తుక్కుగూడ నుంచే సమర శంఖం  | Sakshi
Sakshi News home page

తుక్కుగూడ నుంచే సమర శంఖం 

Published Sat, Apr 6 2024 5:25 AM

Congress Lok Sabha election campaign starts from Telangana - Sakshi

కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం తెలంగాణ నుంచే ప్రారంభం 

నేడు జనజాతర సభ... హాజరుకానున్న రాహుల్‌.. ఖర్గే, ప్రియాంకల షెడ్యూల్‌ రద్దు 

సభా వేదికపై తెలుగులో ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. తెలంగాణకు ప్రత్యేక హామీలు 

ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతామనే హామీ కూడా! 

విపక్షాల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు.. లిస్ట్‌లో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు! 

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు.

మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్‌ పెద్దల సమక్షంలో బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పారీ్టలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్‌ హోటల్‌లో రాహుల్‌ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. 

అన్ని ఏర్పాట్లు పూర్తి.. 
టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్‌ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్‌చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. 

తెలంగాణకు ప్రత్యేక హామీలు 
తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్‌ న్యాయ్‌’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్‌ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్‌ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. 

చేరికలపై గోప్యత 
జన జాతర సభ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్‌ హోటల్‌లో రాహుల్‌ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి.

మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్‌గౌడ్, మాణిక్‌రావు, డి.సు«దీర్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్‌ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్‌కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.  

శంషాబాద్‌ నుంచి నోవాటెల్‌కు.. తర్వాత సభకు.. 
రాహుల్‌ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌ హోటల్‌కు వ­స్తా­రు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యా­క.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్‌ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement