
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రచార భేరీ మోగించనుంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సమర శంఖం పూరించనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు చేవెళ్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభ నుంచి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఇక ఈ వేదికగా ఇప్పటికే ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రజలకు వాగ్దానం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ వాగ్దాన సభగా నామకరణం చేసింది. పార్లమెంట్ ఎన్నికలపై గత రెండు నెలలుగా ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోటీలో నిలిచే అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టింది.
ఈ నెల రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక ముందే వివిధ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనల వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎండగడుతున్నారు. ఈ పథకం కింద ఐదు ఎకరాల్లోపు రైతులకు ఏడాదికి ఆర్థిక సాయం కింద అందించే రూ.6 వేలు ఏం సరిపోతాయని నిలదీస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని, డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పర్యటనలోనే రాహుల్ గాంధీ ప్రకటించారు.
ప్రపంచంలో ఏ దేశంలో అమలు చేయని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేస్తుందని హామీ కూడా ఇచ్చారు. ఈ హామీపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన కనీస ఆదాయ పథక వాగ్దానాన్ని పహాడీషరీఫ్ బహిరంగ సభ వేదికగా రాహుల్ ప్రకటించనున్నారు. ఈ సభకు కనీసం 2 నుంచి 3 లక్షల మందిని తీసుకురావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇక ఇదే రోజు ఉదయం కర్ణాటకలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పహాడీషరీఫ్ బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం 6 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
సభా ఏర్పాట్లపై పరిశీలన
చేవెళ్ల పార్లమెంట్ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో రాహుల్ సభ ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి సభ్యుడు షబ్బీర్‌అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్యెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్, భద్రత అంశాలపై చర్చించారు.