బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట | Brs Mla Kaushik Reddy Arrest Case Updates | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట

Published Tue, Jan 14 2025 7:25 AM | Last Updated on Tue, Jan 14 2025 10:10 AM

Brs Mla Kaushik Reddy Arrest Case Updates

సాక్షి,  కరీంనగర్ జిల్లా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్ట్‌ కేసులో రాత్రంతా హైడ్రామా నెలకొంది. కౌశిక్‌ను రాత్రంతా త్రీ టౌన్ పీఎస్‌లోనే పోలీసులు ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్‌ తెప్పించి ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటిగంటకు.. అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్‌(BRS) లీగల్ టీమ్‌కు పోలీసులు వెల్లడించారు. నిన్న)రాత్రి (సోమవారం) త్రీ టౌన్‌లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో అదనపు మెజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు హాజరుపర్చారు.

ప్రశ్నిస్తూనే ఉంటా: కౌశిక్ రెడ్డి 
తన అరెస్టు ప్రజాస్వామికం, అనైతికం అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనపై  అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలతో కేసులు పెట్టి నన్ను అరెస్టు చేశారు. పండుగ పూట ఇబ్బందుల గురిచేయాలని చూస్తున్నారు’’ అంటూ కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.

కేటీఆర్‌, హరీష్‌రావు హౌస్‌ అరెస్ట్‌
కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. గచ్చిబౌలిలో కేటీఆర్‌, కోకాపేటలో హరీష్‌రావులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

వన్ టౌన్‌లో మూడు, త్రీ టౌన్‌లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు.  రెండు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చూపించారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన పిటిషన్ల మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్‌ను అరెస్ట్ చేశారు. నిన్నంతా కొనసాగిన బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. కరీంనగర్‌లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది.

కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌తో పాడి కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: సర్కారు నిధుల వేట!

దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్, బీఆర్‌ఎస్‌ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement