Reserve Bank Deputy Governor
-
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
బ్యాంకుల స్థానాన్ని ఫిన్‌టెక్‌లు భర్తీ చేయలేవు
ముంబై: బ్యాంకుల స్థానాన్ని ఫిన్‌టెక్ సంస్థలు భర్తీ చేస్తాయన్నది అపోహ మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. అయితే, సాంకేతిక మార్పులను సత్వరం అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘బ్యాంకులు కొనసాగుతాయి. ఫిన్‌టెక్ సంస్థలు వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయన్నది అపోహ మాత్రమే. అయితే, బ్యాంకింగ్ స్వరూపం చాలా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీల పురోగతితో వస్తున్న మార్పులను బ్యాంకులు కూడా వేగంగా అందిపుచ్చుకోవాలి‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రవి శంకర్ చెప్పారు. ఏకీకృత చెల్లింపుల విధానానికి (యూపీఐ) సంబంధించి సింహ భాగం వాటా నాన్ బ్యాంకింగ్ సంస్థలదే ఉంటోందని, బ్యాంకులు ముందు నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల అవకాశాలను అందుకోలేకపోయాయని ఆయన తెలిపారు. బ్యాంకింగ్ ప్రపంచంలోను, బైట వస్తున్న మార్పులకు అనుగుణంగా తమను తాము మల్చుకోవడానికి పెద్ద సంస్థలు కూడా ఇష్టపడకపోవడం ఆర్బీఐని ఆశ్చర్యపర్చిందని వ్యాఖ్యానించారు. -
డిజిటల్ కరెన్సీపై ఆచితూచి నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రిస్కీ సాధనాలైన క్రిప్టోకరెన్సీలను కట్టడి చేసే విధంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకూ అధికారికంగా ఎక్కడా డిజిటల్ కరెన్సీ వినియోగంలో లేనందున దాని ప్రభావాలను ముందుగా అంచనా వేయగలిగే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర సెంట్రల్ బ్యాంకులు కూడా దీని విషయంలో క్రమానుగతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీబీడీసీలతో ఒనగూరే ప్రయోజనాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల డిమాండ్‌పై, తత్ఫలితంగా రుణ వితరణ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని శంకర్ అభిప్రాయపడ్డారు. -
మాంద్యంలో దేశ జీడీపీ: ఆర్బీఐ
న్యూఢిల్లీ: సాంకేతికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడినట్లు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా పేర్కొంది. నౌక్యాస్ట్ పేరుతో ఆర్బీఐ తొలిసారి విడుదల చేసిన నివేదిక.. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.6 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై- సెప్టెంబర్)లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ పథం పట్టడంతో మాంద్యంలోకి జారినట్లేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర అధ్యక్షతన ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. తొలి త్రైమాసికం(ఏప్రిల్- జూన్)లోనూ జీడీపీ మరింత అధికంగా 24 శాతం వెనకడుగు వేసిన విషయం విదితమే. వరుసగా రెండు త్రైమాసికాలలో ఆర్థిక వ్యవస్థ క్షీణతను నమోదు చేస్తే.. సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లుగా ఆర్థికవేత్తలు భావిస్తారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశ జీడీపీ రెసిషన్‌లోకి ప్రవేశించిందని నౌక్యాస్ట్ తెలియజేసింది. దేశ చరిత్రలో జీడీజీ మాంద్య పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారికావడం గమనార్హం! 27న గణాంకాలు ఈ నెల 27న ప్రభుత్వం అధికారిక గణాంకాలు ప్రకటించనుంది. కాగా.. అమ్మకాలు తగ్గినప్పటికీ కంపెనీలు వ్యయాలలో కోత విధించడం, తద్వారా నిర్వహణ లాభాలను పెంచుకోవడం వంటి అంశాలను ఆర్బీఐ ఆర్థికవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. వాహన అమ్మకాలు, బ్యాంకింగ్ లిక్విడిటీ తదితరాలను సైతం మదింపు చేశారు. అక్టోబర్‌లో ఆర్థిక రివకరీని ఇవి సంకేతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరిస్థితులు కొనసాగితే.. మూడో త్రైమాసికం(అక్టోబర్- డిసెంబర్)లో ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధికి దన్నుగా సరళ పరపతి విధానాలను కొనసాగించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత నెలలో పేర్కొన్నారు. అయితే ధరల ఒత్తిడి, ద్రవ్యోల్బణ అంచనాలు వంటివి పాలసీ నిర్ణయాలకు ఆటంకాలను సృష్టిస్తున్నట్లు ఆర్బీఐ ఆర్థికవేత్తలు తెలియజేశారు. సెకండ్ వేవ్‌లో భాగంగా ఇటీవల పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వృద్ధికి విఘాతం కలిగించే అవకాశమున్నట్లు వివరించారు. అటు కార్పొరేషన్లు, ఇటు కుటుంబాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ఇది ఫైనాన్షియల్ రిస్కులను పెంచే వీలున్నదని తెలియజేశారు. ఫలితంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదురవుతున్నట్లు వివరించారు. -
బ్యాంకుల ఎన్పీఏలు ఆందోళనకరం
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ)పై రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని కనిష్టస్థాయికి తగ్గించడానికి బ్యాంకులు తమ అంతర్గత రుణ మదింపు వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. గతేడాది మూడో త్రైమాసికంలో కంటే నాలుగో క్వార్టర్లో మొండి బకాయిల పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన శనివారం న్యూఢిల్లీలో అసోచామ్ ఏర్పాటు చేసిన సదస్సులో అన్నారు. బ్యాంకుల మొండి బకాయిలన్నీ మొత్తం రుణాల్లో 4.4%గా ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు రంగంలోని బ్యాంకులతో పోల్చితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల పరిమాణం మరింత ఆందోళనకరంగా మారుతున్నట్లు తెలిపారు. 2013 సెప్టెంబర్ ముగిసే నాటికి ఈ పరిమాణం రూ.2.03 లక్షల కోట్లకు చేరింది.