రిజర్వేషన్ల రద్దే బీజేపీ ఎజెండా: సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు | CM Revanth Reddy Serious Comments On PM Modi | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల రద్దే బీజేపీ ఎజెండా: సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Published Fri, Apr 26 2024 1:18 PM | Last Updated on Fri, Apr 26 2024 1:18 PM

CM Revanth Reddy Serious Comments On PM Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుల పోరాటంతో నల్ల చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారు. అనంతరం, పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. అలాగే, అగ్గి పెట్టె, సబ్బు బిల్ల, అగర్ బత్తీలపై కూడా మోదీ జీఎస్టీ విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, గాంధీభవన్‌లో బీజేపీపై ఛార్జ్‌షీట్ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..‘పదేళ్ల బీజేపీ వైఫల్యాలు, కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ పదేళ్లలో కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న మోదీ.. పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. 

బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోంది. చేనేత నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతోంది. అగ్గి పెట్టె, సబ్బు బిల్ల, అగర్ బత్తీలపై కూడా మోదీ జీఎస్టీ విధించారు. దేశ ప్రజలపై రూ.168 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు. పదేళ్లలో రూ.113 లక్షల కోట్లు అప్పులు తెచ్చి భారత దేశాన్ని తాకట్టు పెట్టారు. 60 ఏళ్లు కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మోదీ పదేళ్లలో కార్పొరేట్లకు కట్టబెట్టారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్ని బీజేపీ అమలు చేస్తోంది. రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్ల మెజారిటీ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. 2025లోగా రిజర్వేషన్లను రద్దు చేయాలనే విధానంతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉంది. మొండిగా వ్యవహరించి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. ఇందుకు 2/3వ వంతు మెజారిటీ సాధించాలని పన్నాగాలు పన్నుతున్నారు..

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారు. అందుకే దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. వర్గీకరణ కోసం కొట్లాడిన వారు కూడా ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదు. రిజర్వేషన్లు వద్దు.. రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి మద్దతు ప్రకటించండి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దు. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్ రిజర్వేషన్లు రద్దుగా జరగబోతున్నాయి’ అని కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement