
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.
దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు.
గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత
దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు.
ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్‌జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment