జీవన్‌రెడ్డితో మాట్లాడుతున్న భట్టి, శ్రీధర్‌బాబు
రాజీనామాకు సిద్ధమై మండలి చైర్మన్‌కు ఫోన్ చేసిన సీనియర్ నేత
విషయం తెలుసుకొని జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన భట్టి, శ్రీధర్‌బాబు
పార్టీలోనే ఉంటానని, ఎమ్మెల్సీగా ఉండలేనని స్పష్టీకరణ
సీనియర్లను వదులుకోవడానికి సిద్ధంగా లేమన్న భట్టి..
త్వరలోనే అసెంబ్లీకి వచ్చి అన్నీ మాట్లాడతా: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
మండలి చైర్మన్‌కు ఫోన్
సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బేగంపేటలోని జీవన్‌రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు.
గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్‌రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్‌రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం.
జీవన్‌రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి
మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్‌రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్‌రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు.
చైర్మన్‌ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్‌రెడ్డి
భట్టి, శ్రీధర్‌బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్‌చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment