హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యాలు. నా గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతో అడ్డగోలుగా మాట్లాడారు. కొండా సురేఖ మంత్రి హోదాను దుర్వినియోగం చేశారు.
..ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె అసత్యాలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు ప్రజలు నిజమని భావించే ప్రమాదం ఉంది. గతంలోనూ ఆమె అడ్డగోలుగా మాట్లాడారు. వీటిపై ఏప్రిల్‌లోనే నోటీసులు పంపించాను. మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా. దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సురేఖా.. నోరు జాగ్రత్త!
కొండా సురేఖ ఏమన్నారంటే..
మెదక్ పర్యటనలో ఎంపీ రఘునందన్ కొండా సురేఖ మెడలో వేసిన దండపై.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దానిపై ఆమె తీవ్ర ఆవేదన చెందారు. ఇది బీఆర్ఎస్ పనేనని ఆరోపిస్తూ కంటతడి పెట్టారు కూడా. అయితే బుధవారం మరోసారి ఈ అంశంపై విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్ స్పందించలేదంటూనే తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తీరుతో తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని అన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాదు, అక్కినేని కుటుంబంలో అలజడికి కూడ కేటీఆర్ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారామె.
ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆరోపణలను అక్కినేని నాగార్జున, అమలతో పాటు సమంత ఖండించారు. ప్రకాశ్ రాజ్, హేమ, చిన్మయి లాంటి సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఈ వ్యవహారంలో కొండా సురేఖపై మండిపడుతూ క్షమాపణలు డిమాండ్ చేస్తోంది.
ఇదీ చదవండి: కొండా ఆరోపణలపై స్పందించిన సమంత
Comments
Please login to add a commentAdd a comment