ప్రాణం తీసిన కరెంట్‌షాక్
కమలాపూర్ : శంభునిపల్లికి చెందిన ఎండ్రాల రాజేశ్వర్‌రావు (57) అనే కౌలు రైతు మంగళవారం విద్యుదాఘాతంతో మరణించాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజేశ్వర్‌రావు కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అప్పులపాలై స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఎడ్ల వ్యాపారంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది వాగు ఒడ్డుకు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో పత్తి పంట వేయగా మిగతా నాలుగెకరాల్లో వరిపొలం వేయాలని నారు పోశాడు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నాటు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా కరెంటు పోయింది.
కరెంటు మోటార్ వాగుకు బిగించగా పుట్‌వాల్వ్‌కు చెత్త తట్టుకుని రోజు నీళ్లు తక్కువగా పోస్తుందని చెత్త తీసేందుకని పుట్‌వాల్వ్ వద్దకు నీటిలోకి దిగాడు. ఇంతలోనే కరెంటు రాగా, ఆటోమేటిక్ స్టార్టర్ కావడంతో మోటార్ ఆన్ అయి కాలిపోయింది. షార్ట్‌సర్క్యూట్‌తో కిందిపైపుకు విద్యుత్ ప్రసారం కాగా, ఆ పైపును పట్టుకుని ఉన్న రాజేశ్వర్‌రావు విద్యుదుఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి వచ్చి విగతజీవిగా మారిన రాజేశ్వర్‌రావును చూసి విలపించారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్పాల్‌సింగ్ తెలిపారు.