R. Gandhi
-
డిజిటల్లో తొందరపాటు వద్దు
► ముందుగా వాటిని పూర్తిస్థాయిలో పరీక్షించాలి ► ఆ తర్వాతే యూజర్లకి అందుబాటులోకి తేవాలి ► లేదంటే డబ్బుల భద్రతకు ముప్పు వాటిల్లొచ్చు ► నగదు ఇచ్చే లాభాల్ని వేటితోనూ భర్తీ చేయలేం ► క్యాష్ అనేది వాస్తవం.. అది కొనసాగుతుంది ► కరెన్సీ సరఫరా తగ్గిస్తే అసలుకే ముప్పు ► ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ దేశంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్ని అమల్లోకి తేవటంలో తొందరపాటు వద్దని రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నరు ఆర్.గాంధీ హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించటమే లక్ష్యంగా ఈ డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్ని తెస్తున్నారని, కాకపోతే ఈ విషయంలో ఆచితూచి అడుగులేయాల్సి ఉందని చెప్పారాయన. లేని పక్షంలో భద్రత పరమైన ప్రమాదాలు తలెత్తే అవకాశాలున్నట్లు స్పష్టం చేశారు. ‘కుప్పలు తెప్పలుగా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలు అమల్లోకి వస్తున్నాయి. వాటిని వినియోగదారులకు అందించే ముందు పూర్తి స్థాయిలో పరీక్షించాలి. లేనిపక్షంలో భద్రతపరమైన సమస్యలు తలెత్తుతాయి’’ అని బ్లూమ్‌బర్గ్ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. క్యాష్ అనేది వాస్తవమనీ అది కొనసాగుతుందని అన్నారు. కరెన్సీ సరఫరా తగ్గిస్తే అసలుకే ముప్పని పేర్కొన్నారు. నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని తర్వాత డిజిటల్ లావాదేవీలను పెంచడానికి పలు డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. వీటి ద్వారా కొంతైనా నగదు వాడకం తగ్గుతుందని ప్రభుత్వపు అంచనా. వేగం కాదు.. భద్రతే ముఖ్యం.. కరెన్సీ, పేమెంట్ సిస్టమ్స్ వంటి పలు విభాగాల్లో మంచి ప్రావీణ్యం కలిగిన గాంధీ... కొత్త పేమెంట్ ఆప్షన్స్ ఆవిష్కరణల్లో తొందరపాటు సరికాదని హెచ్చరించారు. ‘ఒక పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడానికి చాలా పరీక్షలు చేయాలి. అంతా బాగుందనుకుంటేనే దాన్ని అందుబాటులోకి తేవాలి. తొందరపడొద్దు’ అని పేర్కొన్నారు. నగదు వల్ల కలిగే ప్రయోజనాలను అంత సులభంగా ఇతర సాధనాలతో భర్తీ చేయలేమన్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు వారంతటవారే కాగితపు కరెన్సీకి దూరంగా వెళ్తారని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ చాలానే ఉన్నాయ్.. కేంద్ర ప్రభుత్వం నుంచి డీమోనిటైజేషన్ను ప్రకటన వెలువడిన వెంటనే బాగా లాభపడంది మాత్రం పేటీఎం వంటి ప్రైవేట్ వాలెట్ సంస్థలు. అటు తర్వాత కేంద్రం కూడా సొంత డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్లో మోదీ భీమ్ యాప్‌ను ఆవిష్కరించారు. ఇది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక ఫిబ్రవరిలో క్యూఆర్ కోడ్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ భారత్క్యూఆర్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అలాగే బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ పేమెంట్ సిస్టమ్‌ను ‘ఆధార్ పే’ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మోదీ దీన్ని శుక్రవారం ఆవిష్కరించనున్నారు. వీటితోపాటు బ్యాంకులకు కూడా సొంత డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. నాన్ బ్యాంక్ ప్రొవైడర్లు వాలెట్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. మోదీ శుక్రవారం ప్రారంభించనున్న ఆధార్ పే గురించి గాంధీ మాట్లాడుతూ.. ఆధార్‌ను చెల్లింపుల కోసం ఉపయోగించడంలో తప్పులేదన్నారు. అయితే ఆధార్ డేటాబేస్, పేమెంట్ సిస్టమ్ మధ్య ఉన్న దూరంపైనే ఆందోళన ఉందన్నారు. ‘ఒక వ్యక్తిని ఆధార్ నెంబర్, బయోమెట్రిక్స్ ద్వారా గుర్తుపట్టొచ్చు. అది ఒక సిస్టమ్. అలాగే పేమెంట్ అనేది వేరొక సిస్టమ్. కానీ ఆ రెండు ఒకేసారి సమన్వయంతో పనిచేయాలి. అవి రెండు ఒకే సిస్టమ్‌లో లేవు. ఇదో బలహీతన’ అని వివరించారు. -
‘చెల్లింపు’ లైసెన్స్‌లు టిక్ పెట్టి ఇచ్చేవి కావు: గాంధీ
ముంబై: చెల్లింపుల (పేమెంట్) సేవలకు లైసెన్స్‌లు అన్నవి టిక్ పెట్టి ఇచ్చే తరహావి కావని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ అన్నారు. ఆయా సంస్థల చేతికి డబ్బులు అప్పగించడం కనుక లైసెన్స్‌ల జారీకి తగిన, నిర్దేశిత ప్రమాణాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ముంబైలో భారత్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా గాంధీ మాట్లాడారు. ‘‘చెల్లింపుల రంగాన్ని లైసెన్స్‌ల ప్రక్రియ నుంచి మినహాయించాలని, అర్హతలు ఉన్న వాటిని కార్యకలాపాల నిర్వహణకు అనుమతించాలన్న సూచన ఉంది. కానీ, ఈ ఆలోచనతో మేము విభేదిస్తున్నాం. అలా ఉచిత ప్రవేశం అన్నది చెల్లింపుల రంగానికి సముచితం కాదు. ఎందుకంటే చెల్లింపుల సేవలు అందించే సంస్థల చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక తగిన, నిర్దేశిత ప్రమాణాలు అన్నవి చాలా అవసరం. టిక్ చేసి ఉచితంగా అనుమతించే విధానం ఈ రంగానికి సరైనది కాదు. ఇలా చేస్తే మొత్తం వ్యవస్థకే ప్రమాదం తలెత్తుతుంది’’ అని గాంధీ వివరించారు. చెల్లింపుల సేవల విషయంలో బ్యాంకింగేతర సంస్థల పట్ల వివక్ష ఉందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేశారు. -
బ్యాంకుల ఎన్పీఏలు ఆందోళనకరం
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ)పై రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని కనిష్టస్థాయికి తగ్గించడానికి బ్యాంకులు తమ అంతర్గత రుణ మదింపు వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. గతేడాది మూడో త్రైమాసికంలో కంటే నాలుగో క్వార్టర్లో మొండి బకాయిల పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన శనివారం న్యూఢిల్లీలో అసోచామ్ ఏర్పాటు చేసిన సదస్సులో అన్నారు. బ్యాంకుల మొండి బకాయిలన్నీ మొత్తం రుణాల్లో 4.4%గా ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు రంగంలోని బ్యాంకులతో పోల్చితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల పరిమాణం మరింత ఆందోళనకరంగా మారుతున్నట్లు తెలిపారు. 2013 సెప్టెంబర్ ముగిసే నాటికి ఈ పరిమాణం రూ.2.03 లక్షల కోట్లకు చేరింది. -
ఎన్పీఏ నిబంధనలు మార్చలేం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్పీఏ నిర్వచనం, నిబంధనలు మార్చలేమని ఆర్బీఐ స్పష్టం చేసింది. తీసుకున్న రుణంపై 90 రోజుల పాటు ఎటువంటి వడ్డీ, అసలు చెల్లింపులు లేకపోతే ఎన్పీఏగా పరిగణిస్తున్నామని, దీని నుంచి మధ్య, చిన్న తరహా పరిశ్రమలను మినహాయించలేమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షోభం, విద్యుత్ సంక్షోభం వల్ల ఎంఎస్ఎంఈ రంగం వ్యాపారాన్ని నష్టపోయిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర కంపెనీలకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని ఫ్యాఫ్సీ ఆర్బీఐని కోరింది. దీనిపై గాంధీ స్పందిస్తూ వ్యాపారాలు దెబ్బతినడానికి కారణమైన ప్రభుత్వం నుంచి రాయితీలు కోరడం తప్ప వేరే మార్గం లేదన్నారు. వ్యాపార అవకాశాలుండి, ప్రత్యేక పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పరిశ్రమల రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నామని, ఇది కూడా ఆర్థికంగా పటిష్టంగా ఉంటేనే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ‘నో యువర్ కస్టమర్’ అనే అంశంపై ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సుకు గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ బాగు కోసం వడ్డీపై రాయితీలను, రుణాలు రీ-షెడ్యూల్ చేస్తే పరిశ్రమలు బాగుంటాయేమో కాని, బ్యాంకులు దివాళా తీయడం తథ్యం అన్నారు. అటు డిపాజిట్‌దారులు, ఇటు రుణాలు ఇచ్చిన వారి ప్రయోజనాలను కాపాడుకంటూ వెళ్లడమే బ్యాంకుల ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కేవైసీ నిబంధనలు అమల్లో ఉన్నాయని, నల్లధనం, హవాల మార్గంలో నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఒకవేళ కేవైసీ నిబంధనలకు కావల్సిన పత్రాలు లేకపోయినా అకౌంట్స్‌ను తెరవడానికి అనుమతిస్తున్నామని, కాని వీటి లావాదేవీలపై పరిమితులుంటాయన్నారు. ఇలా ప్రారంభించిన ఖాతాలు ఒక ఏడాదిలోగా కేవైసీ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
లెసైన్సు రాకున్నా బ్యాంకుల్లో వాటాలు కొనొచ్చు
ముంబై: బ్యాంకింగ్ లెసైన్సు దక్కని సంస్థలు..ఇతర బ్యాంకుల్లో వాటాలు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనంత మాత్రాన ఆయా కంపెనీలు.. వేరే బ్యాంకుల్లో వాటాలు కొనుగోలు చేయరాదంటూ ఏమీ లేదని కొత్తగా నియమితులైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పటికీ.. బ్యాంకులో సదరు సంస్థ వాటాదారుగా చేరాలనుకుంటే, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామనిఆయన వివరించారు. ప్రైవేట్ రంగ బ్యాంక్ యస్ బ్యాంక్‌లో ఎల్అండ్టీ ఫైనాన్స్ గణనీయంగా వాటాలు పెంచుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏదైనా బ్యాంకులో ఏదైనా కంపెనీ 5 శాతం పైగా వాటాలను కొనాలనుకుంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గాంధీ చెప్పారు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి తాము నిర్ణయం తీసుకుంటామని, ఏ ఒక్క కంపెనీకో అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో వ్యవహరించమని ఆయన తెలిపారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్సును దక్కించుకోవడంలో విఫలమైన ఎల్అండ్టీ ఫైనాన్స్.. యస్‌బ్యాంకులో వాటాలు కొనాలని యోచిస్తోంది. ఇది దొడ్డిదారిన బ్యాంకింగ్‌లోకి ప్రవేశించడమే అవుతుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.