బ్యాంకుల ఎన్‌పీఏలు ఆందోళనకరం
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ)పై రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని కనిష్టస్థాయికి తగ్గించడానికి బ్యాంకులు తమ అంతర్గత రుణ మదింపు వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. గతేడాది మూడో త్రైమాసికంలో కంటే నాలుగో క్వార్టర్లో మొండి బకాయిల పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన శనివారం న్యూఢిల్లీలో అసోచామ్ ఏర్పాటు చేసిన సదస్సులో అన్నారు. బ్యాంకుల మొండి బకాయిలన్నీ మొత్తం రుణాల్లో 4.4%గా ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు రంగంలోని బ్యాంకులతో పోల్చితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల పరిమాణం మరింత ఆందోళనకరంగా మారుతున్నట్లు తెలిపారు. 2013 సెప్టెంబర్ ముగిసే నాటికి ఈ పరిమాణం రూ.2.03 లక్షల కోట్లకు చేరింది.