సంజయ్‌ చేరిక.. జీవన్‌ కినుక | Jeevan Reddy upset with Jagityala MLA Sanjay Kumar joins in Congress | Sakshi
Sakshi News home page

సంజయ్‌ చేరిక.. జీవన్‌ కినుక

Published Tue, Jun 25 2024 4:59 AM | Last Updated on Tue, Jun 25 2024 4:59 AM

Jeevan Reddy upset with Jagityala MLA Sanjay Kumar joins in Congress

జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై జీవన్‌రెడ్డి మనస్తాపం 

తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీ కండువా కప్పడంపై అభ్యంతరం

తాను ఎవరిపై పోరాడానో ఆ వ్యక్తిని ఎలా చేర్చుకుంటారంటూ నిలదీత 

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన సీనియర్‌ నేత 

దీపాదాస్‌ మున్షీ, శ్రీధర్‌బాబు సహా పలువురు నేతల మంతనాలు 

కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయన్న జీవన్‌రెడ్డి 

తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఆదివారం రాత్రి అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్‌ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఫొటోలు బయటికి రావడంతో సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. 

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి శ్రీనివాస్‌లు నచ్చజెప్పినా ఆయన దిగిరాలేదు. చివరికు మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకుని చర్చలు జరిపినా జీవన్‌రెడ్డి శాంతించినట్టుగా కన్పించలేదు. ఏ వ్యక్తిపైనైతే పోరాడానో ఆ వ్యక్తినే పార్టీలో చేర్చుకోవడం ద్వారా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారి అభిప్రాయాలను గౌరవించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందంటూ సమస్య పరిష్కారం కాలేదనే సంకేతాలు ఇచ్చారు. 

నన్ను సంప్రదించకుండా ఎలా? 
జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. ఉదయాన్నే జగిత్యాలలోని తన నివాసానికి చేరుకున్న అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ తన సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామా వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కానీ జీవన్‌రెడ్డి ససేమిరా అన్నారు. 

పార్టీకి అండగా నిలిచిన పెద్దమనిషి: శ్రీధర్‌బాబు 
తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు రంగంలోకి దిగారు. జరిగిన వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తూ అన్నివిధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అనేక క్లిష్టమైన సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అండగా నిలిచిన పెద్దమనిషి జీవన్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన మనస్తాపం చెందిన విషయం తెలుసుకుని తామంతా వచ్చి పార్టీకి పెద్దదిక్కుగా ఉండాలని కోరామని తెలిపారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కష్టాన్ని, మనోవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ సోమవారం రాత్రి జగిత్యాలలో విలేకరులతో మాట్లాడిన జీవన్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యే సంజయ్‌ను ఏకపక్షంగా చేర్చుకోవడం సరికాదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ బలోపేతానికి పనిచేశారని, సంఖ్యాబలం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తనతో చర్చించడానికి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర నేతలు వచ్చారని అన్నారు. 

మూడు విడతలు తలపడిన జీవన్‌రెడ్డి, సంజయ్‌ 
జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్‌రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్‌ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్‌లో సంజయ్‌ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement