సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి కొండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని కామెంట్స్ చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన గొడవ పడే విధంగా వ్యవహారించాడు. బీఆర్‌ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు పట్టించుకోని వారిని కూడా ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారు.
కేసీఆర్‌ను కేటీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిజంగా రాజీనామా చేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరినా మాట్లాడినా బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎవరైనా సరే.. చూస్తూ ఊరుకునేది లేదు. బీఆర్‌ఎస్ అధికారాన్ని ఉపయోగించుకోలేదు.. మేము ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే ఉత్సవాలు చేసుకుంటున్నాం.
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. సలహాలు, సూచనలు చేయండి అంతే కానీ అర్ధం పర్థం లేని విమర్శలు ఎందుకు. మా నాయకుల మీద చిలువలు పలువలుగా మాట్లాడితే ఊరుకోము. మీ లాగా మేము అక్రమ అరెస్ట్ చేయదలుచుకుంటే ఒక్కరూ కూడా మిగలరు. ఫోన్ ట్యాపింగ్‌లో మీ హస్తం లేకపోతే అధికారులను దేశాలు ఎందుకు దాటిస్తున్నారు. మీరు చేసేది మంచి అయితే విదేశాల నుండి యూ ట్యూబ్‌లు ఎందుకు నడిపిస్తున్నారు.
గతంలో ఉన్నట్లు ఇప్పుడు రాజకీయ సంస్కృతి లేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పని చెప్పండి అంతే కానీ లేని పోనీ విమర్శలు చేయకండి. ప్రతిపక్షాలు అంటే జనాలు ఆహ్వానించాలి కానీ జనాలు కేటీఆర్‌ను దగ్గరికి రానివ్వడం లేదు. మేము మళ్ళీ అధికారం లోకి వస్తాము. సంవత్సర కాలం ఓర్చుకున్నాము ఇక ఓర్చుకోము. ఏది పడితే అది మాట్లాడితే క్షమించము. మా పాలన చూసి వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు. అధికారులు అధికార పార్టీకి తగ్గట్టుగా పని చేస్తారు. ఇప్పటి వరకు యూ ట్యూబ్‌ల విషయంలో చేసిన తప్పులు ఇక చేయము. గతంలో తెలంగాణ తల్లి బొమ్మని దొరసాని లాగా సృష్టించారు. గతంలో కవిత ఫేస్ లాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. మేము మన తెలంగాణ ప్రజల ఆత్మని ఆవిష్కరిస్తున్నాము’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment