సాక్షి, కరీంనగర్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కరీంనగర్‌లో రాజకీయం మరోసారి హీటెక్కింది. కౌశిక్ రెడ్డి సవాల్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్ షాక్ తగలింది. ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు ఫైల్ చేశారు పోలీసులు.
ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. ‘నీది ఏ పార్టీ అంటే నీది ఏ పార్టీ..’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.
దూషణల పర్వం..
ఈ సందర్బంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి కలబడి చేతులతో తోసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పాడి కౌశిక్‌ను అడ్డుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పరుగున వెళ్లి వారిద్దరినీ వారించే యత్నం చేశారు. పాడిని బలవంతంగా పోలీసులు బయటకు తరలించారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని గెలిచిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేనూ ఇలాగే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ బదులిస్తూ.. ముందు పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందు రాజీనామా చేయాలని, తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని మీడియాకు తెలిపారు.
నేను రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా?
శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని.. దమ్ముంటే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment