సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ
ఫలించిన వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ, శ్రీధర్‌బాబు చర్చలు
ఉత్కంఠకు తెర
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యవహారంలో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. తనకు సమాచారం లేకుండా జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకో వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి అధిష్టానం హామీతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అధిష్టానం ఆదేశాల మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జీవన్‌రెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు నేరుగా తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో భేటీఅయి అరగంట పాటు మంతనాలు సాగించారు. అనంతరం 8 గంటలకు జీవన్‌రెడ్డిని తోడ్కొని దీపాదాస్, శ్రీధర్‌బాబులు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు.
అండగా నిలిచిన వారిని గుర్తిస్తామన్నారు: జీవన్‌రెడ్డి
ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, కార్యకర్తల మనోభావాలు గుర్తించి, పార్టీకి అండగా నిలిచిన వారిని ప్రాధాన్యమిచ్చి గుర్తిస్తామని కేసీ వేణుగోపాల్ చెప్పారని జీవన్‌రెడ్డి అన్నారు. వేణుగోపాల్‌తో భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీకైనా కేడర్ ఆత్మగౌరవమే ప్రధానం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం.
పార్టీకి అండగా నిలిచినవారి ఆలోచనలకు అనుగుణంగానే ముందుకెళ్తాం. వారి కృషికి ప్రాధాన్యత ఇస్తామని వేణుగోపాల్ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందాను’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని, అందరికీ కావాల్సింది పార్టీ ఐక్యతే అన్నారు. ఈ భేటీకి చొరవ తీసుకున్న దీపాదాస్ మున్షీ, శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
తలుపులు తెరిచే ఉంటాయి: దీపాదాస్ మున్షీ
కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ చెప్పారు. ‘కాంగ్రెస్‌లో ఇప్పటికే చాలామంది చేరారు. ఇంకా చాలామంది చేరబోతున్నారు. మా పార్టీలోని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కలిసి నడుస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పటిష్టంగా నడుస్తోంది’ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల నియామకం ఉంటుందా అనే ప్రశ్నకు.. ‘పిక్చర్ అభీ బాకీ హై (సినిమా ఇంకా ఉంది) త్వరలోనే ఉంటుంది. పీసీసీ అ«ధ్యక్షుడి ఎంపిక అధిష్టానం నిర్ణయం. అసెంబ్లీ, పార్లమెంటులాగా కాలవ్యవధి ఉండదు’ అని మున్షీ బదులిచ్చారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: శ్రీధర్‌బాబు
గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీని చీల్చి, నష్టపరిచి, బలహీనపరిచిన వారే పార్టీ చేరికలపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, అయితే రాజీనామాలు చేసి రావాలన్న నిబంధనపై పార్టీ ఆలోచన ఏవిధంగా ఉంటుందో చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment