Rajeshwar Rao
-
గతంకన్నా ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం: ఆర్బీఐ
ముంబై: భారత ఫైనాన్షియల్ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బలమైన ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ వాటిని ఎదుర్కొంటోందని అన్నారు. డిప్యూటీ గవర్నర్ జేపీ మోర్గాన్ ఇండియా లీడర్షిప్ సిరీస్ ఉపన్యాసం చేస్తూ, 2024లో జీ20 సభ్యులలో భారతదేశం అత్యధిక వాతావరణ మార్పు పనితీరు సూచిక (సీసీపీఐ) స్కోర్‌ను సాధించిందని అన్నారు. వాతావరణ పరిరక్షణ విషయంలో భారత్ చిత్తశుద్దిని తెలియజేస్తున్నట్లు వివరించారు. దేశంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్లకూ ఇది దోహదం చేసే అంశమని తెలిపారు. బ్యాంకింగ్ రంగం పటిష్ట బాటలో పయనిస్తోందని అన్నారు. -
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాస్‌రావు,జస్టిస్ రాజేశ్వర్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 2001లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మహబూబాబాద్ జిల్లా సూదన్‌పల్లిలో 1969 జూన్ 30న నామవరపు రాజేశ్వర్‌రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లో.. హైసూ్కల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. -
జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించండి
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావులకు తగి న అర్హతలు కలిగి ఉన్నారని నిర్ణయించినట్టు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీని సీజేఐ ఆదేశించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించింది. -
ఇద్దరూ ఒకేసారి శాసనసభ పక్ష నేతలుగా...
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వారిద్దరూ ఉమ్మడి శాసనసభలో కరీంనగర్ జిల్లాలో వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికవ్వడం, భిన్న ధ్రువాలు, విభిన్న సిద్ధాంతాలతో సీపీఐ, బీజేపీల నుంచి ప్రాతినిథ్యం వహించడం, శాసనసభలో సభాపక్ష నేతలుగా ఉండటం ఎప్పటికీ ఓ రికార్డే. ♦ చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల నియోజక వర్గం నుంచి 1967, 1978, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐ నుంచి, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఆయన సోదరుడైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1985,1989,1994 ఎన్నికల్లో బీజేపీ నుంచి మెట్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరీంనగర్ ఎంపీగా 1998, 1999 ఎన్నికల్లో రెండుమార్లు ఎంపికై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ♦ 1994 నుంచి 1999 మధ్యకాలంలో ఉమ్మడి శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేతగా సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీపీఐ శాసనసభ పక్షనేతగా సీహెచ్ రాజేశ్వర్‌రావు ఉన్నారు. అసెంబ్లీలో కాషాయదళపతిగా విద్యాసాగర్‌రావు, ఎరుపుదళానికి నాయకుడిగా రాజేశ్వర్‌రావు తమ పార్టీల వాణిని ఆయా సందర్భాల్లో బలంగా వినిపించారు. ఒకరి విధానాలను మరొకరు ఖండించి ఎండగట్టారు. ఎదుట నిలుచుంది సోదర బంధం, రక్త సంబంధమైనా విధానాలపరంగా ఒకరినొకరు విరుద్ధ వేదికలపై నిలిచారు. విధానాలపరంగా పరస్పరం ఎదుటి పార్టీలో ఉన్న సోదరుడిని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు ఏనాడూ వెనకడుగు వేయని అరుదైన సందర్భాలు వీరిద్దరి హయాంలో అనేకమున్నాయ. -
గ్రీన్ ఫైనాన్స్ వ్యవస్థ పటిష్టం కావాలి..
ముంబై: గ్రీన్ ఫైనాన్స్ (వాతావరణ పరిరక్షణకు దోహదపడే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా రుణాలు) వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పర్యవేక్షణ, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, ప్రమాణాల అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురైనా, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణ అంశాల్లో ఆర్బీఐ పాత్ర గురించి ఇక్కడ జరిగిన ఒక చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ చర్చాగోష్ఠిని నిర్వహించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. రాజేశ్వర రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు... కొత్త గ్రీన్ వెంచర్లకు ఆర్థిక సహాయం చేయడం మాత్రమే సరిపోదు. ఇప్పటికే ఉన్న ఉద్గార సంస్థలు ఉత్పత్తి లేదా వృద్ధి అంశాలపై రాజీ పడకుండా విశ్వసనీయమైన వాతావరణ అనుకూల పరివర్తన ప్రణాళికలను రూపొందించుకొని, అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల సహాయ సహాయసహకారాలు, కార్యాచరణ ప్రణాళికలు అవసరం. ఇది గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్లో పారదర్శకత, ప్రామాణీకరణ, సమగ్రతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. సంవత్సరాలుగా గ్రీన్ ఫైనాన్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటికి మద్దతు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ విధాన చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు బ్యాంకుల ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్ఎల్) పోర్ట్‌ఫోలియోలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ను చేర్చడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సావరిన్ గ్రీన్ బాండ్లను (ఎస్‌జీఆర్‌బీ) విజయవంతంగా జారీ చేయడంలో భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇచి్చంది. ఈ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల అమలుకు వినియోగించే విషయం తెలిసిందే. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ... ఇందుకు సంబంధించి ఇతర ఆర్థిక సాధనాల విషయంలో ధరను నిర్దారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే దేశంలో గ్రీన్ ఫైనాన్సింగ్ పర్యావరణ వ్యవస్థకు ఉద్దేశించిన మార్కెట్ అభివృద్ధికి పురికొల్పుతుంది. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై వాతావరణ మార్పు ప్రభావాల గురించి ప్రపంచ దేశాల్లో అవగాహన పెరుగుతోంది. తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, పర్యవేక్షకుల సానుకూల ప్రతిస్పందనలూ పెరుగుతున్నాయి. వాతావరణ సమస్యలు, సంబంధిత ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి సెంట్రల్ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎకానమీ భాగస్వామ్యులను సన్నద్ధం చేయడానికి పెద్ద ఎత్తున సామర్థ్య నిర్మాణ ప్రయత్నాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. తద్వారానే నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మూలధనాన్ని సమీకరించగలరు. స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతమైన పరివర్తన ప్రణాళికలను రూపొందించగలరు. వాతావరణ అనుకూల పారిశ్రామికీకరణ విషయంలో సూక్ష్మ, లఘు, మధ్య, చిన్న (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలపై పాత్ర ఎంతో కీలకం. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వాతావరణ పరిరక్షణకు చర్యలు, ఆర్థిక కట్టుబాట్లు, అమలు సంతృప్తికరంగా లేదు. ఏమి చేస్తున్నారు– చేయవలసినది ఏమిటి అన్న అంశాల మధ్య అంతరం పెరుగుతోంది. ఈ విషయంలో 100 బిలియన్ డాలర్ల హామీకి భిన్నంగా 2020లో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం 83.3 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. 2019తో పోల్చితే ఇది కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయి. ఇలాంటి ధోరణి మారాలి. -
సమ్మె కొనసాగిస్తున్న జేపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తమ నిరవధిక సమ్మెను కొనసాగించాలని జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)లు నిర్ణయించారు. గురువారానికి వారి సమ్మె 14వ రోజుకు చేరుకోనుంది. తెలంగాణ పంచాయత్ సెక్రటరీ ఫెడరేషన్ (టీఎస్పీఎఫ్) అధ్యక్ష బాధ్యతల నుంచి రాజేశ్వర్ రావు తప్పుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎ.శ్రీకాంత్‌గౌడ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బుధవారం వివిధ జిల్లాల నుంచి వచ్చి న జేపీఎస్‌లు సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒక హామీ వచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని తీర్మానించారు. శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ...’’మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే వెంటనే విధుల్లో చేరి మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. జేపీఎస్‌ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న ఫేక్ మేసేజ్‌లు నమ్మకండి. జిల్లా అధ్యక్షులు పంపించే మెసేజ్‌లనే ప్రామాణికంగా తీసుకోవాలి’ అని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం విధుల్లో చేరిన వారిలో పలువురు మళ్లీ సమ్మెలో చేరారని కార్యదర్శులు చెబుతున్నారు. నోటీసులిస్తే కోర్టులను ఆశ్రయించాలని... మంగళవారం సాయంత్రం 5లోగా విధుల్లో చేరకపోతే టెర్మినేట్ చేస్తామని పీఆర్‌శాఖ అల్టిమేటమ్ జారీచేసినా...ఈ శాఖ ఉన్నతాధికారులు కొంత సంయమనం పాటిస్తూ బుధవారం విధులకు హాజరుకాని వారికి నోటీసులు కూడా జారీచేయలేదని తెలుస్తోంది. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటీసులిచ్చి న పక్షంలో వాటిని సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించాలనే అభిప్రాయంతో జేపీఎస్లున్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన సలహాలు సైతం తీసుకున్నట్టు సమాచారం. -
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
డిజిటల్ లెండింగ్ నిబంధనలు..వినియోగ హక్కుల పరిరక్షణ కోసమే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన డిజిటల్ లెండింగ్ నిబంధనలు వినియోగ హక్కుల పరిరక్షణకు అలాగే రెగ్యులేటరీ పరమైన అడ్డంకులను అధిగమించడానికి ఉద్దేశించినవి డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. ఇండస్ట్రీ వేదిక అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, థర్డ్ పార్టీ జోక్యం, అక్రమాలు డేటా గోప్యతలను ఉల్లంఘించడం, రికవరీ పద్దతుల్లో తగిన విధానాలు పాటించకపోవడం, అధిక వడ్డీ వసూళ్ల వంటి పరిస్థితుల్లో ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత ఆగస్టు 10న డిజిటల్ రుణ నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌లోగా వాటిని అమలు చేయాలని పరిశ్రమను గత వారం కోరింది. ఫిన్‌టెక్ పరిశ్రమలో ఆందోళన ఫిన్‌టెక్ పరిశ్రమలోని కొన్ని సంస్థలు– రుణాలు ఇవ్వడంపై నిబంధనలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలి. రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపించకపోతే.. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. -
ఆదర్శంగా నిలిచిన రైల్వే పోలీసులు
ఓ ప్రయాణీకుడు రైల్లో పోగొట్టుకున్న పర్సును తిరిగి అతనికి అప్పగించి కాచిగూడ రైల్వే పోలీసులు తమ నిజాయితిని చాటుకుని పది మందికి ఆదర్శంగా నిలిచారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆర్.లాలియానాయక్ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా గిర్మాజిపేటకు చెందిన టీచర్ కె.రాజేశ్వర్‌రావు (48) యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో బోగినెంబర్ బి1 సీట్ నెంబర్ 18,19 బెర్త్‌లలో తన తమ్ముడు కూచన వినోద్‌కుమార్‌తో కలిసి ఈ నెల 21వ తేదీన యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు ప్రయాణం చేసిన సందర్భంలో మని పర్సు పోగోట్టుకున్నాడు. రైలు దిగి కూకట్‌పల్లిలోని తమ్ముని ఇంటికి వెళ్లిపోయాడు. రైల్వే పోలీసులు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును తనిఖీ చేస్తుండగా పర్స్ దొరికింది. పర్స్‌లో ఉన్న ఐడి కార్డు, ఏటిఎం కార్డుల ఆధారంగా బాధితుడు రాజేశ్వర్‌రావుకు పోన్ చేసి పర్స్ దొరికిన విషయాన్ని రైల్వే పోలీసులు తెలియజేశారు. పర్సులో రూ.5,280 నగదు, ఏటిఎం కార్డు, డ్రై వింగ్ లెసైన్స్ తదితర వస్తువులు ఉన్నవి. రాజేశ్వర్‌రావు రైల్వే పోలీస్ స్టేషన్‌కు వచ్చి పర్సులో అన్ని వస్తువులు ఉన్నవని లిఖిత పూర్వకంగా వ్రాసి పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి పర్సును తీసుకుని వెళ్లాడు. తన పర్సుతో పాటు విలువైన వస్తువులను తనకు అప్పగించినిజాయితీ చాటుకున్న రైల్వే పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. -
అసెంబ్లీ స్థానాల పేర్లు తెలియకుంటే ఎలా?
ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం పటాన్చెరు రూరల్ : జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో కూడా తెలియకుండానే విద్యార్థులకు విద్యాబోధన ఎలా చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని ముత్తంగి పాఠశాల సముదాయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 16 పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు. జిల్లా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని ప్రశ్నించగా ఒక్క ఉపాధ్యాయులు కూడా సరైన సమాధానం చెప్పలేదు. ‘చర్చ’ అనే పదాన్ని బోర్డుపై రాయమంటే తప్పుగా రాశారు. విద్యార్థులకు ఒక్కసారి తప్పుడు పాఠాలు బోధిస్తే వారు కూడా అలాగే తయారవుతారన్నారు. విద్యార్థులకు చరిత్ర, కథలు చెప్పాలని సూచించారు. సొంత బిడ్డలుగా భావించి విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఒక్కరోజుకు ఒక్క మార్కు సంపాదించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతే 100 రోజుల్లో విద్యార్థులు ఉత్తములుగా మారతారన్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులు మారి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని డీఈఓ సూచించారు. -
పంతుళ్లూ..పైలమయో!
నిర్లక్ష్యంపై విద్యాశాఖ కొరడా ప్రభుత్వ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీ ఒకరి సస్పెన్షన్, ముగ్గురికి మెమోలు సిద్దిపేట జోన్: ‘‘ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయినా సంబంధిత టీచర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం.. అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనకాడబోం’’ రెండు నెలల క్రితం టీచర్లకు డీఈఓ జారీ చేసిన హెచ్చరిక. కట్ చేస్తే.. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీ పాఠశాలను శుక్రవారం డీఈఓ రాజేశ్వర్‌రావు అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధనలో విఫలమయ్యారనే కారణంతో ఇందిరానగర్ స్కూల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు మరో ముగ్గురికి మెమోలు జారీ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. శుక్రవారం సిద్దిపేటకు వచ్చిన డీఈఓ రాజేశ్వర్‌రావు ముందుగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని స్కూల్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని, వెనక భాగంలో ఉన్న పురాతన భవనాన్ని పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం బ్యాంక్ నిర్మాణం కోసం సంబంధిత పాఠశాల స్థలాన్ని, భవనాన్ని స్వాధీనం చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో సమగ్ర వివరాలు సేకరించారు. అనంతరం పదో తరగతి గదిని పరిశీలించి, విద్యార్థులను వివిధ పాఠ్యాంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి సంబంధిత పేపర్లను తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన పదో తరగతి త్రైమాసిక పరీక్ష ప్రశ్నాపత్రాలను, పాఠశాల విద్యార్థుల మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరానగర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్న డీఈఓ, పాఠశాల ఆవరణ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హెచ్ఎం వకులాదేవికి సూచించారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడు నిరంజన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో విద్యార్థుల ఫెయిల్ శాతం అధికంగా ఉందన్న కారణంతో అదే పాఠశాలకు చెందిన కొండల్‌రెడ్డి, శ్రీవిద్యలతో పాటు గైర్హాజరైన నీలం రెడ్డికి మెమోలు జారీ చేశారు. దీనికి బాధ్యులైన ఉపాధ్యాయుల రెండు ఇంక్రిమెంట్లలో కోత విధిస్తామని హెచ్చరించారు. మీరు మారండి.. విద్యార్థుల రాత మార్చండి... ప్రతి నెల వేల రూపాయల వేతనం పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాబోధనలోనూ మార్పు తెచ్చి విద్యార్థుల రాతను మార్చాలని డీఈఓ రాజేశ్వర్‌రావు సూచించారు. అందుకోసం ముందుగా ఉపాధ్యాయుల్లోనే మార్పు రావాలన్నారు. తనిఖీ నిర్వహించిన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతోప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం మరింత పెంచాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ముఖ్యంగా సీఎం జిల్లాలో విద్యా ఫలితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన వెంట ఉప విద్యాధికారి మోహన్, జిల్లా విద్యాశాఖ సిబ్బంది సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గురువుపైనే బరువు
మెదక్: విద్యార్థుల చదువు భారమంతా గురువులపైనే పడింది. విద్యార్థులకు చదవడం రాకుంటే టీచర్లపై సస్పెన్షన్ వేటు వేసేందుకు వెనకాడేది లేదని జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు ప్రకటించారు. పదో తరగతిలో రెండేళ్లుగా వస్తున్న చేదు ఫలితాలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. విద్యార్థుల శారీరక ఆరోగ్యంపైనే...మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న ఉద్దేశంతో కలెక్టర్ పాఠశాల స్థాయిలోనే జవహర్ బాల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేసి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఈఓ రాజేశ్వర్‌రావు, హెచ్ఎంలు, ఎంఈఓల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 502 ఉన్నత పాఠశాలలు ఉండగా, ఈ సారి పదో తరగతి పరీక్షలకు 42,035 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రెండేళ్లుగా జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే పరిస్థితి దారుణంగా ఉంది. 2012-13లో ఉమ్మడి రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో మెదక్ జిల్లా చివరగా 23వ స్థానానికి పడిపోయింది. 2013-14లో కాస్త మెరుగుపడినా 83.01 ఉత్తీర్ణత శాతంతో 21 స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా సరే పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు జిల్లా కలెక్టర్, డీఈఓ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. విద్యార్థులకు చదవడం రాకుంటే టీచర్లపై వేటే ప్రతి పాఠశాలలో విద్యార్థులంతా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో తప్పులు లేకుండా పాఠ్యాంశాలను చదవకుంటే సంబంధిత ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తామని డీఈఓ రాజేశ్వర్‌రావు హెచ్చరించారు. ఇందుకు సంబంధించి పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే ఆయన ఒక ప్రకటన చేశారు. నవంబర్ 14లోగా ఉపాధ్యాయులంతా విద్యార్థులకు బేసిక్స్‌తోపాటు తప్పులు లేకుండా చదవడం, రాయడం నేర్పాలని ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని అప్పట్లోనే ఆయన హెచ్చరించారు. ఈ మేరకు వాటిని అమలు పర్చడానికి జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ డిసెంబర్ 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలులోకి తీసుకురావాలని డీఈఓ రాజేశ్వర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు డిసెంబర్ 1 నుంచి 2015 మార్చి 7వ తేదీ వరకు ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు 8, 9 పీరియడ్లలో ఒక్కో సబ్జెక్ట్‌కు 11 రోజుల చొప్పున ప్రత్యేక పునశ్చరణ నిర్వహించాలని సూచించారు. గంట 20 నిమిషాల సమయంలో 15 నిమిషాలు చర్చకు, 30 నిమిషాలు విద్యార్థులను చదివించడానికి, 30 నిమిషాలు పరీక్ష నిర్వహించడానికి, 5 నిమిషాలు సూచనలు ఇవ్వడానికి వినియోగించుకోవాలని ఆదేశించారు. చదువులో వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని ఉపాధ్యాయులు వారి సామర్థ్యాలను మెరుగు పర్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. వారి వైఫల్యాలకు సంబంధిత ఉపాధ్యాయులే బాధ్యులని స్పష్టం చేశారు. జవహర్‌బాల ఆరోగ్య పథకంతో ఫలితాలు శారీరక ఆరోగ్యంపైనే మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న ఉద్దేశంతో పాఠశాలల్లో జవహర్ బాల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. రెండేళ్లుగా పాఠశాలల్లో ఈ పథకం సక్రమంగా కొనసాగడం లేదని, సుమారు 40 శాతం మంది విద్యార్థులకు ఆరోగ్య కార్డులు లేవన్న విషయాన్ని ఆయన గుర్తించారు. వెంటనే విద్యార్థులకు కార్డులు అందజేసి ప్రతి నెల క్రమం తప్పకుండా తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. -
ప్రైవేట్ స్కూల్ సీజ్
సంగారెడ్డి మున్సిపాలిటీ: సెలవు దినాల్లో పాఠశాల నిర్వహిస్తున్నట్లు సాక్షిలో ప్రచురితమైన వార్తపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు స్పందించారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని రిషి పబ్లిక్ స్కూల్ నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న డీఈఓ మండల విద్యాశాఖ అధికారిని పాఠశాలను సందర్శించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు రిషి పబ్లిక్ పాఠశాల నిబంధనలకు విరుద్దంగా పాఠశాల నిర్వహించడంతో సీజ్ చేశారు. అనంతరం పట్టణంలోని పయనీర్, బ్రిలియంట్, సాయిగ్రేస్, ఎంఎన్అర్ పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ సెలవు దినాల్లో పాఠశాలలు నడిపితే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. సెలవులిచ్చేందుకు సీఎం ఎవరు.. దసరా సెలవుల్లో పాఠశాల నిర్వహస్తున్న విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి అదేశాల మేరకు పట్టణంలోని రిషి పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాని సమీప బంధువు సెలవులు ప్రకటించడానికి మీరెవరు..?, తెలంగాణ వస్తే పాఠశాలలను మూసివేయాలా? అంటూ ఎంఈఓను నిలదీశారు. దీంతో ఎంఈఓ తాము నిబంధనల ప్రకారం 23 నుంచి వచ్చే నెల 7 వరకు సెలవులు ప్రకటించామని అందుకు విరుద్ధంగా మీరు తరగతులు ఎలా నిర్వహిస్తారని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. దీంతో ఆమె బంధువు సెలవుల్లో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదా..? ఎందుకు బంద్ చేయాలి..? అసలు సెలవులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవరు అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎంఈఓ పాఠశాలనుసీజ్ చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి: ఏబీవీపీ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్‌రెడ్డి డీఈఓ రాజేశ్వర్‌రావుకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 15 రోజులు సెలవులు ప్రకటిస్తే కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జహీరాబాద్, తూప్రాన్, ఇస్నాపూర్, సంగారెడ్డి తదితర ప్రాంతాలలో తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. -
ప్రాణం తీసిన కరెంట్‌షాక్
కమలాపూర్ : శంభునిపల్లికి చెందిన ఎండ్రాల రాజేశ్వర్‌రావు (57) అనే కౌలు రైతు మంగళవారం విద్యుదాఘాతంతో మరణించాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజేశ్వర్‌రావు కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అప్పులపాలై స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఎడ్ల వ్యాపారంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది వాగు ఒడ్డుకు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో పత్తి పంట వేయగా మిగతా నాలుగెకరాల్లో వరిపొలం వేయాలని నారు పోశాడు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నాటు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా కరెంటు పోయింది. కరెంటు మోటార్ వాగుకు బిగించగా పుట్‌వాల్వ్‌కు చెత్త తట్టుకుని రోజు నీళ్లు తక్కువగా పోస్తుందని చెత్త తీసేందుకని పుట్‌వాల్వ్ వద్దకు నీటిలోకి దిగాడు. ఇంతలోనే కరెంటు రాగా, ఆటోమేటిక్ స్టార్టర్ కావడంతో మోటార్ ఆన్ అయి కాలిపోయింది. షార్ట్‌సర్క్యూట్‌తో కిందిపైపుకు విద్యుత్ ప్రసారం కాగా, ఆ పైపును పట్టుకుని ఉన్న రాజేశ్వర్‌రావు విద్యుదుఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి వచ్చి విగతజీవిగా మారిన రాజేశ్వర్‌రావును చూసి విలపించారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్పాల్సింగ్ తెలిపారు. -
ముగ్గురు హెచ్ఎంల సస్పెన్షన్
సంగారెడ్డి మున్సిపాలిటీ : విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉన్నత అధికారులు కొరడా ఝలిపించారు. ఏకంగా ముగ్గురు ప్రధానోపాధ్యాయులను సస్పెండ్‌చేస్తూ శుక్రవారం విద్యాశాఖ ఆర్జేడీఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు తెలిపారు. సిద్దిపేటలోని నూతన ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జయచంద్రారెడ్డి విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని స్థానికులు ఫిర్యాదుచేయడంతో తాము విచారణ జరిపామన్నారు. ఈమేరకు నివేదికను ఆర్జేడీకి సమర్పించగా, శుక్రవారం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అలాగే జహీరాబాద్ మండలం మాందాపూర్ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలు బుజ్జమ్మ పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తదుపరి చర్యల కోసం ఆర్జేడీకి పంపగా, ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇక మునిపల్లి మండలం బుధేరా జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని ఫిర్యాదు అందడంతో జిల్లా విద్యాశాఖ తరఫున విచారణ జరిపి నోటీసులు జారీ చేయగా, ఆమె నోటీసులకు స్పందించకపోవడంతో ఆర్జేడీకి నివేదిక అందజేశామన్నారు. దీంతో ఆర్జేడీ మల్లేశ్వరిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. -
1300 టీచర్ పోస్టులు ఖాళీ
డీఈఓ రాజేశ్వర్‌రావు జగదేవ్‌పూర్: జిల్లాలో 1,300 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే వీటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన, మండలంలోని చేబర్తి, ఎర్రవల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అంతేకాకుండా జిల్లాలోని పలు పాఠశాలల్లో వంట గదులు, తాగునీటి సమస్య, ఉపాధ్యాయుల కొరతపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రస్తుతం 53 పాఠశాలల్లో తెలుగు పండితులు, 57 పాఠశాలలో ఉర్దూ టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో డిప్యుటేషన్ పద్ధతిపై టీచర్లను సర్దుబాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 26 ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఎంఈఓ సుగుణాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేబర్తి వాసులు తమ గ్రామంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డీఈఓను కోరారు. డీఈఓ వెంట ప్రధానోపాధ్యాయులు జ్యోతి, జయసింహారెడ్డి, ఉపాధ్యాయులు సురేందర్‌రెడ్డి, యాదగిరి, స్వాతి, కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ బాలచంద్రం, ఎర్రవల్లి సర్పంచ్ భాగ్య ఉన్నారు. -
త్వరలోనే టీఆర్ఎస్ చేరుతా: రాజేశ్వరరావు
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మీడియాకు తెలిపారు. కేసీఆర్ అభ్యర్థన మేరకే నిజామాబాద్ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ మద్దతిచ్చానని రాజేశ్వరరావు అన్నారు. కేసీఆర్ పకడ్బంధీ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందన్నారు. టీఆర్ఎస్ లో చేరి బంగారు తెలంగాణకు కృషి చేస్తానని రాజేశ్వరరావు తెలిపారు. నిజమాబాద్ లో ఎన్నికలో మేయర్ ఎంపికకు రాజేశ్వరరావు అనుకూలంగా ఓటు వేశారు. -
ప్రశాంతంగా డైట్‌సెట్
సంగారెడ్డి మున్సిపాలిటీ : జిలాలో ఆదివారం నిర్వహించిన డైట్‌సెట్ ప్రశాంతం గా ముగిసింది. జిల్లా వ్యా ప్తంగా 19,285 మందికిగాను 18,206 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్, డీఈఓ రాజేశ్వర్‌రావు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా డైట్‌సెట్ పరీక్ష నిర్వహణకు కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి, పటాన్చెరు, రాంచంద్రాపురం మండలాల్లోని 81 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని శ్రీతేజ జూని యర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఇన్చార్జి కలెక్టర్ శరత్ పరిశీలించారు. అనంతరం పరీక్ష కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమయానికంటే ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. డైట్‌సెట్ పరీక్ష సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు హోటళ్లు కిక్కిరిసి పోయాయి. డీఈఓ రాజేశ్వరరావు కంది కేశవరెడ్డి, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శాంతినగర్ సెయింట్ ఆంథోనీ హై స్కూల్, జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. తెలుగు మీడియంలో 18,593 మం దికి 17,536 మంది హాజరయ్యారు. ఉర్దూ మీడియంలో 695కు 670 మంది హాజరయ్యారు. పరీక్ష సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
జర్మనీ బాబు.. జెండా లేని శీను
ఒకరిని పౌరసత్వం కేసు వెంటాడుతోంది. వురొకరు ఏ పార్టీ జెండా పట్టుకోవాలే తెలియుక తికవుకపడుతున్నారు. వరుసగా రెండుసార్లు హోరాహోరీ తలపడ్డ ఈ పాత ప్రత్యర్థులిద్దరూ ఈసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వేవుులవాడ నియోజకవర్గంలో ఈ చిక్కువుుడి నెలకొంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నవునేని రమేష్‌బాబు జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అక్కడి ఉద్యోగం వదులుకొని స్వదేశానికి తిరిగొచ్చారు. తండ్రి సిహెచ్.రాజేశ్వర్‌రావు వారసత్వంగా రాజకీయూల్లోకి అడుగుపెట్టారు. వచ్చీ రాగానే 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యవుంలో భాగంగా ఏడాది వ్యవధిలోనే పదవికి రాజీనావూ చేసి టీఆర్ఎస్లో చేరారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వురోసారి గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆయునతో హోరాహోరీ తలపడ్డ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్. ఎంపీటీసీ సభ్యుడి నుంచి ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా ఎదిగి అంచెలంచెలుగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలిచి రెండుసార్లు రమేష్‌బాబుకు గట్టి పోటీ ఇచ్చారు. 2009లో కేవలం 1821 ఓట్లతో ఓడిపోయూరు. ఫలితాలు వెలువడ్డాక జర్మనీ నుంచి తిరిగొచ్చిన రమేష్‌బాబుకు జారీ చేసిన భారత పౌరసత్వం చట్ట ప్రకారం చెల్లదని, ఆయున ఎన్నికను రద్దు చేయూలని ఆది శ్రీనివాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేళ్ల విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది. రమేష్‌బాబు ఎమ్మెల్యే పదవితో పాటు భారత పౌరసత్యం రద్దు చేసి, ఓటర్ల జాబితాలో పేరు తొలగించాలని ఎనిమిది నెలల కిందట హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు స్టే జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యేలకు ఉండే ఓటుహక్కు వూత్రం ఆయనకు లేదని సూచించింది. అందుకే గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలకు రమేష్‌బాబు దూరంగా ఉన్నారు. అక్కడ ఓటు వేసే హక్కు కోల్పోయూరు. దీంతో ఈసారి సాధారణ ఎన్నికల్లోనే ఆయున పోటీ చేస్తారా.. లేదా అనేది చర్చనీయూంశంగా వూరింది. కానీ... తానే పోటీలో ఉంటానని రమేష్‌బాబు ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయుకుల సవూవేశాలన్నింటా బహిరంగంగా ప్రకటించారు. అయితే.. కోర్టు కేసు ఏ దశలోనైనా ప్రతిబంధకంగా వూరుతుందా? అనే సందేహం గులాబీ శ్రేణులను వెంటాడుతోంది. ఆది శ్రీనివాస్ వురో తీరుగా చిక్కుల్లో పడ్డారు. గతంలో రెండుసార్లు అధికార పార్టీ తరఫున పోటీలో ఉన్న ఆయన ఈసారి పార్టీల్లో బెర్త్ వెతుక్కుంటున్నారు. వుహానేత వైఎస్సార్ వురణానంతరం కాంగ్రెస్‌ను వదిలి ఆయున వైఎస్సార్సీపీలో చేరారు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారని, బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. రెండుచోట్ల సానుకూల స్వాగతం లభించకపోవటంతో వెనుకడుగు వేశారు. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రచారంలో నివుగ్నవుయ్యూరు. పొత్తుల సమీకరణాల్లో ఏదో ఒక పార్టీ తరఫున టిక్కెట్టు తనకు లభిస్తుందని, అప్పటి దాకా వేచి చూసే ధోరణి ఎంచుకున్నారు. దీంతో ఆయున ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ జెండా పట్టుకుంటారనేది ప్రశ్నార్థకంగా వూరింది. ప్రధాన పార్టీలకు చెందిన పాత ప్రత్యర్థులు ఇద్దరూ ఎవరికివారుగా తంటాలు పడుతున్న తీరు ఈ నియోజకవర్గంలో రక్తి కట్టిస్తోంది. -
మేడారంలో కలెక్టర్ దంపతులు
కరీంనగర్, న్యూస్‌లైన్ : కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఆయన సతీమణి విజయలక్ష్మి గురువారం మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రాజేశ్వర్‌రావు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికి సత్కరించారు. మేడారం జాతరకు జిల్లా నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, మంథని అర్డీఓ అయేషాఖాన్ ఉన్నారు. జాతర ఏర్పాట్లు పరిశీలన జిల్లా నుంచి మంథని, కాటారం మీదుగా మేడారం వెళ్లే భక్తులకు ఏర్పాట్లను కలెక్టర్ దారిపొడవునా పరిశీలించారు. మంథని, కాటారం, యామన్‌పల్లి, రేగులగూడెం, బోర్లగూడెం, కాలువపల్లి మీదుగా ఆయన మేడారం చేరుకున్నారు. మేడారంలో పారిశుధ్య పనుల కోసం 150 మంది సిబ్బందిని పంపించాలని డీపీవో కుమారస్వామిని ఆదేశించారు. దారిపొడవునా అన్ని గ్రామాల్లో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. మహాముత్తారం మండలం సింగారంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. -
కొత్త పాఠ్యపుస్తకాలు, సీసీఈపై టీచర్లకు టెలీకాన్ఫరెన్స్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 2014-15 విద్యాసంవత్సరంలో అమలులోకి రానున్న కొత్త పాఠ్యపుస్తకాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)పై ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డెరైక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించినట్లు డీఈఓ డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణీమోహన్, ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డిలతో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. డైట్ ప్రిన్సిపాల్ బీ విజయభాస్కర్, ఇ.సాల్మన్, షేక్ చాంద్‌బేగం, వి.రామ్మోహన్, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారు. సమావేశం వివరాలను డీఈఓ వెల్లడించారు. ఉపాధ్యాయులు ఈ నెల 20 నుంచి 30 వరకు ఆయా మండల కేంద్రాల్లో టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలి. షెడ్యూలు ఇదీ... ఈ నెల 20న తెలుగు, 21న ఇంగ్లిష్, 22న గణితం, 23న ఫిజికల్ సైన్సు, 24న సాంఘికశాస్త్రం, 25న బయోలాజికల్ సైన్సు, 27న హిందీ ఆయా సబ్జెక్టుల హైస్కూలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే స్కూలు అసిస్టెంట్లు, కొత్త టెస్ట్‌బుక్స్, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)పై నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని డీఈఓ కోరారు. ఈ నెల 28న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 29న ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 50 శాతం మంది 30న, మిగిలిన 50 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలు మూతపడకుండా విధిగా హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఉదయం 9 గంటలకు సంబంధిత టెలీకాన్ఫరెన్స్ ప్రదేశాన్ని చేరుకోవాలని డీఈఓ కోరారు. టెలీకాన్ఫరెన్స్ కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్ వసతి కల్పించాల్సిందిగా ఎంఈఓలను ఆదేశించారు. -
మధ్యాహ్న భోజన చెల్లింపులన్నీ ఆన్లైన్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బడ్జెట్ కంటిజెన్సీ నిధులు వివరాలన్నీ మండల విద్యాధికారులకు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తామని డీఈఓ ఏ రాజేశ్వరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో నిర్వహించిన ఎంఈఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖజానా కార్యాలయాలకు పంపించిన బడ్జెట్ కేటాయింపు కాపీలను ఎంఈఓలకు మెయిల్లో చేస్తామన్నారు. వీటిని పరిశీలించుకొని తమకు కేటాయించిన బడ్జెట్ మేరకు బిల్లులు పెట్టుకోవాలని ఎంఈఓలకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎంఈఓలు తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలల సందర్శన నివేదికలను ప్రతి బుధవారం ఆన్లైన్లో నమోదు చేసి సమర్పించాలని సూచించారు. బడిబయటి పిల్లలందరినీ (ఓఎన్సిసీ) పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 14 ఏళ్లు దాటిన వారిని ఓపెన్ స్కూలు సొసైటీలో చేర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాల, బాలికలందరికీ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సరస్వతి తెలిపారు. గతంలో 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు మంజూరు చేసేవారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాల, బాలికలకూ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. బాలురకు నెలకు రూ.100, బాలికలకు నెలకు రూ.150 ఉపకార వేతనంగా చెల్లిస్తామన్నారు. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా నంబర్‌ను మీ సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలని సూచించారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఆధార్ నంబర్‌నూ నమోదు చేయించుకోవాలన్నారు. వీరికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌ల మొత్తాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులు జీరో బ్యాలెన్సుతో బ్యాంకులో ఖాతాలు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. సీజనల్ హాస్టళ్లకు ప్రతిపాదనలు తల్లిదండ్రులెవరైనా పనుల కోసం వలస వెళితే వారి పిల్లల కోసం సీజనల్ హాస్టళ్లను ప్రారంభించనున్నట్లు రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కే రామశేషు తెలిపారు. 25 నుంచి 50 మంది వరకు పిల్లలుంటే అక్కడ సీజనల్ హాస్టల్ ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను కోరారు. దొనకొండ, పెదచెర్లోపల్లి మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు వెంటనే యూనిఫాం పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లేని పాఠశాలలకు గతేడాది విడుదలైన నిధులను వెంటనే ఆర్వీఎం ఖాతాకు జమ చేయాలని ఆర్వీఎం ఎఫ్ఎఓ యెహోషువా సూచించారు. అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభించాలని ఆ విభాగం ఇన్చార్జి సీహెచ్ వాసంతి కోరారు. ఆరు లక్షల మంది నిరక్షరాస్యులు జిల్లాలో ఇప్పటికీ ఆరు లక్షల మంది నిరక్షరాస్యులున్నట్లు వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు సీ వీరభద్రరావు తెలిపారు. వీరిలో అధికంగా మహిళలే ఉన్నారన్నారు. వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని డీఆర్డీఏ, డ్వామాలు స్వీకరించాని కోరారు. జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. నిధులెప్పుడిస్తారు ? రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం నుంచి మండల విద్యాధికారులకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంపై ఎంఈఓలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలకు రూ.1400 విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. ఇంత వరకు ఆ నిధులు విడుదల చేయలేదు. విద్యా పక్షోత్సవాలకు వినియోగించిన వాహనాలకు చెల్లించాల్సిన రూ.25 వేలు ఇప్పటికీ రాలేదు. మండలాల్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు నిధులు పూర్తిగా చెల్లించ లేదని పలువురు ఎంఈఓలు తెలిపారు. సమావేశంలో ఉపవిద్యాధికారులు బీ విజయభాస్కర్, వీ రామ్మోహనరావు, కే వెంకట్రావు, షేక్ చాంద్‌బేగం, అసిస్టెంట్ డెరైక్టర్లు డీవీ రామరాజు, రాజీవ్ విద్యామిషన్ సెక్టోరల్ అధికారులు ఎన్ అంజిరెడ్డి, జాన్‌వెస్లీ, ఎంఈఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.