చౌకబారు రాజకీయం! | Konda Surekha inappropriate comments on KTR And Akkineni Family | Sakshi
Sakshi News home page

చౌకబారు రాజకీయం!

Published Thu, Oct 3 2024 3:08 AM | Last Updated on Thu, Oct 3 2024 7:10 AM

Konda Surekha inappropriate comments on KTR And Akkineni Family

అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ.. కేటీఆర్‌పై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు

సమంత విడాకులు, డ్రగ్స్,ఫోన్‌ ట్యాపింగ్‌తో బ్లాక్‌ మెయిల్‌ ఆరోపణలతో కలకలం 

సురేఖ మాటలు సరికాదంటూ రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు 

రాజకీయాల కోసం సినీ పరిశ్రమ మహిళలపై దుష్ప్రచారం చేయొద్దంటూ మండిపాటు 

కొండా సురేఖ మెడలో నూలు దండ వేసిన ఘటనపై బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ట్రోలింగ్‌తో వివాదం మొదలు 

బట్టలూడదీసి కొడతామన్న సురేఖ.. ఫినాయిల్‌తో నోరు కడుక్కోవాలన్న కేటీఆర్‌ 

అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై సురేఖ ఆక్షేపణీయ వ్యాఖ్యలు 

తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు.. లీగల్‌ నోటీసు ఇచ్చిన కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య.. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్‌ల మధ్య రాజకీయ వివాదం ‘చౌకబారు’ మలుపు తీసుకుంది. సినీనటి సమంత విడాకులు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పెళ్లి, డ్రగ్స్, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాధ్యతగల మంత్రి హోదాలో ఉన్న ఆమె.. నైతికతను పట్టించుకోకుండా అక్కినేని నాగార్జున కుటుంబంపై ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేయడం, దానికి కేటీఆర్‌ బాధ్యుడంటూ ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. 

రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయపరమైన వివాదాల్లోకి సంబంధం లేని ఓ కుటుంబ అంతర్గత వ్యవహారాన్ని లాగడం, ఉచితానుచితాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. తెలంగాణలో మహిళలంతా సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ వేళ.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలే ఆక్షేపణీయ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

అసలేమైందంటే...! 
ఈ మొత్తం వివాదం వెనుక ఇటీవల మంత్రి కొండా సురేఖ మెదక్‌ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన, దానిపై బీఆర్‌ఎస్‌ పేరిట సోషల్‌ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌తో బీజం పడింది. అక్కడ జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఒక నూలు దండను మంత్రి సురేఖ మెడలో వేశారు. కొందరు ఈ ఫోటోను పెట్టి అసభ్య భావంతో ట్రోలింగ్‌ చేశారు. దీనిపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. 

సురేఖపై ట్రోలింగ్‌కు నిరసనగా కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు, చేనేత కార్మీకులు తెలంగాణ భవన్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ చేస్తూ కొండా సురేఖను విమర్శించారు. తనను ట్రోల్‌ చేశారంటూ సురేఖ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం కొండా సురేఖ తీవ్రంగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ.. 
గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళులర్పించిన అనంతరం బాపూఘాట్‌ వద్ద, గాం«దీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని హత్య చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు చూస్తున్నారని.. అలాంటప్పుడు తాను దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తానని ప్రశ్నించారు. సినీ నటి సమంత, నాగార్జున కుమారుడు నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణమని.. ఆయన చాలా మంది హీరోయిన్లను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. 

చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకుని త్వరగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడి, వాళ్లకూ డ్రగ్స్‌ అలవాటు చేశారు. వాళ్ల జీవితాలతో ఆడుకునేలా బ్లాక్‌మెయిల్‌ చేసి ఇబ్బందులు పెట్టారు. వాళ్లను డ్రగ్స్‌ కేసులో ఇరికించి ఆయన తప్పుకున్నారు. వాళ్ల ఫోన్లు ట్యాప్‌ చేసి, రహస్యంగా మాట్లాడుకున్న విషయాలను రికార్డు చేసి వాళ్లకు వినిపించేవారు. 

ఆ రికార్డులను అడ్డుపెట్టుకుని బెదిరించేవారు’’ అని కొండా సురేఖ ఆరోపించారు. నిజానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ తనను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి గురించి, మంత్రి సీతక్క గురించి కూడా గతంలో ఇలాంటి పోస్టులే పెట్టారని.. ఇప్పుడు తనపై పెడుతున్నారని మండిపడ్డారు. తనపై ట్రోలింగ్‌ చేసినవారు, వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారిపై కేసులు పెడుతున్నామని చెప్పారు. 

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌.. 
కొండా సురేఖపై ట్రోలింగ్, ఆమె చేసిన వ్యాఖ్యల వ్యవహారం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల మంటలు రేపుతోంది. మెదక్‌ ఘటనపై సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ అనుయాయులు చేసిన ట్రోల్స్‌పై కొండా సురేఖ, ఇతర కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న మంత్రుల నోర్లు ఫినాయిల్‌తో కడుక్కోవాలని వ్యాఖ్యానించారు. మరో మంత్రి సీతక్క తిరిగి కేటీఆర్‌ నోరే యాసిడ్‌తో కడుక్కోవాలని విమర్శించారు. 



కొండా సురేఖతో పెట్టుకోవడం అంత సులువు కాదని, కేటీఆర్‌ రెచ్చగొట్టి మరీ ఆమెతో తన్నించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ మహిళా మంత్రుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు విమర్శలు గుప్పించారు. మరోవైపు కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై.. బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. 

కొండా సురేఖ నోటి దురుసు గురించి అందరికీ తెలుసని, ఇంకోసారి మాట్లాడితే కోర్టుకు ఈడుస్తామంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, నేత తుల ఉమ హెచ్చరించారు. మహిళా మంత్రులను శిఖండులుగా పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం 
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్ధులపై విమర్శల కోసం వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 
– ‘ఎక్స్‌’లో సినీ నటుడు నాగార్జున 

ఏంటీ సిగ్గులేని రాజకీయాలు: ప్రకాశ్‌రాజ్‌ 
‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా? జస్ట్‌ ఆస్కింగ్‌’ 
– ‘ఎక్స్‌’లో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ 

నా విడాకులకు, రాజకీయ కుట్రకు సంబంధం లేదు 
విడాకులు నా వ్యక్తిగత విషయం. సినీ పరిశ్రమలో ఓ మహిళ ఉండటానికి, బయటికి వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి కొండా సురేఖ. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తిగత విషయాలపై మాట్లాడేప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను. 
– ‘ఇన్‌స్టా’లో నటి సమంత పోస్ట్‌ 

సీఎం రేవంత్‌ స్పందించాలి.. 
అక్కినేని కుటుంబంపై తెలంగాణ మహిళా మంత్రి చేసిన కామెంట్స్‌ చూసి షాక్‌ తిన్నాను. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎంతగానో గౌరవించే సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. బాధ్యతారహిత, కించపరిచే వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖతో క్షమాపణ చెప్పించాలి. సినీ రంగం మొత్తం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. 
– సినీ రచయిత కోన వెంకట్‌  

కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. తక్షణమే ఆ  వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 
‘ఎక్స్‌’లో నాగార్జున  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement