గుజరాత్‌ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా?: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy Fires On BJP And PM Narendra Modi | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా?: సీఎం రేవంత్‌రెడ్డి

Published Wed, May 1 2024 5:37 AM | Last Updated on Wed, May 1 2024 5:37 AM

జమ్మికుంట జనజాతర సభలో ‘బీజేపీ  ఇచ్చింది ఇది.. గాడిదగుడ్డు’ అంటూ చూపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

జమ్మికుంట జనజాతర సభలో ‘బీజేపీ ఇచ్చింది ఇది.. గాడిదగుడ్డు’ అంటూ చూపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ పౌరుషం గుజరాత్‌కు తెలిసేలా మోదీని ఓడించాలి 

బీజేపీ వస్తే బడుగులపై సర్జికల్‌ స్ట్రైక్‌..రిజర్వేషన్లు రద్దు 

400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు కుట్ర  

కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఆవహించిన కేసీఆర్‌ ఆత్మ 

రెండు పార్టీలూ ఒక్కటై గూడుపుఠాణి చేస్తున్నాయి 

కేసీఆర్‌ జీవితంలో సీఎం కాలేరని వ్యాఖ్య

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ భూపాలపల్లి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ దిల్‌సుఖ్‌నగర్‌ (హైదరాబాద్‌): కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లభించవని, బలహీన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. 

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆత్మ బీజేపీ నేత అమిత్‌ షాను ఆవహించిందని, ఆ రెండు పార్టీలు ఒక్కటై రాష్ట్రంలో గూడు పుఠాణి చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ అనామకులకు ఎంపీ టికెట్‌ ఇచ్చిందని అన్నారు. డిసెంబర్‌లో జరిగిన సెమీఫైనల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టామని, ఇప్పుడు జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో తెలంగాణ పౌరుషం గుజరాత్‌కు తెలిసేలా మోదీని ఓడించాలని ప్రజలను కోరారు. 

ఫైనల్స్‌లో మోదీ, అమిత్‌షాలను ఓడించి, రాహుల్‌గాం«దీని ప్రధానిని చేసినప్పుడే మనం గెలిచినట్లు అని పేర్కొన్నారు. ‘గుజరాత్‌ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం..’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ శివారు బాలాపూర్, బడంగ్‌పేట్, సరూర్‌నగర్‌లో, మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్‌టీఆర్‌ నగర్‌లో రోడ్‌ షో అనంతరం కార్నర్‌ మీటింగుల్లో ప్రసంగించారు. 

తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు 
‘కులగణన చేపట్టి దామాషా ప్రకారం బలహీనవర్గాలకు రిజర్వేషన్లు తీసుకురావాలని మేము ప్రయత్నిస్తుంటే, బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందో మోదీ సమాధానం చెప్పాలి. బీజేపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గద్దె దించుతారు. ప్రధానిగా మోదీ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. బండి సంజయ్‌ కరీంనగర్‌కు తెచ్చిందేమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప. గుండు అర్వింద్, అరగుండు సంజయ్‌లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. పదేళ్లలో మోదీ కర్ణాటకకు చెంబు, ఏపీకి పాచిపోయిన లడ్డూలు, మట్టి, నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు..’ అని రేవంత్‌ ఎద్దేవా చేశారు. 

మోదీ, షాలకు కర్రుకాల్చి వాత పెట్టాలి 
‘మోదీ అన్ని రకాలుగా మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ హయాంలో మంజూరు చేసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్‌లను రద్దు చేశారు. ఏటా ఐదు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ మోసం చేసినందుకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అదే విధంగా నరేంద్ర మోదీకి, అమిత్‌షాకు కర్రు కాల్చి వాత పెట్టాలి..’ అని సీఎం అన్నారు. 

సైనికుల్ని పంపించినా భయపడేది లేదు 
‘తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్‌ నిషేధిస్తుంటే వాటి మూలాలు గుజరాత్‌లో వెలుగు చూస్తున్నాయి. కేసీఆర్‌ ఉపన్యాసాన్ని మోదీ నకలు కొట్టారు. నన్ను తిడితే ఏం వస్తుంది? సలహాలు ఇవ్వాల్సింది పోయి అడ్డగోలుగా తిట్టిపోయిండు. కేసీఆర్, కిషన్‌రెడ్డి కూడా ఇదే పని చేస్తున్నారు. తిట్టడానికి ఇంత దూరం రావలసిన అవసరం లేదు. హైదరాబాద్‌ మెట్రో రైలుకు నిధులు కేటాయించలేదు. 

బుల్లెట్‌ రైలు ఇవ్వలేదు. వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌రోడ్డు రాకుండా ప్రధాని అడ్డుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన నన్ను కేసీఆర్‌ తరహాలోనే అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కేసీఆర్‌ బెదిరిస్తేనే భయపడలేదు. తాజాగా మోదీ ఢిల్లీ పోలీసులను పంపాడు. వాళ్లకు భయపడతామా? సైనికుల్ని పంపించినా భయపడేది లేదు. రేవంత్‌రెడ్డికి జైలు కొత్త కాదు..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 

రాజకీయం కోసం రాముడి అక్షింతలు పంచారు 
‘అయోధ్యలో రాముడి కల్యాణానికి 15 రోజుల ముందే రాజకీయం కోసం శ్రీరాముడి అక్షింతలు ఇంటింటా పంచి బీజేపీ అవమానించింది. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్న విషయాన్ని హిందువులందరూ ఆలోచించాలి. మనమందరం హిందువులం కాదా? రామభక్తులం కాదా? అయినా ఓట్ల కోసం హిందుత్వాన్ని ఎప్పుడూ వాడుకోలేదు..’ అని రేవంత్‌ అన్నారు. 

ఇండియా కూటమిలోకి కేసీఆర్‌ను తీసుకోం  
‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌ను ఓడించేందుకు, బీజేపీని గెలిపించేందుకు పలు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను కేసీఆర్‌ పోటీలో నిలిపారు. బీఆర్‌ఎస్‌ను ఇండియా కూటమిలోకి తీసుకోం. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టింది. కేసీఆర్‌ మళ్లీ పగటి కలలు కంటున్నాడు. వంద రోజుల్లోనే కాంగ్రెస్‌ను దిగిపోవాలంటున్నాడు. నేను ప్రజల మద్దతుతో సీఎం అయ్యా. ఏడాది కాదు..కేసీఆర్‌? నీ జీవితం మొత్తం ఎదురు చూసినా మళ్లీ నీకు సీఎం పదవి రాదు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్‌ బస్సుయాత్ర ఉంది..’ అని సీఎం విమర్శించారు.  

కొండా రాజ్యసభ సీటు కొనుక్కోవచ్చు 
‘మాజీ మంత్రి సబితమ్మ పొద్దున కారు గుర్తు అంటుంది. రాత్రిపూట కమలం గుర్తుకు ప్రచారం చేస్తుంది. సొంత పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయాన్ని కూడా ఓ వ్యాపారంగా చూస్తున్నాడు. పదేళ్లు తెలంగాణను మోసం చేసిన మోదీ పక్కన చేరి మళ్లీ ఇక్కడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. వందల కోట్లు ఉన్న కొండాకు నిజంగానే ప్రజా సేవ చేసే ఆలోచన ఉంటే.. రూ.కోట్లు పెట్టి ఏ రాజ్యసభ సీటో కొనుక్కోవొచ్చు..’ అని రేవంత్‌ అన్నారు. 

ఈ కార్యక్రమాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకా‹Ùరెడ్డి, కేఈఆర్‌ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కరీంనగర్, వరంగల్, చేవెళ్ల పార్టీ అభ్యర్థులు వెలిచాల రాజేందర్‌రావు, కడియం కావ్య, గడ్డం రంజిత్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

వడదెబ్బతో వృద్ధురాలు మృతి 
జమ్మికుంట (హుజూరాబాద్‌): జమ్మికుంటలో కాంగ్రెస్‌  నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ (68) వడదెబ్బకు గురై సభలోనే కుప్పకూలింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐలమ్మ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చూస్తానని కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ హామీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement