మీద ఆశ ఉన్నా, జనంలో పట్టు సాధించడానికి చాలా శ్రమపడవలసి ఉంటుంది. కాంగ్రెస్ సంగతి చూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరిగిన తొలి ముఖ్యమైన ఎన్నికలు. ఇందులో పదికి పైగా సీట్లు వచ్చి ఉంటే ఆయనకు పార్టీలో మంచి పేరు వచ్చేది. కానీ ఎనిమిది సీట్లే వచ్చాయి. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే బీజేపీకి కూడా అన్ని సీట్లే వచ్చాయి కనుక. ఒకవేళ బీజేపీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్‌కు చికాకుగా ఉండేది. అంతవరకు కాంగ్రెస్‌కు, రేవంత్‌కు మోదం కలిగించే అంశమే.అయినా ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే కాంగ్రెస్‌కు ఇది కొంత ఇబ్బంది కలిగించే ఫలితంగానే చూడాలి. అరవైనాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లే. కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఎనిమిది సీట్లు అన్న వ్యాఖ్య సహజంగానే వస్తుంది. రేవంత్‌కు ఎక్కడ సమస్య వస్తుందంటే ఆయన ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ అసెంబ్లీ సీటు ఉన్న మహబూబ్‌నగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నేత డీకే అరుణ విజయం సాధించడం. ఆమెను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు. అయినా ఓడించలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓటమి చెందారు. కొందరు కాంగ్రెస్ నేతలే సహకరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నైతిక ప్రభావం రేవంత్‌పై కొంత ఉటుంది.అలాగే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ గెలిచారు. ఇది కూడా ఆయనకు అసంతృప్తి కలిగించేదే. ఎందుకంటే ఈ రెండు సీట్లను కాంగ్రెస్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదే టైమ్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతంలోని నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలిచింది. అంటే రేవంత్ కన్నా స్థానికంగా తామే బలవంతులమన్న సంకేతాన్ని వీరు ఇచ్చారు. మాజీ మంత్రి కే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఏకంగా రికార్డు స్థాయిలో 5.80 లక్షల ఓట్ల ఆధిక్యతతో నవిజయం సాధించడం ఒక సంచలనం. నల్గొండ కాంగ్రెస్‌కు గట్టి స్థావరమే అయినా, ఈ స్థాయిలో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.భువనగిరిలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకు సన్నిహితుడుగా పేరొందారు. సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పక్షాన మరోసారి గెలిచి తన సత్తా చాటారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ గెలిచినా, ఈ ఎన్నికలలో కిషన్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. మల్కాజిగిరిలో లోకసభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుంటే బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన ఈటెల రాజేందర్‌కు అదృష్టం కలిసి వచ్చింది. బీఆర్ఎస్ బలం అంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే బీఆర్ఎస్ నేతలు తమకు ఏదైనా అవసరం వస్తే షెల్టర్‌గా ఉపయోగపడుతుందన్న భావనతో బీజేపీకి పరోక్షంగా సహకరించి ఉండాలి. లేదా ప్రజలలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల కన్నా బీజేపీ బెటర్ అన్న భావన ఏర్పడి ఉండాలి. కాంగ్రెస్‌కు మహబూబ్‌నగర్‌తో పాటు మల్కాజిగిరి సీటులో ఓటమి ఎదురవడం పార్టీలో చర్చ అవుతుంది. ఇప్పటికిప్పుడు రేవంత్‌ను ఎవరూ ఏమి అననప్పటికి, కాలం గడిచే కొద్ది జరిగే పరిణామాలలో కాంగ్రెస్ నేతలే దెప్పి పొడిచే అవకాశం ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ తనను బలి చేసుకుని బీజేపీకి సాయపడిందని రేవంత్ వ్యాఖ్యానించారు.2019 ఎన్నికలలో నాలుగు సీట్లే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎనిమిది తెచ్చుకుందని ఆయన చెప్పవచ్చు కానీ కేవలం మాట వరసకు సమర్ధించుకోవడమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉందన్న సంగతి మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం మైనస్‌గా ఉంది. దాని ప్రభావం కొన్ని ఏరియాలలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల వంటి పార్లమెంటు సీట్లలో చోట్ల బీజేపీ పాగా వేసింది. ఈ స్థానాలలో కాంగ్రెస్ పట్టు సాధించలేకపోయింది. ఇది ఆ పార్టీకి బలహీనతగానే ఉంటుంది. కాంగ్రెస్ ఈ స్థానాలలో నిలబెట్టిన ఫిరాయింపుదారులంతా ఓటమిపాలయ్యారు.సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేయగా, బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా చేవెళ్ల నుంచి, మరో బీఆర్ఎస్ నేత పీ మహేందర్ రెడ్డి భార్య సునీత మల్కాజిగిరి నుంచి పోటీచేసి పరాజయం చెందారు. వరంగల్ లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి ఊహించిన రీతిలో ఘనంగా గెలిచారు. మరో మాజీ మంత్రి బలరాం నాయక్ మహబూబబాద్‌లో విజయం సాధించారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే జి వివేక్ కుమారుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలులో సీనియర్ నేత మల్లు రవి గెలుపొందారు. ఈ ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయానికి సూచిక అని కిషన్ రెడ్డి అన్నప్పటికీ అది అంత తేలికకాదు.ప్రస్తుతం 38 అసెంబ్లీ సీట్లు ఉన్న బీఆర్ఎస్ ఈ పార్లమెంటు ఎన్నికలలో ఆశలు వదలుకుంది. అందువల్లే వారు అసలు గెలవలేకపోయారు. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ ఏ రకంగా ప్రజలను ప్రభావితం చేయగలుగుతారన్న దానిపై కూడా బీజేపీ విజయావకాశాలు ఉంటాయి. బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు. ఈ నాలుగేళ్లలో ఎంతవరకు పెంచుకుంటారో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ఒక వేవ్ మాదిరి మెదక్ తదితర చోట్ల గెలిచారు. మెదక్‌లో బీజేపీ నేత రఘునందనరావు విజయం సాధించారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఎంపీ అయ్యారు. కేసీఆర్, హరీష్‌రావు ప్రాతినిద్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఈ ఎంపీ సీటు పరిధిలోనే ఉన్నప్పటికీ బీజేపీ గెలవడం వారికి కాస్త అప్రతిష్టే అని చెప్పక తప్పదు.ఇంతవరకు బీఆర్ఎస్ ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తోంది. కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌లు మరోసారి గెలవడం ద్వారా బీజేపీ పట్టు నిలబెట్టుకున్నట్లయింది. ఎప్పటి నుంచో ఎంపీ కావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ నేత టీ జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ జీ నగేష్ గెలుపు సాధించారు. మహబూబ్‌నగర్‌లో గెలిచిన డీకే అరుణ సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరి టిక్కెట్ సంపాదించారు. ఆ పార్టీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని ఈమెకు సీటు ఇచ్చింది. ఇక చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గెలుపొంది గతంలో కోల్పోయిన పట్టును తిరిగి పొందారు. ఈయనది ఒకరకంగా వ్యక్తిగత విజయంగా చెప్పుకోవచ్చు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి హైదరాబాద్ నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు.ఈ మొత్తం ప్రక్రియలో బాగా దెబ్బతిన్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. లోక్ సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సభలకు జనం బాగానే వచ్చారు. అయినా ఒక్క సీటు కూడా రాకపోవడం వారికి బాధాకరమైన విషయమే. కాకపోతే ఇదేమీ ఊహించని విషయం కాదు. ఇప్పుడు వారు పార్టీ పునర్మిర్మాణంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి తిరిగి పార్టీని పెంపొందిస్తేనే వచ్చే శాసనసభ ఎన్నికలలో నెగ్గే అవకాశం ఉంటుంది.బీజేపీ ఇంకా పుంజుకుంటే బీఆర్ఎస్కు గడ్డు కాలమే అవుతుంది. ఈ లోగా బీజేపీ లేదా కాంగ్రెస్‌తో పొత్తులోకి వెళితే అప్పుడు రాజకీయాలు మరోరకంగా ఉంటాయి. దానిపై అప్పుడే ఒక కంక్లూజన్‌కు రాలేము. కాంగ్రెస్, బీజేపీలకు చెరి సమానంగా సీట్లు రావడం ద్వారా ఈ రెండుపార్టీలే భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలలో మెయిన్ ప్లేయర్లుగా ఉంటాయా అనే చర్చ జరగవచ్చు. కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను అంత తొందరగా తీసివేయలేం.ఫీనిక్స్ పక్షి మాదిరి మళ్లీ పైకి లేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడం బాగానే ఉంది కానీ, అందుకు చాలా వ్యూహాలు అమలు చేయవలసి ఉంటుంది. మళ్లీ జనంలో బీఆర్ఎస్పై విశ్వాసం పెంచుకోగలగాలి. కాంగ్రెస్, బీజేపీలకన్నా తామే బెటర్ అని ప్రజలలో నమ్మకం కలిగించగలగాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాలలో మరికొన్నిటిని అయినా అమలు చేసి ప్రజలలో పరపతి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి బీజేపీ కాచుకు కూర్చుని ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వెల్డన్ గురు..
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి విజయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలన్నీ కూటమి అభ్యర్థులకే అనుకూలంగా వస్తుండడంతో తిరుపతి పార్లమెంట్ కూడా బీజేపీ అభ్యర్థే గెలుస్తారని ధీమాగా అనుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి చేసిన కృషిని, ఆయన మంచితనంపై అసత్యాలు, అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఓటర్లు మద్దెల గురుమూర్తికే పట్టం కట్టారు. ఊహించని విధంగా తిరుపతి ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కూటమి నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలవ్వగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గొప్ప గెలుపు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘క్రాస్’ చేయాలని చూసి బోల్తా పడిన కూటమి.. తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి అనుకూలంగా భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టం అవుతోంది. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఎంపీ కావడంతో నియోజకవర్గానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనతో పని చేశారనేది గురుమూర్తికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కూటమి ఎంపీ అభ్యర్థి చేసిన దు్రష్పచారాలు ఫలించలేదు. క్రాస్ ఓటింగ్ చేయించి గట్టెక్కాలని భావించారు. కానీ గురుమూర్తి మంచితనం, కృషి ముందు కూటమి కుట్రలు ఏవీ పనిచేయలేదు. అదెలా అంటారా? తిరుపతి లోక్‌సభ పరిధిలోని తిరుపతిలో 60,255 ఓట్లు, శ్రీకాళహస్తిలో 41,979, సూళ్లూరుపేటలో 28,362, వెంకటగిరిలో 15,454, గూడూరులో 19,915, సర్వేపల్లిలో 15,994 ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఈ మెజారిటీలను చూస్తే కూటమి అభ్యర్థే ఘనవిజయం సాధించాలి. కానీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వచ్చేసరికి ఓటర్లు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపారు. సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతో పాటు కూటమి అభిమానులు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యరి్థని గెలిపించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులంతా గెలిచి, ఎంపీ అభ్యర్థి ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. తిరుపతి జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి గత మూడేళ్లుగా అనేక ప్రయత్నాలు చేశారు. కంపెనీల చుట్టూ తిరుగుతూ వారిని జిల్లావ్యాప్తంగా తిప్పి కంపెనీలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన వసతులు అన్ని తామే సమకూర్చగలమని విన్నవించారు. తద్వారా ప్రజల్లో గురుమూర్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నిస్వార్థంగా ప్రజలకు ఎంతో కొంతమేలు చేయాలనే తత్వం, ఆ కష్టానికి ప్రజల ఆశీర్వాదం మళ్లీ లభించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు చాలామంది ఓడిపోయినా గురుమూర్తి గెలిచారంటే అది ఆయన కష్టాలకు తగిన ఫలితమే అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎంపీగా గురుమూర్తి అధికారాన్ని పదిమందికి సాయం చేయడంతో పాటు కార్యకర్తలకు, ఓటర్లకు దగ్గర కావడమే ఆయనకు విజయానికి కారణమని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కలిసొచ్చిన అంశాలు ఇవే.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2021 ఉప ఎన్నికల్లో గురుమూర్తి తొలిసారి రాజకీయ ప్రవేశం చేసి తిరుపతి ఎంపీగా 6,2 6,108 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యరి్థ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2,71,592 లక్షల మెజారీ్టతో గెలుపొందారు. 👉 ఎంపీగా గత మూడేళ్ల కాలంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సహకారంతో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. 👉 గత మూడేళ్లలో ఎంపీగా గురుమూర్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 👉 తిరుపతి పరిధిలో కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, పులికాట్ సరస్సు పరిధిలోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలు సడలించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సహకారంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వందలాది గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య పరిష్కారానికి అధికారిక ప్రక్రియ ప్రారంభింపజేశారు. 👉 అలాగే 16 వేల కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఆరోగ్య సంరక్షణకు వెల్నెస్ సెంటర్ తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 👉 వేలాదిమంది యువతకు ఇంజినీరింగ్ నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వ నైలెట్ సంస్థ తిరుపతికి మంజూరు చేయించారు. 👉 స్విమ్స్, డీఆర్డీఓ అనుబంధ సంస్థ డేబెల్‌తో తక్కువ ఖరీదుకే రోగులకు మెడికల్ ఇంప్లాంట్స్ తయారు చేసే ప్రాజెక్టు తీసుకొచ్చారు. 👉 రైల్వే ప్రాజెక్టుల పురోగతిలో తనదైన ముద్ర వేశారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.350 కోట్లతో ప్రాజెక్టు పనుల వేగం పెంచారు. 👉 తిరుపతి ప్రజలకు నరకంగా ఉన్న రాయలచెరువు రైల్వే గేటును తొలగించి అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయించారు. 👉 ఏర్పేడు, వెంకటగిరి రైల్వే ఫ్లైఓవర్లు మంజూరు చేయించారు. 👉 తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 లక్షలు నిధులు ఇచ్చారు. 👉 యూనివర్సిటీ రోడ్డులో ఉన్న రైల్వే డీఐకాన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 👉 వెంకటగిరి కేంద్రీయ విద్యాలయాలన్ని ఇంటరీ్మడియెట్ స్థాయికి పెంచి విద్యార్థులు అక్కడే చదువుకునేలా చర్యలు చేపట్టారు. -
ఎన్నికల్లో పట్టివేతలు : రూ.200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన సోదాల్లో రూ.200,27,60,036 విలువైన నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర విలువైన పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో నగదు రూ.99,16,15,968 పట్టుబడినట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 466 ఫ్లయింగ్ స్వాడ్లు, 89 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు కొనసాగాయి.సోదాల్లో రూ.11,48,00,955 విలువైన మద్యం పట్టుబడింది. రూ.14,52,53,412 విలువైన నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 92.271 కిలోల బంగారం, 178.657 కిలోల వెండి పట్టుబడింది. ఇవికాకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెచ్చిన మరో రూ.11,91,06,661 విలువైన వస్తువులు ఉన్నాయి. ఇక 7,272 లైసెన్స్ కలిగిన ఆయుధాలను, మరో 20 లైసెన్స్‌లేని ఆయుధాలను జప్తు చేసినట్టు డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర వస్తువులు కలిపి రూ.46.3 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించింది. -
గులాబీ పార్టీకి వెరీ వెరీ టఫ్ టైం!
తెలంగాణ రాజకీయాలలో పార్లమెంటు ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఒక పెద్ద పరీక్ష కాబోతుండగా, బీజేపీకి ఒక గేమ్‌గా మారబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దానికి కారణం తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఒకటైతే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను రుజువు చేసుకోలేకపోతే తదనంతర పరిణామాల వల్ల నష్టపోయే అవకాశం ఉందన్న భావన మరొకటి అని చెప్పాలి.బీఆర్ఎస్ విషయం చూద్దాం. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రుజువు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ది సంగతి ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా అహంభావంతో వ్యవహరించారన్న విమర్శ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. సొంత పార్టీవారిని కూడా పెద్దగా కలవకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభ ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులను మార్చవలసి ఉన్నా, మార్చకపోవడం, తనపైనే అంతా నడుస్తుందన్న అభిప్రాయంతో రాజకీయం చేయడం వంటి కారణాల వల్ల ప్రజలలో అసమ్మతి ఏర్పడింది. నిజానికి ఆయన ఓ ఇరవై, ముప్పై మంది అభ్యర్దులను మార్చి ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చేవారన్నది ఎక్కువ మంది ఫీలింగ్.సాధారణ ఎన్నికల ముందు వివిధ ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారం చేజిక్కించుకుందంటే ప్రజల అభిప్రాయాలు ఎంత త్వరగా మారతాయో గమనించవచ్చు. ఆ విషయాన్ని కేసీఆర్ పసికట్టలేకపోయారు. అక్కడికీ హైదరాబాద్ ప్రాంతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్దిపనులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడడం వంటి కారణాలతో బీఆర్ఎస్ స్వీప్ చేసింది. కానీ ఇతర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో బాగా దెబ్బతింది. ఫలితంగా అధికారాన్నే వదలుకోవల్సి వచ్చింది. అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ నేతల వ్యవహార సరళి ఎలా మారిపోయిందో చూడవచ్చు. అంతవరకు కేసీఆర్ పిలిస్తే చాలు అన్నట్లుగా ఉన్న నేతలు కొందరు ఓటమి తర్వాత మొహం చాటేసేవారు.కేసీఆర్ సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకోవడం కన్నా ఇతరపార్టీల నేతలను తీసుకు వచ్చి అందలం ఎక్కించడం ద్వారా బలపడదామని అనుకున్నారు. కానీ అదే బెడిసికొట్టింది. ఉదాహరణకు సీనియర్ నేత కే. కేశవరావు మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే అని చెప్పకతప్పదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జారుకున్నారు. కేశవరావుకు ఉన్న ప్రజాబలం పునాది చాలా తక్కువే అయినా, కేవలం నోరు పెట్టుకుని రాజకీయాలలో చెలామణి అయ్యారంటే అతిశయోక్తి కాదు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ నుంచి వచ్చిన నేత అయినా.. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రాధాన్యత తగ్గించారన్న భావన ఉంది. కడియం శ్రీహరి కోరుకున్నట్లు ఆయన కుమార్తెకు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయినా దానిని వదలుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లడం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. దాంతో బీఆర్ఎస్ బలహీనపడుతోందన్న సంకేతం జనంలోకి వెళ్లింది.మరో కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌కు రెండుసార్లు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాటలోనే ఉన్నారు. కానీ వారంతా పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్కు నాలుగు, ఐదు సీట్లు వస్తే వలసలు తగ్గుతాయి. కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూలు సీట్లలో కొన్ని రాకపోతాయా? అని ఆశాభావంగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఒకటి లేదా రెండు వస్తే గొప్పేనని అంటున్నారు.మెదక్ సీటుపై కొంత ఆశ ఉంది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో వచ్చే మెజార్టీతో గట్టెక్కవచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. ఒకవేళ ఈ సీటు కూడా రాకపోతే పార్టీకి కష్టాలు తప్పవు. కేసీఆర్ జారి గాయపడి కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవడం కొంత నష్టం చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. కేటీఆర్, హరీష్‌రావు వంటివారు ఎంత గట్టిగానే పనిచేసినా, ప్రతిపక్ష నేత అసెంబ్లీలోకి రాకపోవడం బలహీనతగానే చూడాలి. పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాతే పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లయింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడం ఉపశమనం కలిగించింది. అయినా ఓట్లు పడతాయా?లేదా? అనేది చెప్పలేని పరిస్థితి.పార్లమెంటు ఎన్నికలలో ఐదు సీట్లు గెలిచినా, లేకపోయినా కేసీఆర్ వ్యవహరించే శైలిపైనే ఆయన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రజలు తమ ఓట్లను ఈ ఎన్నికలలో బీజేపీకి వేశారన్న అభిప్రాయం ప్రబలింది. బీఆర్ఎస్ గెలవలేదన్న భావనతో పలువురు ఇలా చేశారన్నది ఒక వాదన. దీనిని కేసీఆర్ కానీ, ఆయన పార్టీవారు కానీ అంగీకరించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ ఐదేళ్లు నిలబడుతుందా? లేక బీజేపీ పుంజుకుని బీఆర్ఎస్ను దెబ్బతీస్తుందా? అన్నది ఫలితాలను బట్టి ఉండవచ్చు.కాంగ్రెస్ పార్టీ కనీసం ఏడెనిమిది సీట్లు తెచ్చుకోగలిగితే ఆ పార్టీవైపు బీఆర్ఎస్ నేతలు చూడవచ్చు. అదే బీజేపీ కనుక ఎనిమిది పైగా సీట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ పై నమ్మకం కోల్పోయినవారు ఆ పార్టీవైపు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. బీఆర్ఎస్ను పూర్తిగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ యత్నిస్తోంది. ముందుగా దీనిని నిరోధించడం పెద్ద సవాలు అవుతుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలనుంచి ఫిరాయింపులపైన అధిక దృష్టి పెట్టారు. ఇతర పార్టీలను బలహీనపర్చడం వేరు. తనపార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసుకోవడం వేరు. కేసీఆర్ మొదటి నుంచి ఈ విషయంలో అంత గట్టిగా లేరనే చెప్పాలి.తెలంగాణ ఉద్యమం పెరగడానికి కారణం అయనే అయినప్పటికీ 2009లో టీఆర్ఎస్కు పది అసెంబ్లీ సీట్లే రావడం అప్పట్లో అశనిపాతం అయింది. ఆ రోజుల్లో ఆయన ఒక దశలో నిస్పృహలోకి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతలో ఆనాటి సీఎం రాజశేఖరరెడ్డి మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా ఆయనకు అనుకూలంగా మారాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం, తొమ్మిదిన్నరేళ్లు నిర్విఘ్నంగా కొనసాగడం జరిగాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరింప చేయడం కోసం ప్రయత్నించడం వంటివి కూడా జనానికి పెద్దగా నచ్చలేదు. పేరు మార్చడమే చాలా మందికి ఇష్టం లేదు.అప్పట్లో కాంగ్రెస్‌ను వీక్ చేయడానికి కేసీఆర్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి వారు బీఆర్ఎస్లో కొనసాగడమా? లేక కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడంపై ఆలోచన చేస్తారు. కేసీఆర్ వీటిని పట్టించుకోనవసరం లేదు. ఆయన నిత్యం ప్రజలలో ఉంటూ, ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ విజయావకాశాలు పెంచుకోవచ్చు. కానీ కేసీఆర్ అంత సహనంతో, ఓపికతో రాజకీయం చేయవలసి ఉంటుంది. గత పార్లమెంటు ఎన్నికలలో నాలుగు సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పుడే కేసీఆర్ అప్రమత్తం అయి ఉండవలసింది. బీజేపీతో అనవసర వివాదాలకు వెళ్లి కొంత నష్టపోయారు. తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం కూడా కొంత అప్రతిష్టగా మారింది.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన బీజేపీవైపు వెళ్లలేరు. అలాగని కాంగ్రెస్‌తో స్నేహం చేయలేరు. సొంతంగా పార్టీ నిలబడాలంటే కేసీఆర్ చాలా కష్టపడవలసి ఉంటుంది. నిత్యం ప్రజలలోనే సంచరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయగలగాలి. ఈ లోగా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు ఆయన మెడకు చుట్టుకోకుండా ఉండాలి. ఐదేళ్లపాటు బీఆర్ఎస్ నిలబడగలిగితే, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడే అసంతృప్తిని క్యాష్ చేసుకుని మళ్లీ అధికారంలోకి రాగలుగుతారు. అంత వరకు వేచి ఉండే ఓపిక, పోరాడే శక్తి కేసీఆర్‌కు ఉన్నాయా? అన్నదే ప్రశ్న.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
బహుళ భాషలు, బహుళ ప్రాంతాల్లో ప్రజలున్న ఢిల్లీలో విభిన్న రీతుల్లో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మినీ ఇండియాలాంటి ఢిల్లీని దక్కించుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.బీజేపీ ఏకంగా వివిధ రాష్ట్రాల సీఎంలను ఎన్నికల ప్రచార రంగంలోకి దింపింది. అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న దేశరాజధానిలో ఆయా ప్రాంతాలకు సీఎంలను పంపుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. క్యాపిటల్‌లో ఓట్లు క్యాష్ చేసుకునేందుకు పార్టీలు డిఫరెంట్ క్యాంపైన్ చేయడమే ఢిల్లీ ఎన్నికల ప్రత్యేకత..ఢిల్లీలో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరడంతో చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి అన్ని వనరులను ఉపయోగిసస్తున్నాయి. ఢిల్లీలో ప్రధానంగా యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తుండగా, పరిమిత సంఖ్యలో దక్షిణాది ప్రజలున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలను పార్టీలు రంగంలోకి దింపాయి.రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ రాజస్థాన్ ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో.. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో సీఎం పుష్కర్ ధామి విస్తృతంగా ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ జీపుల్లో అభ్యర్థులతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ తమ పార్టీకి మద్దతివ్వాలని అభ్యర్థించారు. తమ తమ రాష్ట్రాల మాండలికంలో మాట్లాడుతూ వారితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. రాష్ట్రాలలో తాము అందిస్తున్న పథకాలు, మోదీ గ్యారంటీలు ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, ఈసారి కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని వారు చెబుతున్నారు.ఇటు బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఇతర రాష్ట్రాల నేతలను ప్రచారంలోకి దింపాయి. రాజస్థాన్ సీఎంగా పనిచేసిన అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలకు మద్దతుగా ఢిల్లీలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్‌లను ఢిల్లీలోని రాజస్థాన్వాసులకు వివరించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రచారంచేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి సైతం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు.చోటా భారత్‌ను తలపించే ఢిల్లీలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఒక్క నాయకుడి వల్లే అయ్యేది కాదు. అందుకే ఆయా రాష్ట్రాల, భాషల ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో వారి భాష మాట్లాడే నాయకుడిని పంపి తమకు మద్దతివ్వాలని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఓటరు దేవుళ్లు ఎవరిని కరుణిస్తారో.. ఏ భాషలో సమాధానమిస్తారో చూడాల్సి ఉంది. -
ఏడాదిన్నరలో నాలుగోసారి..
కాఠ్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’సోమవారం పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గారు. పార్లమెంట్లో ప్రచండ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్ సెంటర్) మూడో అతిపెద్ద పారీ్టగా ఉంది. సోమవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో 275 మంది సభ్యులకుగాను హాజరైన 158 మందిలో ప్రచండ ప్రభుత్వానికి అనుకూలంగా 157 మంది ఓటేశారు. ప్రచండ సభ విశ్వాసం పొందినట్లు పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. ప్రచండ 2022లో ప్రధాని పగ్గాలు చేపట్టాక గత 18 నెలల్లో పార్లమెంట్ విశ్వాసం పొందడం ఇది నాలుగోసారి. -
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ లేబర్ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్‌ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్‌లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సెలబ్రిటీల ఓటు ఇక్కడే..
బంజారాహిల్స్: పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో చాలామంది ప్రముఖులు ఓటు వేయనుండగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా మరికొంతమంది తారలు ఓటు వేయనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు వేసి తమ బాధ్యతను చాటిచెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రజలపై సినీతారల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఎన్నికల్లో ఓటర్లు కూడా భారీగా తరలివచ్చి తాము సైతం అంటూ ఓటు వేశారు. సోమవారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సైతం అటు సినీ ప్రముఖులు, ఇటు ఓటర్లు అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. 👉 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా బంజారాహిల్స్‌లోని నందినగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 జూనియర్ ఎన్టీఆర్ బంజారాహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్లో, కల్యాణ్‌రామ్ ఎమ్మార్వో ఆఫీసు పోలింగ్ బూత్‌లలో ఓటు వేస్తారు. 👉 సినీ ప్రముఖుల్లో చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, నితిన్‌లు జూబ్లీహిల్స్ క్లబ్ బూత్ నెంబర్–149లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 హీరో రవితేజ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, సెంట్రల్ నర్సరీ బూత్ నెంబర్ 157లో, అక్కినేని నాగార్జున, అమల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో, మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేస్తారు. 👉 విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బ్రహ్మజీ, జీవిత, రాజశేఖర్‌లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో మోహన్‌బాబు, మంచు విష్ణు, రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, విశ్వక్సేన్, రాణా, సురేష్‌బాబు ఓటు వేస్తారు. 👉 అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌లు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–69 బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఓటేస్తారు. 👉 హీరో వెంకటే‹Ù, బ్రహా్మనందం మణికొండ హైస్కూల్లో, రాజమౌళి, రమ షేక్‌పేట ఇంటర్నేషనల్ హైస్కూల్లో, సుధీర్ బాబు దర్గా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, అల్లరి నరేష్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లోని మహిళా ఆర్థిక సహకార సంస్థలో, తనికెళ్ల భరణి యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాలులో ఓటు వేస్తారు. -
Hyderabad: వీరు తమ ఓటు తాము వేసుకోలేరు
హైదరాబాద్: గ్రేటర్‌పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఉంది. ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్‌లో ఉంది. అది సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది. -
లోక్‌సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ము మ్మరం చేస్తున్నాయి. ఇంకా వారం రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు శాసనసభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని మండలాల్లో నాలుగైదు గ్రామాలకు ఒక కమిటీని, మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా కమిటీలు వేసుకుని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఆయా కమిటీల్లో సీనియర్లతో పాటు జూ నియర్లను సభ్యులుగా చేర్చారు. వీరంతా ప్రణాళిక ప్రకారం బూత్ స్థాయిలో అన్ని ఇళ్లను తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ ప్రాధాన్యతలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.నిజాం షుగర్స్, పసుపు బోర్డు తదితర అంశాలు, గల్ఫ్, బీడీ కార్మికులు, రైతు కూలీలు, ఉపాధి కూలీల సమస్యలతో పాటు మండలాలు, గ్రామా ల్లో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై నాయకులు, కార్యకర్తలు హామీలు ఇస్తున్నారు. ము ఖ్యంగా పోలింగ్ బూత్‌ల పరిధిలో సాధించే ఆధిక్యతను బట్టి స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని పార్టీల అగ్రనాయకులు చెప్పడంతో శ్రే ణులు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఆధిక్యత సాధి స్తే తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు లభిస్తాయనే ఆశాభావంతో శ్రమకోర్చి ప్రచారంలో పాల్గొంటున్నారు.తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంతో పాటు స్థానికంగా తమ ఉనికినీ చాటుకునేలా మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా పని చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే కొన్ని రోజుల తేడాతోనే గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూన్ ఆఖరులో లేదా జూలై ప్రారంభంలో ముగించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలని, వారి పనితీరునే ప్రామాణికంగా తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవుల పోటీకి అవకాశాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానికంగా వచ్చే ఓట్లకు సంబంధించి కూడికలు, తీసివేతల లెక్కలు వేసుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తమ గ్రామాల్లో సాధించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ప్రచార వ్యూహాలను రూపొందించుకుని క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో వచ్చిన ఓట్లను బూత్‌ల వారీగా సరిచూసుకుని ప్లస్‌లు, మైనస్‌లను బేరీజు వేసుకుని ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 6న నిజామాబాద్, 7న కామారెడ్డిలో కేసీఆర్ రోడ్‌షోలు ఉండడంతో వాటిని విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.కేంద్రంలో మరోసారి అధికారాన్ని దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. నిజామాబాద్‌లో వరుసగా రెండోసారి జెండా ఎగురవేయాలనే పట్టుదలతో కార్యకర్తలు చెమటోడుస్తున్నారు. ‘మరోసారి మోదీ సర్కార్’ నినాదంతో పార్టీ శ్రేణులు, అనుబంధ హిందూ సంఘాలు క్షేత్రస్థాయిలో దూకుడుగా ప్రచారం నిర్వ హిస్తున్నాయి. పట్టణాల్లో, గ్రామస్థాయిలోనూ భారీగా ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ శ్రేణులు, యువత గట్టిగా ప్రచారం చేస్తున్నారు.ఇవి చదవండి: మీరు తీసుకునేది ‘ట్యాపింగ్’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి -
తొలి దశలో దిగ్గజాల పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్‌సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్ ముట్టెంవార్‌పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్‌పూర్‌లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు. అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్ నేత వికాస్ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్‌లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు. కిరెన్ రిజిజు: 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. సర్బానంద సోనోవాల్: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలికి బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించి సోనోవాల్‌ను నిలబెట్టింది. సంజీవ్ భలియా: ఉత్తరప్రదేశ్‌లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్‌సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో. జితేంద్ర సింగ్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. భూపేంద్ర యాదవ్: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలక్ నాథ్‌ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అర్జున్‌రాం మేఘ్వాల్: రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. ఎల్.మురుగన్: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్.మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు. తమిళిసై సౌందరరాజన్: తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. బిప్లవ్‌కుమార్ దేవ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిశ్ కుమార్ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. -
నెత్తురోడిన బస్తర్.. ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టుల మృతి
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా, (ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్‌కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో మజ్జిదేవ్ భార్య లలిత! ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన భార్య అదిలాబాద్ జిల్లా బజార్హత్నూరుకు చెందిన ఆశశ్వర్ సుమన అలియాస్ రజిత మరణించినట్లు తెలుస్తోంది. సిరిపల్లె సుధాకర్ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్ రాజు సలామ్ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంగా చెబుతున్నారు. మజ్జిదేవ్ కూడా ఉన్నారా? ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపాయి. ఎన్కౌంటర్లో గాయపడిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. నెలరోజుల్లో 79 మంది లోక్‌సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. తెలంగాణ పోలీసుల అలర్ట్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది. -
కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావు: కేసీఆర్
సంగారెడ్డి,సాక్షి: రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు అధికారం వస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే లిల్లిపుట్ గాళ్లకు సురుకు పెట్టినట్లతవుతుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో 2 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. సంగారెడ్డిలో మంగళవారం(ఏప్రిల్ 16) జరిగిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో వణుకుతున్నాడు. కాంగ్రెస్ పనైపోయింది. ఆ పార్టీపై ప్రజాగ్రహం ప్రారంభమైంది. సీఎం భయం చూస్తే ఏడాది కూడా ఉండేటట్టు లేడు. ముఖ్యమంత్రి ఉంటడా వేరే పార్టీలకు జంపైతడా తెల్వదు. ఇక్కడేమో కాంగ్రెస్‌కు ఓటేయమంటాడు. ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేయమంటాడు. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదిగేలా.. నన్ను పెంచింది మెతుకు సీమ. మీరిచ్చిన బలంతోనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపిచ్చిన మెతుకుసీమ గడ్డ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. కొంత మంది బీఆర్ఎస్కు పార్లమెంట్ సీట్లు ఎందుకని అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కావాలి ఎంపీ సీట్లు బీఆర్ఎస్కు. బీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు నెరవేర్తాయి. రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు ఉంటుంది. గుడ్డి లక్ష్మి వచ్చినట్లు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు కూడా అధికారం వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టుకుని ఆవిష్కరించుకున్నాం. విగ్రహం పెట్టుకున్న తర్వాత జరిగిన తొలి జయంతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. పూలమాల పెట్టలే.. ఏర్పాట్లు చేయలే.. సందర్శకులు వెళ్లకుండా గేట్లు బంద్ చేశారు. ఇది కండకావరమా.. అజ్ఞానమా.. మరి సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుకుంటున్నారు. దానికి కూడా అంబేద్కర్ అని పేరు పెట్టాం కదా.. యాదాద్రి గుడికి ఎందుకు వెళుతున్నారు..ఎమ్మెల్యే క్వార్టర్లలో ఎందుకు ఉంటున్నారు. అవన్నీ మేమే కట్టాం. ఇదే లిల్లీపుట్ గాళ్ల పార్టీ సింగూరు నుంచి ఒక్క చుక్క నీరు కూడా మెదక్‌కు ఇవ్వలే. మనం సంగమేశ్వర, బసమేశ్వర లిఫ్ట్‌లు పెట్టుకున్నం. వాటిని ఈ ప్రభుత్వం పట్టించుకుంట లేదు. దళితబంధు బంద్ పెడితే నోరు మూస్కోని పడుందామా.. అంబేద్కర్‌ను అవమానిస్తే చూస్తూ ఊరుకుందామా. వీళ్లకు సురుకు పెట్టాలె. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో సురుకు పెట్టాల్సిందే. ఉద్యోగులకు ఎన్నో ఇచ్చాం గుర్తులేదా.. ఆలోచించండి లేదంటే బీఆర్ఎస్కు ఏం కాదు.. మీరే నష్టపోతరు. కరెంటు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. డీజీపీ వార్నింగ్.. పోలీసులు మీకు రాజకీయాలెందుకు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం. కరీంనగర్లో సల్వాజీ మాధవరావు అనే బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. డీజీపీకి వార్నింగ్ ఇస్తున్నా.. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. మీరేం చేస్తున్నరో అన్నీ రికార్డు చేస్తున్నం. జాగ్రత్త’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
కమల దళం కార్యాచరణ జోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్యసాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ వన్ స్థానం తనదేనని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ, మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్నికల ప్రచారం, ఇతర విషయాల్లో మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరింత కష్టపడితే... రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉన్న బీజేపీ నాయకత్వం ఇంకా కొంచెం కష్టపడితే మరో రెండు స్థానాల్లోనూ విజయం సాధ్యమని గట్టిగా విశ్వసిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని (ఐదు బహిరంగసభల్లో పాల్గొన్నారు) పూర్తిచేయడం, బూత్‌స్థాయిల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్‌షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ‘సారా కే సారే సత్రాయ్ హమారే’ (అన్నింటికి అన్ని సీట్లు మావే) అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈవిధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యమనే సంకేతాలు వెళ్తాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. -
దక్షిణ కొరియా అధ్యక్షునికి ఎదురుదెబ్బ
సియోల్: పీపుల్ పవర్ పార్టీ నేత, దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకా రం 300 సీట్లకుగాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. అధికార పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 చో ట్ల గెలిచాయి. ప్రతిపక్షం గెలుపుతో అ ధ్యక్షుడిగా యూన్ సుక్కు కష్టాలు మొదలయ్యాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిప త్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. -
బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’..
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నుంచి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఓటమికి సొంత పార్టీకి చెందిన వారే కొందరు కోవర్టుగా పని చేశారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోగా.. కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్ రావు కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు. అయినప్పటికీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రమేశ్ రాజీనామా చేశారు. ‘అరూరి’ రాజకీయ ప్రస్థానం.. అరూరి రమేశ్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరఫున స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2015 జనవరి 10 నుంచి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై హౌస్ కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2022 జనవరి 26న టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం ఈనెల 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. సుమారు ఆరు రోజులపాటు వరంగల్ పార్లమెంట్ పరిధి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసిన అనంతరం ఏకాభిప్రాయంతో పార్టీ అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల పోలీసుల అలర్ట్
భూపాలపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో ఆ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లారు. సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఓఎస్డీలు, డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
పార్టీ ఏదైనా.. పోటీలో ఉండటం ఖాయం! : సోయం బాపూరావు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. హస్తం పార్టీ హైకమాండ్ కూడా పాజిటివ్‌గా ఉందనే టాక్ మొదలైంది. గురువారం రాత్రి రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ స్థానం పెండింగ్ పెట్టడం వెనక ఇదే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ టికెట్ గొడం నగేశ్‌కు కేటాయించిన తర్వాత సోయం కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే చేరికలు, అభ్యర్థి ఎంపిక పరిశీలన వేగవంతం చేయడంతో ఇక కాంగ్రెస్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే తాజా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయమై సోయం బాపూరావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినప్పుడు.. ‘పార్టీ ఏదైనా.. తాను పోటీలో ఉండటం ఖాయం..’ అని పేర్కొనడం గమనార్హం. సీనియర్ నేతలను ఢీకొట్టగలరా.. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొద్ది రోజులుగా పరిణామాలు వేగంగా మారు తూ వచ్చాయి. చివరకు ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ తమ పోస్టులకు స్వచ్ఛంద విరమణ ప్రకటించి సీఎం సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరిన తెలిసిన విదితమే. ఈ ఇద్దరి నుంచే ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. సుగుణ అనుచరులు సంబరాలు సైతం చేసుకున్నారు. అయితే ఒక్కరోజుకే పరిస్థితి మారిపోయింది. తాజాగా సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం వారి అభ్యర్థిత్వం విషయంలో బ్రేక్ పడినట్టేననే చర్చ సాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, ఈ సీనియర్ నేతలను కొత్త నేతలు ఢీకొట్టగలుగుతారా.. అనే సమీకరణాల్లోనూ పార్టీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో గోండు సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ సోయంనే పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలని హైకమాండ్ పాజిటివ్‌గా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా మనస్సు మార్చుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోయం బాపూరావుకు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శనివా రం రావాలని పిలుపు అందింది. గొడం నగేశ్‌కు సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ కోరేందుకే పిలిచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోయం పార్టీ కార్యాలయానికి వెళ్తారా.. లేదా అనేది ఆసక్తికరం. పోటీలో ఉండటం ఖాయమని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఆయన కలవకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. మరోవైపు లంబాడాకు ఇస్తారనే చర్చ.. రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ విషయంలో చివరి క్షణంలో పెండింగ్ పెట్టిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుంది. కాగా ఈ పెండింగ్ విషయంలో లంబాడా సామాజికవర్గ కాంగ్రెస్ నేతలు మరో రకంగా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఆదివాసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన దృష్ట్యా లంబాడా సామాజిక వర్గానికి కాంగ్రెస్కేటాయించే యోచనలో ఉండడంతోనే పెండింగ్ పెట్టిందని చెబుతుండటం గమనార్హం. మహబూబాబాద్ టికె ట్ లంబాడాకు కేటాయించడంతో ఆదిలాబాద్ స్థా నం సమీకరణాల్లో భాగంగా ఆదివాసీకే కేటాయిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న బంజారా జనాభా దృష్ట్యా పార్టీ ప్రయోజనాల కోసం లంబాడాకు ఇవ్వాలని యోచిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా పార్టీ పరిశీలిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్‌లలో ఎవరికైనా టికెట్ దక్కవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయ్యేవరకు ఈ చర్చలు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే హోలీ పండగ తర్వాత నిర్ణయం వెలువడవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత.. ఈరోజు అప్డేట్స్ -
వేడెక్కిన రాజకీయం
సాక్షి, మేడ్చల్ జిల్లా: పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై జెండా ఎగురవేసేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మూడు జిల్లాలు.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నగరంతోపాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ(బీజేపీ), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్రంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుండటంతో ఓటర్ల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరి ఎంపీ పరిధిలో ప్రస్తుతానికి 37,28,519 ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,58,190 మంది ఓటర్లు ఉండగా, మల్కాజిగిరిలో 4,99,538, కుత్బుల్లాపూర్‌లో 7,12,756, కూకట్‌పల్లిలో4,71,878, ఉప్పల్‌లో 5,33,544, ఎల్బీనగర్లో 6,00,552, కంట్మోనెంట్లో 2,52,060 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు వరకు కూడా అర్హులైన వారు కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పార్టీలు అప్రమత్తం మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావటంతో ... కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాలను ఆయా పార్టీలు ప్రకటించటంతో వారు ప్రచారంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచార పర్వంలో ముందున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయన బస్తీలు ,పురపాలక సంఘాలు ,డివిజన్లు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఈటల విజయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కంట్మోనెంట్ అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని ఎన్నికల శంఖారాన్ని పూరించగా, శుక్రవారం భారత ప్రధాని మోదీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పేరును అధికారికంగా నేడో ,రేపో ప్రకటించవచ్చునని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీలో అసమ్మతిపై దృష్టి బీజేపీలో టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన కొందరు నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పి.హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు అసంతృప్తి నేతలను బుజ్జగించటంతో పాటు అభ్యర్థి ఈటల గెలుపు కోసం పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.