‘జన జాతర’కు ప్రియాంక | Priyanka Gandhi arrival at Tukkuguda Sabha | Sakshi
Sakshi News home page

‘జన జాతర’కు ప్రియాంక

Published Thu, Apr 4 2024 4:27 AM | Last Updated on Thu, Apr 4 2024 11:46 AM

Priyanka Gandhi arrival at Tukkuguda Sabha - Sakshi

తుక్కుగూడ సభకు రాక 

ఎక్కువ స్థానాల్లో ఆమెతోప్రచారం చేయించే యోచనలో టీపీసీసీ 

మెదక్‌తో పాటు కరీంనగర్, నిజామాబాద్,ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలకు ప్లాన్‌ 

రాహుల్‌తో పాటు కొన్ని సభలకుహాజరు కానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ 

తుక్కుగూడ సభ నుంచే ఏఐసీసీ జంగ్‌ సైరన్‌  

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ లోక్‌సభ స్థానంతో పాటు పార్టీకి విజయావకాశాలున్న పలు చోట్ల ఆమె చురుగ్గా ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

ఈసారి ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించిన కారణంగానే ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జరగనున్న ‘జనజాతర’సభకు హాజరు కానున్నట్టు సమాచారం. తొలుత ఈ సభకు రాహుల్‌గాందీ, మల్లికార్జు న ఖర్గే మాత్రమే రావాలని నిర్ణయించినా ప్రియాంకను కూడా పంపాలని ఏఐసీసీ నిర్ణయించింది. తుక్కుగూడ సభతో పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఏఐసీసీతో సమ న్వయం చేసే బాధ్యతలను టీపీసీసీ ముఖ్య నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. 

మేనిఫెస్టో.. మరుసటి రోజే 
తుక్కుగూడ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం ఈనెల ఐదో తేదీన మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజే తుక్కుగూడలో సభ జరుగుతుండడం, సభకు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితర ముఖ్యులు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది.

భారీ జనసందోహం మధ్య లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ నుంచే ఏఐసీసీ జంగ్‌ సైరన్‌ మోగిస్తుందని టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఈ సభలో పార్టీ మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న ఐదు గ్యారంటీలను తెలుగులో విడుదల చేయనున్నారు. 

అచ్చొచ్చిన చోట.. పది లక్షల మందితో 
తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్‌ కోసం 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచారు. ఈ సభకు కనీసం పదిలక్షల మంది హాజరవుతారని గాందీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి ఆలంపూర్‌ వరకు, జహీరాబాద్‌ నుంచి భద్రాచలం వరకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్‌ తరలివచ్చేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లుచేస్తున్నారు.

ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ నుంచే రేవంత్‌ నేతృత్వంలో టీపీసీసీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గత ఏడాది సెపె్టంబర్‌ 17న ఇక్కడ నిర్వహించిన సభకు సోనియాగాంధీ హాజరై ఆరు గ్యారంటీలను ప్రకటించారు.

విజయభేరి పేరుతో సభ నిర్వహించిన ఈ ప్రాంతం కలిసివచ్చిందని, తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన ప్రారంభ సభ ప్రాంతాన్నే లోక్‌సభ ఎన్నికల కోసం ఎంచుకున్నామని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ స్ఫూర్తితోనే దేశంలో పదేళ్లనియంతృత్వ, అప్రజాస్వామిక బీజేపీ పాలనకు తెరదించుతామని చెబుతున్నాయి. 

ఆసక్తి రేపుతున్న రేవంత్‌ వ్యాఖ్యలు  
గత ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతుందని అప్పటి పీసీసీ అధ్య క్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. డిసెంబర్‌ 9న కొలువుదీరే ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహా్వనితులేనని చెప్పుకొచ్చారు.

ఈనెల 6న జరిగే సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు రెండురోజుల కిందట తుక్కుగూడకు వచ్చిన సీఎం.. జూన్‌ 9న ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. దీంతో తుక్కుగూడ వేదికగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement