kamalapur
-
కమలాపూర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలతో దాడి!
సాక్షి, కరీంనగర్: కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(kaushik Reddy)పై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కరీంనగర్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనే విధంగా మరోసారి దాడి జరిగింది. నేడు కమలాపూర్‌లో గ్రామసభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు. సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టమాటాలు విసిరారు. దీంతో..కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల వద్ద వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అనంతరం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు. -
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి అడ్డంగా పట్టుబడ్డారు. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ 30,000 డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. నేడు రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమలాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి.అయితే సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ చేపడితే అనేక అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తహసిల్దా్ర్‌ను ఏసీపీ పట్టుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పైసలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 7 వేలు లంచం తీసుకుంటూ చాయితీరాజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్‌ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
బిల్ట్ పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా కమలాపూర్‌లోని బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను పునరుద్ధరించే అంశంపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, ఫిన్‌క్వెస్ట్ సంస్థ ఎండీ హార్దిక్ పటేల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. బిల్ట్ ఆస్తులు ప్రస్తుతం ఫిన్‌క్వెస్ట్ సంస్థ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ ఎండీతో, బిల్ట్ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితోనూ చర్చలు జరిపారు. 2014లో ఆ మిల్లు మూతపడడం వల్ల దాదాపు 750 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని వారికి ఉపాధి కల్పించడంతోపాటు, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని కోరారు. ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారు. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
బండి సంజయ్ కేసులో సర్కారుకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కమలాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసింది. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తుపై స్టే విధించాలంటూ వేసిన ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారణ చేపట్టారు.సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదిస్తూ సంజయ్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పరీక్షకేంద్రంలోకి ఎవరూ వెళ్లకుండా చూసుకోవాల్సిన ప్రధానోపాధ్యాయుడు ఆ పని చేయకుండా బండిపై ఫిర్యాదు చేయడానికి మాత్రం ఉత్సాహం చూపించారన్నారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయకుండా సంజయ్‌ను అరెస్టు చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదిస్తూ సంజయ్ ఈ కేసులో ఇతర నిందితులతో కలిసి కుట్రపన్నారని, ఆయన అరెస్టు తర్వాత ఎలాంటి ప్రశ్నపత్రాల లీకేజీ జరగలేదని చెప్పారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీని ప్రేరేపించడం, ప్రోత్సహించడం చట్టప్రకారం తీవ్రమైన నేరమన్నారు. -
టెన్త్ పరీక్షా పేపర్ లీక్ కేసు కొత్త మలుపులు
-
టెన్త్ పేపర్ లీక్ కేసు.. డిబార్ అయిన విద్యార్థికి ఊరట
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీ ఆరోపణలతో డిబార్ అయిన టెన్త్ విద్యార్థి హరీష్‌కు ఊరట లభించింది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది కాగా హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్ లీక్ చేసిన ఆరోపణలతో అధికారులు హరీష్‌ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకు హరీష్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని తెలిపారు. కమలాపూర్‌లో నమోదైన ఎఫ్ఐఆర్లో కూడా హరీష్ పేరు ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా అధికారులు శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమంతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని ఆరోపిస్తూ.. హరీష్‌ను టెన్త్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. విద్యార్థిని మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను ఆదేశించింది. చదవండి: టెన్త్ పేపర్ లీక్ కేసు.. ఎగ్జామ్ సెంటర్లో జరిగింది ఇదేనా..? -
టెన్త్ పేపర్ లీకేజీ.. కీలక విషయాలు వెల్లడించిన సిపి రంగనాథ్
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ లో కలకలం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ పై పోలీసులు కొరఢా ఝళిపించారు. పేపర్ ను ఫోటో తీసి బయటికి పంపిన మైనర్ బాలుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందంటూ ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. మైనర్ బాలుడు కమలాపూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టుపైకి ఎక్కి తన స్నేహితుడి కోసం హిందీ ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మిత్రుడు శివగణేష్ కు పంపాడని సిపి రంగనాథ్ తెలిపారు. శివ గణేష్ ఓ జర్నలిస్టు మహేష్ కు పంపగా వారిద్దరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. దాన్ని మరో జర్నలిస్ట్ ప్రశాంత్ బిజెపి నాయకులతో పాటు జర్నలిస్ట్ గ్రూపులో బ్రేకింగ్ న్యూస్ అంటూ హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిందని టెక్స్ట్ మెసేజ్ పోస్ట్ చేశాడని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు పేపర్ బయటికి పంపిన మైనర్ బాలుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్ ప్రస్తుతం మైనర్ బాలుడితోపాటు శివ గణేష్, ప్రశాంత్‌ను అరెస్టు చేశామని మహేష్ పరారీలో ఉన్నాడని మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. వాస్తవంగా సెంటర్లో ఉన్నవారికి ఈ విషయం తెలియదని వారి నిర్లక్ష్యం ఉన్నట్లు భావించి డిపార్ట్మెంట్ పరంగా ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. - ఏవి.రంగనాథ్ - సిపి వరంగల్ -
ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. చేనేత కార్మికుల నిలదీత
హన్మకొండ: ఈటల రాజేందర్ ఇలాక కమలాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ముందు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. వీరిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి నిరసన తెలిపిన ఐదుగురు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కమ్యూనిటీ కాంప్లెక్స్ వద్ద మంత్రి కేటీఆర్‌ను చేనేత కార్మికులు నిలదీశారు. తమ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి స్పందనగా పద్మశాలీల అభివృద్ధికి ఏం చేశారో మోదీని అడగాలని కేటీఆర్ బదులిచ్చారు. దీంతో మోదీ మాకు తెల్వదు.. మీరే అభివృద్ధి చేయాలంటూ ఓ మహిళ సమాధానమిచ్చింది. పిల్లలతో భోజనం.. నిరసనలు ఎదురైన తన పర్యటను యథావిధిగా కొనసాగించారు కేటీఆర్. కమలాపుర్ ఎంజేపీ స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి ముచ్చటించారు. అనంతరం డ్రోన్ల ఉపయోగాల గురించి వివరించారు. 'డ్రోన్‌తో రైతుల పంటపొలాలపై పురుగుల మందు స్ప్రే చేయొచ్చు. డ్రోన్ అంటే కెమెరా కాదు.. మనుషులను తీసుకుకేళ్ళే వాహనం కూడా అవుతుంది. డ్రోన్‌తో అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. వీటితో గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధరించవచ్చు. ఎవరూ చొరబడకుండా చూడవచ్చు' అని కేటీఆర్ చెప్పారు. అలాగే చదువుకుని మీరంతా ఎమవుతారు? ఉద్యోగం చేస్తారా? అని విద్యార్థులను కేటీఆర్ ప్రశ్నించారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయవచ్చు లేదా 10 మందికి మీరే ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. అవకాశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పిల్లలను హైదరాబాద్‌లోని టీ-హబ్ టాస్క్‌కు తీసుకురావాలని కలెక్టర్, ప్రిన్సిపాల్‌లను కేటీఆర్ అదేశించారు. చదవండి: తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోదం -
రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్
-
రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ పార్టీ విజయానికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కమలాపూర్‌లో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో డ్యాన్స్ చేసి అబ్బురపరిచారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ కమలాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం సందర్భంగా కళాకారుల ధూమ్‌ధామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’ అనే పాటకు మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యే బాల్క సుమన్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి డ్యాన్స్ చేశారు. పార్టీ కండువాలు పట్టుకుని గాల్లో తిప్పుతూ కొంత కాలు కదిపారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. కొన్ని సెకన్ల పాటు ఉన్నఈ వీడియో ఆకట్టుకుంటోంది. చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు -
నేను గెలిస్తే రాజీనామా చేస్తారా..? కేసీఆర్, హరీశ్‌లకు ఈటల సవాల్
కమలాపూర్: ’దమ్ముంటే హుజూరాబాద్‌లో కేసీఆరా, హరీశ్‌రావా? ఎవరు నిలబడతారో చెప్పండి. మీ పోలీసులను, అధికారులను, మంత్రులను, డబ్బులు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చేయండి. మీరు గెలిస్తే రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా తప్పుకుంటా. అదే నేను గెలిస్తే మీరు రాజీనామా చేస్తారా?’ అని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. కమలాపూర్‌లో సోమవారం జరిగిన చేరికల కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు తన ఆస్తి ఎంతో చెప్తానని, మీ ఆస్తి ఎంతో చెప్పగలవా కేసీఆర్? అని ఈటల ప్రశ్నిం చారు. ’నన్ను కుడి భుజం అన్నావు. తమ్ముడు అన్నావు. ఆనాడు గొప్పోన్ని. ఇప్పుడు దెయ్యాన్ని ఎట్లా అయ్యాను చెప్పగలవా కేసీఆర్’ అని ప్రశ్నిం చారు. తాను ఇక్కడ అభివృద్ధి చేయలేదని హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని, హరీశ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చయ్యాయో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఈటల సవాల్ విసిరారు. హరీశ్, తాను ఎన్నిసార్లు ఏడ్చినమో తేదీలతో సహా సమయం వచ్చినప్పుడు చెప్తానని, పదవుల కోసం పెదవులు మూసి సహచర ఉద్యమకారుని మీద పిచ్చికూతలు కూస్తే పలచబడి పోతావని హెచ్చ రించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
చిన్నోడినే కావచ్చు చిచ్చర పిడుగును: ఈటల
కమలాపూర్: తప్పుచేస్తే తనను జైలుకు పంపాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం జరిగిన ప్రజాదీవెన పాదయాత్ర సభల్లో ఈటల మాట్లాడారు. కేసీఆర్‌కు నీతి, జాతి, మానవత్వం లేదని, ఆయన మనిషే కాదన్నారు. ఒక్కసారి తింటేనే మరిచిపోమని, అలాంటిది 18 ఏళ్లు తనతో పని చేయించుకుని, చివరకు భూ కబ్జాదారుడినని బయటకు పంపించాడని మండిపడ్డారు. ‘16 ఏళ్ల క్రితం ఒకాయన నక్సలైట్‌కు అన్నం పెట్టి ఆశ్రయమిచ్చాడని కేసు పెట్టారు. ఇప్పుడా కేసును మళ్లీ బయటకుతీసి జైల్లో పెడతామని 3 రోజుల్నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వెంట పడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడే వాళ్లు కాదు నా అభిమానులు’ అని ఈటల అన్నారు. తాను చిన్నోన్నే కావచ్చు కానీ చిచ్చర పిడుగునని, గెలిచిన తర్వాత తెలంగాణలో విప్లవం వస్తుందన్నారు. -
హరీష్‌రావుకు కూడా నా గతే పడుతుంది: ఈటల ఫైర్
సాక్షి, కమలాపూర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండలాలకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లు అడగాలే తప్ప నీచంగా వ్యవహరించొద్దని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హితవు పలికారు. కమలాపూర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్లో చేరేటప్పటికే నాకు వందల కోట్ల ఆస్తులున్నాయి.. నేను ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా మీద కుట్ర చేసి చిల్లర ఆరోపణలతో తొలగించి మంత్రి పదవి లాగేసుకున్నరు.. దమ్ముంటే రాజీనామా చేయమన్నరు చేసిన.. కానీ మీరు చేస్తున్నదేంటి.. ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని విమర్శించారు. నేను నీతిగా హుజూరాబాద్ ప్రజల మీద నమ్మకంతో రాజీనామా చేసి వచ్చిన.. వారి కష్ట సుఖాల్లో నేనే ఉన్నా.. ఇప్పుడు యావత్ తెలంగాణ హుజూరాబాద్ వైపే చూస్తోన్నది.. కేసీఆర్ నా బొండిగ పిసుకడానికి సిద్ధమయ్యాడు.. ఆయన అహంకారాన్ని, డబ్బుని, అధికారాన్ని తొక్కి పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమలాపూర్ ఇన్చార్జ్ అయితే ఎక్కడ, ఎలా సంపాదించాడో తెలియదు.. ఆయన డబ్బులనే నమ్ముకున్నాడు. స్కూల్‌ను బార్గా మార్చిన నీకు కర్రు కాల్చి వాత పెడుతం బిడ్డా.. అని హెచ్చరించారు. జమ్మికుంటలో వర్ధన్నపేటలో ఆయన తిరుగుతూ నాయకులను కొనుగోలు చేస్తున్నాడు. మీరు నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరు.. అది మీకే కాదు కేసీఆర్ జేజమ్మకు కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉండవచ్చు.. ఇంత ఘోరంగా ఉంటారా.. మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.. రేపు మీ నియోజకవర్గాల్లో మీ పరిస్థితి కూడా ఇంతేనని గుర్తుంచుకోండి.. నన్ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే.. మంత్రి హరీశ్‌రావుకు ఇక్కడి నుంచి మందిని తీసుకుపోయి దావత్ ఇచ్చి డబ్బులు ఇయ్యడమే మీపనా.. ఆయన సీఎం దగ్గర మెప్పు పొందాలని చూస్తున్నాడు.. ఆయనకు కూడా నా గతే పడుతుంది.. అని హెచ్చరించారు. సొంత పార్టీ నాయకులకే ఖరీదు కట్టిన దుర్మార్గపు పార్టీ టీఆర్ఎస్.. ఇది చూసి దేశమంతా తల దించుకుంటోందని అన్నారు. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో మిగతా పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. పోలీసులు చట్టానికి లోబడి పని చేయకుండా మా వాళ్లను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని ఈటల స్పష్టం చేశారు. అసలు మీరు చట్టాలని లోబడి పని చేస్తున్నారా? చుట్టంగా పని చేస్తున్నారా అని డీజీపీ, సీఎస్‌ను ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. బానిసలుగా పని చేస్తే ఖబడ్దార్, బీ కేర్‌ఫుల్ అని పోలీసులను హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రావు అమరేందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, నాయకులు కుమారస్వామిగౌడ్, సాంబరావు, శోభన్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
Eatala: రక్తతర్పణం చేసిన గడ్డ హుజూరాబాద్
కమలాపూర్: ‘కేసీఆర్ డబ్బు, కుట్రలు, అవసరానికి మోసాన్ని నమ్ముకుంటాడే తప్ప ధర్మం, ప్రజలను నమ్ముకోడు.. ఈ కుట్రలకు చరమగీతం పాడేది హుజూరాబాద్ నియోజకవర్గం..’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘కేసీఆర్ వందల కోట్ల డబ్బుపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో గెలవొచ్చు.. కానీ హుజూరాబాద్‌లో ధర్మమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఇక్కడ డబ్బు, నిర్బంధాలు, దబాయింపులకు ఆస్కారం లేదని.., రక్తతర్పణం చేసిన గడ్డ హుజూరాబాద్ అని అన్నారు. మండలంలోని ఉప్పల్ ఉద్యమాల గడ్డ అని, ఉద్యమ సమయంలో రైల్‌రోకో చేసినప్పుడు ఫైరింగ్ చేస్తామన్నా కూడా లెక్క చేయలేదని గుర్తుచేశారు. ‘ఒకప్పటి నీ ఉద్యమ సహచరుడిగా అడుగుతున్నా.. 2006లో నీ వెంట ఉన్నదెవరు.. మేము కాదా?’అని కేసీఆర్‌ను ఈటల ప్రశ్నించారు. మీరు ఎంత డబ్బు ఇచ్చి మభ్యపెట్టినా ప్రజలు తన వెంటే ఉంటారన్నారు. రైతుబంధు పేదవాడికే ఇవ్వాలని, డబ్బున్న వారికి ఇవ్వొద్దని తాను చెప్పినట్లు ఈటల తెలిపారు. రైతుల పంటకు గిట్టబాటు ధర ఇవ్వాలనడంలో ఏం నేరముందో చెప్పాలన్నారు. -
హుజూరాబాద్ మరో ఉద్యమానికి నాంది కాబోతోంది: ఈటల
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ మరో ఉద్యమానికి నాంది కాబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అబద్ధాలకోరులు తమని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఆయన మంగళవారం హుజూరాబాద్ నియాజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కమలాపురం మండలం శంభునిపల్లిలో రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి హుజూరాబాద్ ప్రజలు ఊపిరిపోయాలన్నారు. ప్రగతిభవన్ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ను చదవడమే కొందరి పని అని ఆరోపించారు. తన గురించి మాట్లాడేవారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని, 19ఏళ్లు తెలంగాణ ఉద్యమం కోసం పని చేశానని చెప్పారు. త్వరలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మానికి, అధర్మానికి యుద్ధం జరుగుతుందని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. హక్కుల కోసం, నిరుద్యోగులకు కోసం పోరాటం చేస్తానని, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఎన్నిక జరగబోతుందని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్ వెళ్లడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Huzurabad: ఉప ఎన్నికపై గులాబీ వ్యూహం -
రెండు కిలోమీటర్ల మేర రాజుకున్న అగ్గి
కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వరి కోసిన పంటపొలాల్లోని కొయ్య కాళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో ఈదులకుంట నుంచి కొత్తకుంట వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ మంటలు వ్యాపించాయి. ఇలా సుమారు వంద ఎకరాలకు మంటలు విస్తరించగా.. పశుగ్రాసంతో పాటు 20 మంది రైతులకు చెందిన పైపులు, విద్యుత్ వైర్లు, మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. మరోవైపు అగ్నిమాపక వాహనాలు కూడా రాకపోవడంతో రాత్రివరకు మంటలు భారీగా ఎగిసి పడుతూనే ఉన్నాయి. గ్రామాన్ని దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: రైతుల పొట్టగొట్టి.. జనాల జేబుకొట్టి.. దోచుకుంటున్న వైనం మా చేతిలో ఏమీ లేదు: చేతులు ఎత్తేసిన తెలంగాణ మంత్రులు -
Huzurabad: పట్టుబిగిస్తున్న అధిష్టానం.. ఈటల ఒంటరేనా?!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ కేడర్‌ను దూరం చేసేలా పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. రాజీనామా చేయకుండా పోటాపోటీగా ప్రెస్మీట్ల ద్వారా ఎదురుదాడి చేస్తున్న ఆయనను ఒంటరిని చేసేందుకు వ్యూహం అమలు చేస్తోంది. ఒకవేళ రాజేందర్ పార్టీ వీడినా టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ చేజారకుండా హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పట్టు బిగిస్తోంది. సుమారు వారం పాటు స్థబ్దత నెలకొనగా... రెండు రోజులుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇన్ని రోజులు వేచిచూసే ధోరణి ప్రదర్శించిన నాయకులు ‘కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తాం... టీఆర్ఎస్లోనే ఉంటాం’ అని ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్‌పై ‘ఆపరేషన్ గంగుల’ పేరిట బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాపూర్ కమలాపూర్, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటుండగా, త్వరలోనే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ టి.హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ రంగంలోకి దిగుతారన్న ప్రచారం కమలాపూర్‌లో సాగుతోంది. ఫలిస్తున్న టీఆర్ఎస్ వ్యూహం.... మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురై ఇరవై రోజులు గడుస్తున్నా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న వ్యూహాలు సత్పలితాలు ఇస్తున్నాయి. రాజేందర్ తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లాక పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇరవై రోజుల పాటు వేచిచూసిన పలువురు టీఆర్ఎస్ సీనియర్లు బుధవారం ప్రెస్మీట్ల ద్వారా తమ వైఖరి స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టాక తర్వాత తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేస్తుండగా, ఒక్కొక్కరుగా ఆయన శిబిరం నుంచి బయట పడుతున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సమయంలో రాజేందర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పలువురు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారు. కరీంనగర్లో మకాం వేసిన గంగుల కమలాకర్‌ను కలిసొచ్చి హుజూరాబాద్, కమలాపూర్‌ల్లో ప్రెస్మీట్లు పెడుతున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తాం టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న పలువురు సీనియర్లతో పాటు మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు గులాబీ జెండా కిందే పని చేస్తామని బుధవారం ఖరాకండిగా ప్రకటించారు. కమలాపూర్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీలోనే కొనసాగుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పింగిలి ప్రదీప్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధికా శ్రీనివాస్, వైస్‌చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, ఎంపీటీసీలు తాళ్లపెల్లి శ్రీనివాస్ తదితరులు ప్రెస్మీట్లో ఈటల రాజేందర్ వైఖరిని ఖండించారు. టీఆర్ఎస్లోనే తమ ప్రస్థానం కొనసాగుతుందని, డబ్బులు, ప్రలోభాలకు లొంగే నాయకులు టీఆర్ఎస్లో, నియోజకవర్గంలో లేరని వెల్లడించారు. చదవండి: హుజురాబాద్: హరీశ్‌కు బాధ్యతలు అప్పగిస్తారా? -
ఈటలపై భూకబ్జా ఆరోపణలు: కమలాపూర్‌లో హై టెన్షన్..
సాక్షి, వరంగల్: ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈటల భూ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. కమలాపూర్‌లో ఈటల అభిమానులు ఆందోళనకు దిగారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణచూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నుంచి అభిమానులు హైదరాబాద్ బయలుదేరారు. ఈటలకు అన్యాయం చేస్తే సహించేది లేదని అభిమానులు అన్నారు. హైదరాబాద్‌లో కూడా మంత్రి ఈటలకు మద్దతుగా కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమ నేతను అక్రమంగా భూ వివాదంలో ఇరికించారని ఆందోళనకు దిగారు. శామీర్‌పేట్‌లో కార్యకర్తల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. ఈటల రాజేందర్.. 2004 నుంచి ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుల్లో కీలక నేత ఈటల. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ, అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రజల పక్షాన మాట్లాడుతున్నానంటూ... కొన్ని సార్లు ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించేందుకూ వెనుకాడలేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ఈటల తన సమర్ధతను చాటుకున్నారు. వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా సర్దుకుంటుందనుకునే లోపే శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరంగా మారింది. చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..? -
ఆర్ఎంపీ తెలిసీ తెలియని వైద్యం, యువకుడు మృతి
కమలాపూర్: అనుమతి లేకుండా ఓ ఆర్ఎంపీ చేసిన వైద్యానికి యువకుడు బలయ్యాడు. కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసిన వైద్యం ఆ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లికి చెందిన ఓ యువకుడు (20) సుమారు 10 రోజులు జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతూ గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. దీంతో ఆ ఆర్ఎంపీ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి యువకుడిని తరలించగా అక్కడ కరోనా పాజిటివ్ అని తేలడంతో రెండు రోజుల పాటు చికిత్స చేశారు. ఆ తర్వాత యువకుడు మళ్లీ గ్రామానికి రాగా, కరోనా విషయాన్ని దాచిన ఆర్ఎంపీ మరో మూడు రోజులు వైద్యం చేశాడు. ఇంతలోనే యువకుడి పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళితే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఆ తర్వాత యువకుడిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ చికిత్స పొందుతూ గత నెల 27న ఆ యువకుడు మృతి చెందాడు. కరోనా పాజిటివ్ అని తేలాక కూడా ఎవరికీ చెప్పకుండా వైద్యం చేసిన ఆర్ఎంపీ వైద్యుడు, వరంగల్‌లో వైద్యం అందించిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు గత నెల 31న జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు. (చదవండి: పిందెలు తెంపారని.. పేడ తినిపించారు! ) -
స్టేషన్ ఎదుట కలకలం.. రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూ వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం చోటుచేసుకుంది. ఆయన పరిస్థితి ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన కలకలం రేపింది. కమలాపూర్ పోలీసుస్టేషన్ ఎదుట 20 రోజుల్లో ఇది రెండో ఆత్మహత్యాయత్నం ఘటన కావడం గమనార్హం. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం మర్రిపల్లికి చెందిన కుందూరు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కుటుంబీకులు సుమారు 50 ఏళ్ల కిందట తమ మేనమామ పింగిళి శ్రీరాంరెడ్డి నుంచి 11 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో 1.17 ఎకరాల భూమిని చందుపట్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ భర్త చందుపట్ల సరోత్తంరెడ్డి అండతో వీరి మేనత్త పింగిళి శ్రీమతిదేవి ఆక్రమించుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీమతిదేవి ఆ భూమిలో వరి నాట్లు వేయగా శ్రీనివాస్‌రెడ్డి అడ్డుకున్నాడు. దీనిపై కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 24వ తేదీన కేసు నమోదైంది. ఆ భూమిలోకి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు. అయితే బుధవారం శ్రీమతిదేవి సంబంధీకులు వెళ్లడంతో సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవద్దని, రెవెన్యూ అధికారులు లేదా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డిని ఎస్ఐ పరమేశ్ బెదిరింపులకు గురి చేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసుల నుంచి తనకు న్యాయం జరగడం లేదనే శ్రీనివాస్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి పోలీస్‌స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఎస్ఐ జె.పరమేశ్ వెంటనే శ్రీనివాస్‌రెడ్డిని కమలాపూర్ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి కోలుకుంటున్నాడని, ఆయన ఆత్మహత్యాయత్నానికి పోలీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ఇలాంటి సంఘటన కమలాపూర్ పోలీసుస్టేషన్ ఎదుట 20 రోజుల్లో ఇది రెండోది. -
ఊరికి ఉపకారం
-
వివాహేతర సంబంధం. యువకుల దారుణ హత్య
-
వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత్య
-
వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత్య
భూపాలపల్లి: జయశంకర్ జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆగ్రహంతో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇద్దరు యువకులను కిరాతకంగా నరికిచంపారు. ఈ సంఘటన ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కమలాపూర్‌కు చెందిన నర్రా శీను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన సదరు మహిళ కుటుంబసభ్యులు నాలుగు రోజుల క్రితం శీనును పిలిచి మందలించారు. వివాహేతర సంబంధం మానేయాలని సూచించారు. అతను పెడచెవినపెట్టడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు శీనును, అతనికి సహకరిస్తున్న జర్సుల కల్యాణ్(బాలు) వ్యక్తిని తుదముట్టించాలని నిర్ణయించారు. శనివారం రాత్రి 10 గంటలకు ఇద్దరిని చర్చలకోసం పిలిచి బాగా మద్యం తాగించి ఇంటివద్దకు తీసుకెళ్ళి కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో నరికి చంపారు. అనంతరం నిందితులు 8 మంది పోలీసులకు లొంగిపోయారు. ఆదివారం ఉదయం శ్యామ్‌లాల్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు వెంటబెట్టుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రక్తం మడుగులో పడిఉన్న మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు కమలాపురంలోని మృతులు శీను, బాలు బంధువులు నిందితుల ఇళ్లపై ఆదివారం మధ్యాహ్నం దాడిచేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసంచేశారు. ఇంట్లో ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. -
ప్రజల రుణం తీర్చుకోవడమే నా ఎజెండా
కమలాపూర్‌ను అన్ని రంగాల్లోఅభివృద్ధి చేస్తా ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కమలాపూర్ : ముక్కూ, ముఖం తెలియని నాడు అండగా ఉండి ఇంతగా ఆశీర్వదించిన మండల ప్రజల రుణం తీర్చుకోవడమే తన ఎజెండా అని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలంలో పర్యటించి రూ.2.37 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ కమలాపూర్‌ను వరంగల్ అర్బన్ జిల్లాలో కలిసిన తర్వాత మొద టి సారిగా మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్నారు. కమలాపూర్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాకు తీసిపోని విధంగా విద్య, ఇన్‌ఫ్రాస్టక్చ్రర్, పరిశ్రమలు, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యంగా సీడ్ బౌల్ అఫ్ తెలంగాణలో భాగంగా కమలాపూర్ మండలాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇప్పటికే మండలానికి హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వచ్చిందని, బీపీసీఎల్, ఐఓసీ ఫిల్లింగ్ స్టేషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాటర్‌గ్రిడ్ (మిషన్ భగీరథ)రాకముందే కమలాపూర్‌లో రూ.20 కోట్లతో ఫిల్టర్‌బెడ్ నిర్మించి దానిని మిషన్ భగీరథకు అనుసంధానం చేసి 2018 లోగా మండల ఆడబిడ్డలకు కానుకగా ఇంటింటికి నల్లా ఇస్తానన్నారు. గతంలో వాగులపై బ్రిడ్జిలు లేక వర్షం వస్తే మండలం ఐలాండ్‌గా మారేదని, ఇప్పుడా పరిస్థితి లేకుండా మండల వ్యాప్తంగా రూ.40 కోట్లతో 10 బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. రూ.170 కోట్లతో హుజూరాబాద్ నుంచి పరకాల వరకు ఫోర్‌లేన్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ సంపత్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, తదితరులు పాల్గొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే వరంగల్‌లోకి.. కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లాకు కూత వేటు దూరంలో ఉంద ని, నిత్యం మండల ప్రజలు ఏ పని కోసమైనా వరంగల్‌కే వెళ్తారని, ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యానికే మం డలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలి పామని మంత్రి ఈటల పేర్కొన్నారు. దీనిపై మండల ప్రజలు కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కానీ త్వరలో అంతా సర్దుకుంటుందన్నారు. -
వైశ్యా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వైశ్యా బ్యాంక్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. బ్యాంక్ తాళాలు పగలగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు చోరీకి ప్రయత్నించారు. అది సాధ్యపడక పోవడంతో.. సమీపంలోని మూడు షాపుల తాళాలు పగలగొట్టి అందులో ఉన్న విలువైన వస్తువులతో పాటు రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
మూడు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన
కమలాపూర్ : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని బృందం మండలంలోని గుండేడు, పంగిడిపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో శనివారం పర్యటించింది. బృంద సభ్యులు గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, స్వయం సహాయక సంఘాల పనితీరు, ఉపాధిహామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఉపాధికూలీలు, ఐఎస్ఎల్ లబ్ధిదారులతో మాట్లాడారు. ఉపాధిహామీ పనులను వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని, పనిదినాలు పెంచాలని పలువురు గ్రామస్తులు కేంద్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ లక్ష్మణ్‌రావు, సర్పంచులు రాజబోస్, రజిత, ఎంపీటీసీ పద్మ, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, ఎంపీడీవో పద్మావతి, ఈవోపీఆర్డీ రవిబాబు, ఐకేపీ ఏసీ నిర్మల, ఏపీఎం నారాయణ, ఈజీఎస్ ఈసీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రసూతి సెలవుల దుర్వినియోగంపై విచారణ
కమలాపూర్ : మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పి.సునీత ప్రసూతి సెలవుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణాధికారి, హుజూరాబాద్ డెప్యూటీ ఈవో కట్ల ఆనందం శుక్రవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సునీతపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం జరిపిన విచారణలో ఆమెతో పాటు గతంలో ఇక్కడ ఎంఈవోలుగా పనిచేసిన ఏవీ రమణారెడ్డి్డ, పి.ఝాన్సీలక్ష్మి నుంచి వేర్వేరుగా రాత పూర్వక వివరణలు తీసుకున్నారు. సునిత 2012 నవంబర్ 23 నుంచి 2013 మే 21 వరకు ప్రసూతి సెలవులు వినియోగించుకున్నారు. అయితే ఆమె బోగస్ డెలివరీ సర్టిఫికెట్ సమర్పించి ప్రసూతి సెలవుల దుర్వినియోగానికి పాల్పడి 6 నెలల వేతనం పొందారని, అందుకు అప్పటి జిల్లా విద్యాధికారి లింగయ్య పూర్తిగా సహకరించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించిన నేపథ్యంలో గతేడాది జూన్ 6న జగిత్యాల డెప్యూటీ ఈవో జగన్మోహన్రెడ్డి కమలాపూర్‌లో విచారణ జరిపారు. సునీత అస్వస్థతకు గురవడంతో విచారణ మధ్యలోనే ఆగిపోయింది. డీఈవో ఆదేశాల మేరకు ప్రసూతి సెలవుల దుర్వినియోగంపై మరోసారి విచారణ జరిపామని, విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయనున్నట్లు విచారణాధికారి తెలిపారు. కార్యక్రమంలో సహాయ విచారణాధికారులు రాంరెడ్డి, భాగ్యవతి, ఎంఈవో రాంకిషన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సంతో భారీగా నష్టం
కమలాపూర్ (కరీంనగర్ జిల్లా) : కమలాపూర్ మండలం పరిధిలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కమలాపూర్, కనిపర్తి, గూడూర్, అంబాలా, నేరెళ్ల, శ్రీరాములపల్లి, గునిపర్తి, మాదన్నపేటతోపాటు పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో రాత్రి నుంచి అంధకారం నెలకొంది. గాలికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, మామిడి, సపోట నేలరాలాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది చర్యలు చేపట్టారు. -
ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు
కమలాపూర్ : కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామ శివారున ఉన్న చెరువులో ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టిని ట్రాక్టర్లో నింపుతుండగా ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ :15 మందికి గాయాలు
కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగిలిన వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలు అందరూ మర్రిపల్లి గూడెంకు చెందిన వారు. వరంగల్ జిల్లాలో పనుల కోసం వెళుతుండగా ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నను చంపిన తమ్ముడు
కమాలాపూర్ ( కరీంనగర్ ): మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సొంత తమ్ముడి చేతిలోనే హతమయ్యాడు. ఈ సంఘటన కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉప్పల్ గ్రామానికి చెందిన ఐలయ్య(42), యాదగిరి(35)లు అన్నదమ్ములు. ఐలయ్య రోజూ మద్యం తాగి వస్తూ ఇంట్లో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో శుక్రవారం బాగా మద్యం సేవించి తల్లితో గొడవ పడ్డాడు. దీంతో యాదగిరి జోక్యం చేసుకుని ఐలయ్యను మందలించాడు. ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన యాదగిరి పక్కనే ఉన్న టిఫిన్ బాక్స్‌తో ఐలయ్య తలపై మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
జీపు, బైక్ ఢీ: ప్రభుత్వ ఉద్యోగి మృతి
కరీంనగర్ జిల్లా కమాలాపూర్ మండలం వగపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అంకూస్ అనే ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై వెళుతున్న అంకూస్ ను ఎదురుగా వస్తున్న జీపు ఘీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘనటలో నలుగురుతీవ్రంగా గాయపడ్డారు. మరో ఐదుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. -
ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో
కమలాపూర్ : కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామ వీఆర్వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... జమ్మికుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మట్టా అంజిరెడ్డి తండ్రి రాజిరెడ్డి పేర గుండేడు గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే దీనికి సంబంధించిన పహాణీ కాపీలో మిట్టా రాజిరెడ్డి అని ఉంది. దీంతో పేరును సరిచేయడంతోపాటు సర్వే నంబర్ 15లో ఉన్న 30 కుంటల భూమి వివరాలను పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదు చేయాలంటూ అంజిరెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పని చేసేందుకు రూ.18వేలు లంచం ఇవ్వాలని గుండేడు వీఆర్వో రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. లోగడ రూ.2 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.16 వేలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. మంగళవారం కమలాపూర్‌లోని ఓ జిరాక్స్ షాపులో అంజిరెడ్డి నుంచి రూ.16 వేలను తీసుకుంటుండగా వీఆర్వో రమేశ్‌బాబును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
రాలుతున్న రైతన్నలు
ఏళ్లుగా సాగు చేస్తున్నా కలిసిరాని వ్యవసాయం. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట ఆదుకోకపోగా.. నట్టేట ముంచుతోంది. ఈ సారీ అన్నదాతను ప్రకృతి పగబట్టింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మొక్కలు ఎండిపోతున్నాయి. బావిలో ఉన్న నీటిని పంటకు పారిద్దామంటే కరెంటు కోతలు అడ్డుకుంటున్నాయి. కళ్లముందే పంట మట్టిపాలవడం.. సాగుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతన్న చితికిపోతున్నాడు. మనోవేదనతో ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నాడు. ఒక్కరోజే జిల్లాలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. కమలాపూర్ : మండలకేంద్రానికి చెందిన ఏకు రాజు అలియాస్ పరకాల రాజు(35) సెంట్రింగ్ కూలీగా పనిచేసుకుంటూనే కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది నాలుగెకరాలు భూమి కౌలు తీసుకుని పత్తి పంట వేశాడు. అకాలవర్షాలకు పంటచేతికొచ్చే దశలో నష్టపోయింది. ఈ ఏడాది సైతం నాలుగెకరాల కౌలు భూమిలో మళ్లీ పత్తి వేశాడు. పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. వర్షాలు లేక, కరెంటుకోతలతో పంటంతా దెబ్బతింటోంది. ఈసారి కూడా పంట చేతికి రాకపోతే అప్పులెలా తీర్చాలని మథనపడుతూ శుక్రవారం మధ్యాహ్నం పత్తి చేను వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. గ్రామశివారులో క్రిమిసంహారకమందు తాగాడు. ఎంతకూ రాకపోయే సరికి కుటుంబసభ్యులు వెతుక్కుంటూ వెళ్లగా శివారులో శవమై కనిపించాడు. రాజుకు భార్య వనిత, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహం వద్ద బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వనిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్పాల్సింగ్ తెలిపారు. కమాన్‌పూర్ : కమాన్‌పూర్ మండలం గుండారం పరిధి రాజాపూర్‌కు చెందిన చొప్పరి నర్సయ్య(45) అనే కౌలురైతు తన బంధువులకు చెందిన రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. వర్షాలు కురవకపోవడంతో పంట ఎదగకుండా వాడిపోతోంది. పంట చేతికొచ్చే అవకాశం లేదని మనస్తాపం చెందిన ఆయన గురువారం రాత్రి ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి కరీంనగర్ తరలించగారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. నర్సయ్యకు భార్య నర్సమ్మ, కూతురు శ్యామల ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై అన్వర్ తెలిపారు. కాటారం : కాటారం మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన చిలుముల సమ్మయ్య(47) గతేడాది తన మూడెకరాల పొలంలో వరి సాగు చేశాడు. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. పెట్టుబడి కోసం తెలిసినవారి వద్ద రూ.2 లక్షల మేర అప్పు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో అప్పు కట్టలేకపోయాడు. పది నెలల క్రితం కూతురు పెళ్లి చేయగా మరో రూ.3 లక్షలు అప్పు అయింది. ఈ ఏడాది సైతం మరో రూ.లక్ష అప్పు తెచ్చి పంట వేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట సరిగా ఎదగకపోవడంతో మొత్తం రూ.6 లక్షల అప్పు ఎలా తీర్చాలని మనస్తాపం చెందిన సమ్మయ్య గురువారం రాత్రి బయటకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగి ఇంటికి వచ్చాడు. కుటుంబసభ్యులు గమనించి 108 ద్వారా మహదేవపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సమ్మయ్యకు భార్య అంకమ్మ, కూతుళ్లు వనజ, సృజన, కుమారుడు శివప్రసాద్ ఉన్నారు. -
ప్రాణం తీసిన కరెంట్‌షాక్
కమలాపూర్ : శంభునిపల్లికి చెందిన ఎండ్రాల రాజేశ్వర్‌రావు (57) అనే కౌలు రైతు మంగళవారం విద్యుదాఘాతంతో మరణించాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజేశ్వర్‌రావు కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అప్పులపాలై స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఎడ్ల వ్యాపారంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది వాగు ఒడ్డుకు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో పత్తి పంట వేయగా మిగతా నాలుగెకరాల్లో వరిపొలం వేయాలని నారు పోశాడు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నాటు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా కరెంటు పోయింది. కరెంటు మోటార్ వాగుకు బిగించగా పుట్‌వాల్వ్‌కు చెత్త తట్టుకుని రోజు నీళ్లు తక్కువగా పోస్తుందని చెత్త తీసేందుకని పుట్‌వాల్వ్ వద్దకు నీటిలోకి దిగాడు. ఇంతలోనే కరెంటు రాగా, ఆటోమేటిక్ స్టార్టర్ కావడంతో మోటార్ ఆన్ అయి కాలిపోయింది. షార్ట్‌సర్క్యూట్‌తో కిందిపైపుకు విద్యుత్ ప్రసారం కాగా, ఆ పైపును పట్టుకుని ఉన్న రాజేశ్వర్‌రావు విద్యుదుఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి వచ్చి విగతజీవిగా మారిన రాజేశ్వర్‌రావును చూసి విలపించారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్పాల్సింగ్ తెలిపారు. -
ఆంధ్రోళ్లే బిచ్చమెత్తుకుంటారు
కమలాపూర్: గల్ఫ్ బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లో సోమవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు గల్ఫ్ బాధితులు తమను ఆదుకోవాలని మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. తాము గల్ఫ్ దేశాలు సందర్శించి బాధితుల కష్టాలను స్వయంగా చూశామన్నారు. రూ.500 కోట్లతో కేరళ మాదిరిగా గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. మొన్నటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసిన 43 అంశాల్లో గల్ఫ్ బాధితుల అంశం కూడా ఉందన్నారు. బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితులు, రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నంటిని నెరవేరుస్తామన్నారు. రాజకీయ అవినీతిని పూర్తిగా అంతమొందించిన ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏ అనుభవంతో పరిపాలిస్తారని, భిక్షమెత్తుకోవాల్సి వస్తుందని కొందరు చులకనగా మాట్లాడారని మంత్రి గుర్తుచేశారు. తమకు మందిని ముంచే అనుభవం లేదని, అక్రమాలను చెరబట్టి, బ్రోకర్లను జైళ్లల్లో పెట్టే అనుభవం మాత్రం ఉందని అన్నారు. భిక్షమెత్తుకునేది ఆంధ్రోళ్లే తప్ప తెలంగాణ సమాజం కాదన్నారు. -
ఆర్టీసీ అద్దెబస్సులో చెలరేగిన మంటలు
కరీంనగర్: జిల్లాలోని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో సోమవారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బస్సులో డీజిల్ ట్యాంకు లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ భయాందోళనలకు గురైయ్యారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు పాక్షికంగా ధ్వంసం కావడంతో పెనుప్రమాదం తప్పింది. -
వ్యాన్ - లారీ ఢీ: ముగ్గురు మృతి
మనకోడూరు మండలం గట్టుదుద్దినపల్లి వద్ద ఈ రోజు తెల్లవారుజామున గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో ముగ్గరు వ్యక్తులు మరణించారని కరీంనగర్ సీఐ కే.సృజన్ రెడ్డి వెల్లడించారు. వ్యాన్ కమలాపురం వైపు వస్తుండగా ఈ దుర్ఘనట చోటు చేసుకుందని చెప్పారు. మృతుల్లో వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నారన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. మృతులు నవీన్ కుమార్, డేవిడ్ రాజు, రెడ్డి కిషోర్లుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించామన్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ తెలిపారు.