మాంద్యంలో దేశ జీడీపీ: ఆర్‌బీఐ | Technically GDP in recession: RBI report | Sakshi
Sakshi News home page

మాంద్యంలో దేశ జీడీపీ: ఆర్‌బీఐ

Published Thu, Nov 12 2020 11:52 AM | Last Updated on Thu, Nov 12 2020 1:15 PM

Technically GDP in recession: RBI report - Sakshi

న్యూఢిల్లీ: సాంకేతికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) తాజాగా పేర్కొంది. నౌక్యాస్ట్‌ పేరుతో ఆర్‌బీఐ తొలిసారి విడుదల చేసిన నివేదిక.. సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.6 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై- సెప్టెంబర్‌)లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ పథం పట్టడంతో మాంద్యంలోకి జారినట్లేనని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర అధ్యక్షతన ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. తొలి త్రైమాసికం(ఏప్రిల్‌- జూన్‌)లోనూ జీడీపీ మరింత అధికంగా 24 శాతం వెనకడుగు వేసిన విషయం విదితమే. వరుసగా రెండు త్రైమాసికాలలో ఆర్థిక వ్యవస్థ క్షీణతను నమోదు చేస్తే.. సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లుగా ఆర్థికవేత్తలు భావిస్తారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశ జీడీపీ రెసిషన్‌లోకి ప్రవేశించిందని నౌక్యాస్ట్‌ తెలియజేసింది. దేశ చరిత్రలో జీడీజీ మాంద్య పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారికావడం గమనార్హం!

27న గణాంకాలు
ఈ నెల 27న ప్రభుత్వం అధికారిక గణాంకాలు ప్రకటించనుంది. కాగా.. అమ్మకాలు తగ్గినప్పటికీ కంపెనీలు వ్యయాలలో కోత విధించడం, తద్వారా నిర్వహణ లాభాలను పెంచుకోవడం వంటి అంశాలను ఆర్‌బీఐ ఆర్థికవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. వాహన అమ్మకాలు, బ్యాంకింగ్‌ లిక్విడిటీ తదితరాలను సైతం మదింపు చేశారు. అక్టోబర్‌లో ఆర్థిక రివకరీని ఇవి సంకేతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరిస్థితులు కొనసాగితే.. మూడో త్రైమాసికం(అక్టోబర్‌- డిసెంబర్‌)లో ఆర్థిక వ‍్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధికి దన్నుగా సరళ పరపతి విధానాలను కొనసాగించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గత నెలలో పేర్కొన్నారు. అయితే ధరల ఒత్తిడి, ద్రవ్యోల్బణ అంచనాలు వంటివి పాలసీ నిర్ణయాలకు ఆటంకాలను సృష్టిస్తున్నట్లు ఆర్‌బీఐ ఆర్థికవేత్తలు తెలియజేశారు. సెకండ్‌ వేవ్‌లో భాగంగా ఇటీవల పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ వృద్ధికి విఘాతం కలిగించే అవకాశమున్నట్లు వివరించారు. అటు కార్పొరేషన్లు, ఇటు కుటుంబాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ఇది ఫైనాన్షియల్‌ రిస్కులను పెంచే వీలున్నదని తెలియజేశారు. ఫలితంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదురవుతున్నట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement