
సాక్షి, కరీంనగర్: కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(kaushik Reddy)పై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. ప్రతిగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కరీంనగర్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనే విధంగా మరోసారి దాడి జరిగింది. నేడు కమలాపూర్‌లో గ్రామసభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు. సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టమాటాలు విసిరారు. దీంతో..కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల వద్ద వాగ్వాదం జరిగింది.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అనంతరం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు.
