Environmental Protection
-
వాడీవేడిగా ‘కాప్’ సదస్సు
బాకు/న్యూఢిల్లీ: భూతాపంలో పెరుగుదలను కట్టుదిట్టంచేసి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచదేశాలు ఒక్కతాటిమీదకొచ్చే ఐక్యరాజ్యసమితి చర్చావేదిక ‘కాప్’సదస్సు సోమవారం అజర్బైజాన్ దేశంలో ఆరంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా నిధులు సమీకరించడం, వెచ్చించడంసహా గత ఉమ్మడి కార్యాచరణ పటిష్ట అమలుపై సభ్యదేశాల మధ్య నెలకొన్న స్పర్థ సమసిపోవాలని ఆతిథ్య అజర్బైజాన్ దేశం ఈ సందర్భంగా కోరింది. నవంబర్ 22వ తేదీదాకా జరిగే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 29వ సమావేశాలు అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో సోమవారం ప్రారంభంకాగా సభ్యదేశాల అగ్రనేతలు, ప్రతినిధి బృందాలు, పెద్దసంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. శిలాజఇంధనాల అతివినియోగం దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్న బాధిత గ్లోబల్ సౌత్ వర్ధమాన దేశాలకు కాలుష్యకారక సంపన్న దేశాలు రుణాలకు బదులు అధిక గ్రాంట్లు(నిధులు) ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణమార్పుల విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సీమన్ స్టియెల్ ప్రారంభోపన్యాసం చేశారు.‘‘అత్యధిక కర్భన ఉద్గారాలను వెదజల్లుతున్న దేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోతే భారీమూల్యం చెల్లించుకోకతప్పదు. సరకు రవాణా గొలుసులు తెగిపోకుండానే కాలుష్యాన్ని తగ్గిస్తూ వస్తూత్పత్తిని కొనసాగించే సమర్థ చర్యల అమలుకు దేశాలు కంకణబద్దంకావాలి. లేదంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థ కునారిల్లుతుంది. వాతావరణ పరిరక్షణకు నిధుల సమీకరణకు నవ్య మార్గాలను చూపించండి. ఇది ప్రతి ఒక్కదేశం బాధ్యత’’అని చెప్పారు. ఏమిటీ కాప్?వాతావరణాన్ని కాపాడేందుకు ప్రపంచదేశాలు ఒకచోట చేరి చర్చించే అంతర్జాతీయ కూటమి వేదికే కాప్. ఐరాస వాతావరణ మార్పు కూటమి(యూఎన్ఎఫ్సీసీసీ) కార్యనిర్వాహక విభాగాన్నే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్)గా పిలుస్తారు. వాతావరణ మార్పు ఒప్పందం అమలు, భవిష్యత్ కార్యాచరణ, కాలుష్యాల కట్టడి, శిలాస ఇంథనాల వాడకాన్ని కనిష్టానికి దించడం, వాతావరణమార్పుల దు్రష్పభావాల బారినపడిన పేదదేశాలకు నిధులు ఇచ్చేందుకు సంపన్న, కాలుష్యకారక దేశాలను ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను కాప్ చూస్తుంది. అయితే భారీ నిధులిస్తామంటూ సమావేశాలప్పుడు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్న సంపన్న దేశాలు తర్వాత నిధులివ్వకుండా ముఖంచాటేస్తున్నాయి. దీంతో సంపన్న దేశాల సంయుక్త ప్రకటనలు కార్యాచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమవుతున్నాయి. పారిశ్రామికయుగం మొదలుకాకముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని కాప్ కోరుకుంటోంది. కానీ అది ఈఏడాది ఏకంగా 3 డిగ్రీ సెల్సియస్ దాటి రాబోయే అతివృష్టి, అనావృష్టి, తుపాన్లు, వరదలు, కరువులు వంటి అనూహ్య వాతావరణ పరిస్థితులను సర్వసాధారణం చేసేస్తూ భావి తరాలకు భవిష్యత్తేలేకుండా చేస్తోంది. దారుణ దిశలో పయనిస్తున్నాం: కాప్ అధ్యక్షుడు కాప్29 అధ్యక్షుడు ముఖ్తార్ బాబాయేవ్ మాట్లాడారు. ‘‘మానవ కార్యకలాపాలు, అధికంగా శిలాజ ఇంధనాల వినియోగంతో భూతాపోన్నతి ఏటా 3 డిగ్రీసెల్సియస్ అధికమవుతోంది. ఈ పెడపోకడ ఇలాగే కొనసాగితే వందల కోట్ల ప్రజానీకం దారుణకష్టాల కడలిలో కొట్టుకుపోకతప్పదు. నూతన సమ్మిళిత లక్ష్యం(న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్–ఎన్సీక్యూజీ)ని సాధించాలంటే 2009లో ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులివ్వాలన్న కాలంచెల్లిన నిధుల లక్ష్యాన్ని సవరించుకోవాల్సిందే. సమస్య తీవ్రత, విస్తృతిని దృష్టిలో ఉంచుకుని సభ్యదేశాలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, భూతాపం కట్టడిలో మెరుగైన భాగస్వామ్య పాత్ర పోషించాలి’’అని ముఖ్తార్ పిలుపునిచ్చారు. అయితే వర్ధమానదేశాలు తమ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు గరిష్టంగా 6.85 ట్రిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఐరాస వాతావరణవిభాగం చెప్పడం గమనార్హం. -
‘మిషన్ లైఫ్’తో భవిష్యత్తు!
సాక్షి, అమరావతి: వాతావరణంలో జరుగుతున్న అనూహ్య మార్పులు మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణం పూర్తిగా దెబ్బతిని భావితరాలు భూమిపై మనుగడ సాగించడమే కష్టమయ్యే అవకాశముంది. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. నీరు, ఇంధనం తదితరాలన్నీ పొదుపుగా వినియోగించాలి. ప్లాస్టిక్‌ను విడనాడాలి.. కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ‘మిషన్ లైఫ్’కు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి పలు నగరాలు ఎంపికవ్వగా.. అందులో రాజమహేంద్రవరం కూడా చేరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషితో.. భావితరాలకు ఇంధన వనరులను అందించడం కోసం.. పర్యావరణంలోని కర్బన ఉద్గారాలను తగ్గించి ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. బీఈఈ నేతృత్వంలో జరిగే ‘మిషన్ లైఫ్’ కార్యక్రమాలకు చేయూతనందించింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇంధన సంరక్షణ, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విడనాడడం, మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితం, చెత్త, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేసేందుకు బీఈఈ శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కర్నూలు నగరాలను బీఈఈ ఎంపిక చేసుకుంది. ఆ క్రమంలో రాజమహేంద్రవరంపైనా బీఈఈ దృష్టి సారించింది. విస్తృత ప్రచారం.. మిషన్ లైఫ్‌లో భాగంగా విస్తృత ప్రచారం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటు చేయడం, సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై ప్రత్యేక డ్రైవ్‌లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్‌షాప్‌లు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్‌లను బీఈఈ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, వలంటీర్ల ద్వారా.. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజిన్లను ఆపివేసేలా ప్రత్యేక ప్రచారం, కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక డ్రైవ్‌లను చేపడుతోంది.స్కూళ్లల్లో ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించేలా కృషి చేస్తోంది. దీని కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(సీసీసీ)ను రూపొందించింది. ఇందులో నిపుణులు, విద్యుత్ పంపిణీ సంస్థలు, మునిసిపల్, పట్టణాభివృద్ధి, రవాణా తదితర విభాగాలను భాగస్వాములను చేసింది. ఈ సెల్ వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంటుంది.వంద కోట్ల మందికి భాగస్వామ్యమే లక్ష్యం మిషన్ లైఫ్‌కు ఏపీలోని ఆరు నగరాలను ఎంపిక చేసుకున్నాం. ప్రజలు, వివిధ సంఘాలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నాం. తద్వారా రాష్ట్రంలో పర్యావరణ క్షీణతను అధిగమించడంతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం గ్రీన్ జాబ్స్ సృష్టించవచ్చని అంచనా వేస్తున్నాం. 2027–28 నాటికి వంద కోట్ల మంది భారతీయుల్ని మిషన్‌లైఫ్‌లో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – మిలింద్ దేవ్రా, బీఈఈ కార్యదర్శి మనం మారితేనే..» ట్రాఫిక్ లైట్లు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాల ఇంజన్లను ఆపితే ఏటా దాదాపు 22.5 బిలియన్ కిలోవాట్స్ ఇంధనం ఆదా చేయొచ్చు. » షాపింగ్‌లకు క్లాత్ బ్యాగులను వినియోగిస్తే 375 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా నివారించవచ్చు. » వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేయడం వల్ల 15 బిలియన్ టన్నుల ఆహారం వృథా కాదు. » నీటి కుళాయిలను సకాలంలో ఆపివేయడం వల్ల 9 ట్రిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయొచ్చు. » పని చేయని ఎలా్రక్టానిక్ గాడ్జెట్లను రీసైకిల్ చేయడం ద్వారా 0.75 మిలియన్ టన్నుల ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయొచ్చు. » ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం, ఎల్రక్టానిక్ పరికరాలను ఇంధన పొదుపు మోడ్‌లో వాడడం, తక్కువ నీటిని వినియోగించే పంటలు వేయడం, గ్రామీణ నీటి వనరుల రీచార్జ్‌ను ప్రోత్సహించడం, ఎల్ఈడీ లైట్లను వినియోగించడం, ప్రజా రవాణా తదితర మంచి విధానాలను ఉపయోగిస్తే.. మిషన్ లైఫ్ లక్ష్యాలను చేరుకోవచ్చు. » బీఈఈ ఇంధన సామర్థ్య పథకాలు, కార్యక్రమాల ద్వారా.. 2022–23లో 307 బిలియన్ యూనిట్ల విద్యుత్, 24.68 మిలియన్ టన్నుల చమురు సమానమైన థర్మల్ శక్తితో సహా సుమారు 306.40 మిలియన్ టన్నుల ఉద్గారాల్ని తగ్గించింది. -
Mann Ki Baat: జన స్పందనకు వందనం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలైన భారత సార్వత్రిక ఎన్నికల్లో 65 కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు వేశారని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల తిరుగులేని విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆదివారం తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడారు. విభిన్నమైన అంశాలను ప్రస్తావించారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడబోతున్న భారత క్రీడాకారులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. మన ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో ‘ఛీర్4భారత్’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకుందని ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్న మనవాళ్లకు మద్దతు తెలపాలని సూచించారు. ఎన్నో రకాల క్రీడల్లో భారత ఆటగాళ్లు విశేషమైన ప్రతిభ చూపుతున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఒలింపిక్స్‌కు వెళ్తున్న మన వాళ్లను త్వరలో కలుస్తానని, భారతీయులందరి తరపున వారికి ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. మన్ కీ బాత్‌లో మోదీ ఇంకా ఏమన్నారంటే..నా తల్లి పేరిట మొక్క నాటాను ‘‘పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల పెంపకంపై మనమంతా దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ‘తల్లి పేరిట ఒక మొక్క’ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నా మాతృమూర్తికి గుర్తుగా మొక్క నాటాను. తల్లి పేరిట, తల్లి గౌరవార్థం మొక్కలు నాటే కార్యక్రమం వేగంగా ప్రజల్లోకి వెళ్తుండడం ఆనందంగా ఉంది. అమ్మతో కలిసి మొక్కలు నాటిన చిత్రాలను జనం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కన్నతల్లిలాంటి భూగోళాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. సంస్కృత భాషను గౌరవించుకుందాం ఆలిండియా రేడియోలో సంస్కృత వార్తల బులెటిన్‌కు 50 ఏళ్లు నిండాయి. ప్రాచీన భాషకు ప్రాధాన్యం ఇస్తున్న ఆలిండియా రేడియోకు నా అభినందనలు తెలియజేస్తున్నా. భారతీయ విజ్ఞానం, శా్రస్తాల పురోగతి వెనుక సంస్కృత భాష కీలక పాత్ర పోషించింది. సంస్కృత భాషను మనమంతా గౌరవించుకోవాలి. నిత్య జీవితంలో ఈ భాషతో అనుసంధానం కావాలి. బెంగళూరులోని ఓ పార్కులో స్థానికులు ప్రతి ఆదివారం కలుసుకుంటారు. సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు. మరోవైపు దేశవ్యాప్తంగా గిరిజనులు ఈరోజు(జూన్ 30) ‘హూల్ దివస్’ జరుపుకుంటున్నారు. 1855లో సంథాల్ గిరిజన యోధులు వీర్ సింధూ, కాన్హూ అప్పటి బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. వీర్ సింధూ, కాన్హూకు నివాళులు అరి్పస్తున్నా. మన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగాఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇండియన్ కల్చర్‌పై కువైట్ ప్రభుత్వం కువైట్ నేషనల్ రేడియోలో ప్రతి ఆదివారం అరగంటపాటు హిందీ భాషలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. మన సినిమాలు, కళలపై అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తుర్కమెనిస్తాన్‌లో ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు 24 మంది ప్రపంచ ప్రఖ్యాత కవుల విగ్రహాలను ఆవిష్కరించారు. అందులో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కూడా ఉంది. ఇది గురుదేవ్తోపాటు భారత్‌కు కూడా ఒక గొప్ప గౌరవమే. కరీబియన్ దేశాలైన సురినామ్, సెయింట్ విన్సెంట్, గ్రెనాడైన్స్లో ఇటీవల భారతీయ వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచమంతటా అమితోత్సాహంతో నిర్వహించుకున్నారు. సౌదీ అరేబియా, ఈజిప్టులో మహిళలు యోగా కార్యక్రమాలను ముందుండి నడిపించారు’’ అన్నారు.వోకల్ ఫర్ లోకల్ మన స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. మన వద్ద తయారైన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయంటే అది మనందరికి గర్వకారణమే. కేరళలోని అట్టప్పాడీ గ్రామంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న కార్తుంబీ గొడుగులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈ గొడుగుల ప్రస్థానం ఒక చిన్న కుగ్రామం నుంచి బహుళ జాతి సంస్థల దాకా చేరుకుంది. ‘వోకల్ ఫర్ లోకల్’కు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? లోకల్ ఉత్పత్తులను గ్లోబల్‌కు చేర్చడంలో జమ్మూకశ్మీర్ కూడా తక్కువేం కాదు. చలి వాతావరణంలో పండించే బఠాణీలు పుల్వామా నుంచి గత నెలలో లండన్‌కు ఎగుమతి అయ్యాయి. జమ్మూకశ్మీర్ సాధించిన ఈ ఘనత అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విజయం జమ్మూకశీ్మర్ అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తుంది. ప్రజా సమస్యలపై ప్రస్తావనేది: విపక్షాలు‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదివారం విమర్శించారు. నీట్– యూజీ పరీక్షలో అక్ర మాలు, రైల్వే ప్రమాదాలు, మౌలిక సదుపాయాల ధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పైకప్పు కూలిపోయి ఒకరు మరణించారని, దీనిపై మోదీ నోరెత్తలేదని మండిపడ్డారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ, అక్రమాలపై జనం దృష్టిని మళ్లించడానికి కేరళలో తయారయ్యే గొడుగుల గురించి మోదీ ప్రస్తావించారని విమర్శించారు. ప్రజల మనసులో మాటను మోదీ తెలుసుకోవాలని పవన్ ఖేరా హితవుపలికారు. -
పిచ్చుక మీదనా బ్రహ్మాస్త్రం?
‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’’ అనే జాతీయం ఉంది. అతి తక్కువ బలం ఉన్నప్రాణి మీద అనవసరంగా అతి పెద్ద బలప్రయోగం చేయటం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఎంత చిన్నప్రాణి అయినా దాని అస్తిత్వం నిరుపయోగం కాదు. విశ్వంలో, ముఖ్యంగా భూగోళంలో, ప్రధానంగా అది ఉండే ప్రాంతంలో అది పోషించవలసిన పాత్ర ఒకటి ఉండనే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, తద్వారా పర్యావరణ సమతౌల్యత ఉంటాయి. దానికి భంగం కలిగిస్తే పర్యవసానం అనుభవించ వలసి ఉంటుంది. ఒక పిచ్చుక సంవత్సరంలో 6.5 కిలోల బియ్యం తింటుంది అని చైనాలో ఒకప్పుడు చేపట్టిన సర్వే తెలిపింది. మొత్తం పిచ్చుకలు లేకుండా చేయగలిగితే 60 వేల మందికి ఆహారం లభిస్తుంది అని కూడా తెలిపింది. ఇంకేముంది? అసలే అధిక జనాభా సమస్య ఉన్న చైనా, వీలైనంత మందికి ఆహారం అందించటానికి ఇదొక మార్గం అనుకుని పిచ్చుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. 30 లక్షల పిచ్చుకలని చంపారు. 1958 – 61 సంవత్సరాల మధ్య చైనాలో తీవ్రమైన కరవు వచ్చింది. సుమారుగా నాలుగు కోట్ల యాభై వేల మంది చనిపోయారు. కారణం ఏమై ఉంటుంది అని విచారణ చేస్తే పిచ్చుకలు లేక పోవటం వల్ల అని తేలింది. అదెట్లా? పిచ్చుకలు ధాన్యం తినటంతోపాటు పంటలని నాశనం చేసే పురుగులని కూడా తింటాయి. చీడ పురుగులని తినే పిచ్చుకలు లేక పోవటంతో పంటలకి చీడ పట్టి, తెగులు సోకి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. అది రాను రాను పెరిగింది. ప్రజలు తిండి లేక చనిపోయారు. దీనికి పరిష్కారం పంటలని నాశనం చేసే తెగుళ్లు కలిగించే పురుగులని రసాయన పదార్థాలు వాడ నవసరం లేకుండా తినేసే పిచ్చుకలు ఉండేట్టు చేయటమే అని నిర్ధారించారు. చేసేది ఏమీ లేక పిచ్చుకలని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. రష్యా నుండి పిచ్చుకలని దిగుమతి చేసుకున్నారు. పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఇటువంటి శాస్త్రీయమైన విషయాలని మన దేశంలో ఒక ఆనవాయితీగా, ఆచారంగా చేయటం అలవాటు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగువారు వరికంకులని కుచ్చుగా అల్లి ఇంటి ముందు వేలాడ దీసే వారు. పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క వడ్లగింజని తీసుకు వెళ్లేవి. అది రైతు పురుగులని తిని చీడ పీడల నుండి పంటని రక్షించిన పిచ్చుక పట్ల చూపించే కతజ్ఞత. ఇంటి ముందు కొన్ని గింజలు చల్లటం అలవాటు. ఆ అవకాశం ఉన్నా, లేక పోయినా ప్రతి రోజు పక్షులకి, ప్రత్యేకంగా కాకికి తినబోయే ముందు ఒక ముద్ద పెట్టటం అలవాటు. కాకి పరిసరాల్లో ఉన్న చెత్తని, చిన్న చిన్న పురుగులని తిని శుభ్రం చేస్తుంది. దేవాలయాలలో కూడా బలిహరణం అన్న పేరుతో నాలుగు దిక్కుల అన్నం ఉంచటం సంప్రదాయం. ఇంటి చూరులో పిచ్చుక గూడు పెడితే పరమానందం. ఆ గూట్లో పెట్టిన గుడ్లను పిల్లి తినకుండా కాపలా కాయటం ఒక సరదా. అవి ఉండే ప్రదేశాలని మనం ఆక్రమించి, చెట్లని నరికి వాటికి ఆహారం లేకుండా చేసినందుకు ఈ మాత్రం చేయక పోతే కృతఘ్నులం అవుతాం. అలాగని పిల్లులని పూర్తిగా తరమం. పిల్లి తిరుగుతుంటే ఆ వాసనకి ఎలుకలు విజృంభించవు. సృష్టిలో ప్రయోజనం లేని జీవి ఒక్కటి కూడా లేదు. గుర్తించక పోవటం మన లోపం. జాగ్రత్తగా గమనిస్తే ఇతర జీవులని, ప్రకృతిని స్వార్థానికి వాడుకుని ఎవరికీ ఉపయోగ పడని ప్రాణి మానవుడొక్కడే నేమో అనిపిస్తుంది. కనీసం పిచ్చుక పాటి అయినా చేయవద్దా? – డా. ఎన్. అనంత లక్ష్మి -
ప్రపంచ పర్యావరణానికి కొత్త గీతం
ఆడవాళ్లకు ఇంటి పని, వంటపని, మహా అయితే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయడం తప్ప పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలేం తెలుస్తాయి... అని చప్పరించేసే వారికి చెంపపెట్టు గీతాబాత్రా. భారతదేశానికి చెందిన ఆర్థికవేత్తల పేర్లు కొన్ని చెప్పమంటే మొదటి పది అంకెల్లోనే ఉండే పేరు ఆమెది. ఆర్థికవేత్తగా ఎంతో క్రమశిక్షణతో... అంతకుమించిన నిబద్ధతతో ఆమె తీసుకునే విధానపరమైన కీలక నిర్ణయాలే ప్రపంచ బ్యాంకు తాజా సమావేశంలో ఆమెను గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాయి. అంతేకాదు, ఆ పదవిలో నియామకం అయిన తొలి మహిళా డైరెక్టర్‌గా కూడా యాభై ఏడు సంవత్సరాల గీతాబాత్రా పేరు ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కింది. నిజానికి ఈ నియామకం ఇప్పటికి ప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. సుమారు మూడు వారాల క్రితం వాషింగ్టన్లో జరిగిన జీఈఎఫ్ 66వ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత గీతాబాత్రా అయితేనే ఈ పదవికి తగిన న్యాయం చేయగలదని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆమెను ఈ స్థానంలో నియమించారు. అయితే జీఈఎఫ్ డైరెక్టర్‌గా నియమితురాలు కావడం ఆమెకు ఏదో గొప్ప పదవిని కట్టబెట్టినట్టు కాదు... ఎన్నో సవాళ్లతో కూడిన ఎంతో బాధ్యతాయుతమైన స్థానం అది. 1998లో వరల్డ్ బ్యాంక్‌లో చేరడానికన్నా ముందు ఆమె అమెరికాలోని కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లలో పై స్థాయిలో పని చేసింది. అసలు ఆమె నేపథ్యం ఏమిటో చూద్దాం. గీతాబాత్రాది కొత్తదిల్లీ. ముంబాయిలోని విల్లా థెరిసా స్కూల్లో చదువు పూర్తయ్యాక చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో అర్థశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేసింది. ఇక ఉద్యోగం చూసుకుందాం అనుకుంటుండగా ఆమె ప్రోఫెసర్లలో ఒకరి ప్రోద్బలంతో అమెరికా వెళ్లి ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేసింది. అక్కడే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా కొన్ని సంవత్సరాల పాటు పని చేసింది. వరల్డ్ బ్యాంక్‌కు అనుబంధ సంస్థలలో ఆమె 2005 వరకు పని చేసింది. అప్పుడే ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అడ్వైజరీ సర్వీసెస్‌లో పని చేసింది. ఆ తర్వాత ఆమె భారతదేశం నుంచి వరల్డ్ బ్యాంక్ ఐఈజీలో చీఫ్ ఎవల్యూటర్ అండ్ మేనేజర్‌గా కార్పొరేట్ థీమాటిక్ ఎవల్యూషన్ బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత 2015 లో జీఈఎఫ్ ఐఈవోగా చేరి, నాటినుంచి టీమ్‌తో పని చేయిస్తోంది. నాటినుంచి ఆమె ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించడంలో ఎంతో సమర్థనీయమైన పాత్రను పోషించింది. ఎన్నో పుస్తకాలు రాసింది. మరెన్నింటికో సంపాదకత్వ బాధ్యతలు వహించింది. ప్రస్తుతం నార్ద్రన్ వర్జీనియాలో భర్త ప్రకాష్, కుమార్తె రోషిణితో కలిసి జీవిస్తోంది. జీఈఎఫ్ ‘గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ) పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ బ్యాంకు చేపట్టే అన్ని బాధ్యతలను ఆమె పర్యవేక్షించడమే కాదు.. అందుకు కావలసిన. కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్‌ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో చేరి, నా కెరీర్‌ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్‌ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్‌గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్‌ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్‌లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్‌లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
Change Is Us: ఒడ్డును.. ఒడ్డున పడేస్తారు
పర్యావరణ పరిరక్షణ బాధ్యత మొన్న జనవరి 1 వేడుకలు. లక్షలాది మంది ముంబై బీచుల్లో చేరి ఎంజాయ్ చేశారు. మంచిదే. లెక్కలేనంత చెత్త పారబోశారు. అందమైన సాగర తీరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ మనకు ఎప్పుడూ లేదు. అందుకే ముంబైలోని ‘చేంజ్ ఈజ్ అజ్’ సంస్థలోని టీనేజ్ పిల్లలే ఈ క్లీనింగ్‌కి పూనుకున్నారు. బుద్ధులు వినాల్సిన పిల్లలే పెద్దలకు బుద్ధులు చెబుతున్నారు. విందామా వారి మాట? మనిషి బావిని, చెరువును తవ్వించగలడు. సముద్రాన్ని కాదు. ఒక ప్రాంతంలో సముద్రం ఉందంటే అది ప్రకృతి ఆ ప్రాంతానికి ఇచ్చిన వరం. ఎన్ని చికాకులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతో సంతోషంగా అనిపించినా అలా బీచ్‌కు వెళితే, సముద్రం ఒడ్డున కూచుంటే, అలల ఘోషను వింటూ, ఆ సమతల అగాధపు గాంభీర్యాన్ని కంటూ, ఎగిరే పక్షుల వల్ల, తిరిగే పడవల వల్ల, వీచే గాలుల వల్ల ఓదార్పు పొందడం ఎంత బాగుంటుంది! కాని ఆ భావాలన్నీ పేరుకున్న చెత్త వల్ల నాశనమైతే? మన దేశంలో పేద, మధ్యతరగతి వారికి ఖర్చులేని కాలక్షేపం బీచ్. దానికి కూడా వెళ్లలేనంతగా వాటిని గలీజ్ చేస్తే? అలా చేసేంత దుర్గుణం మనుషులకే ఉంది. దానికి జవాబు యువత దగ్గర ఉంది. ఛేంజ్ ఈజ్ అజ్ ముంబైలో ఎంతలేదన్నా డజన్ అందమైన బీచ్‌లు ఉన్నాయి. అతి చిన్న ఇరుకు ఇళ్లలో జీవించే ముంబై జీవులు బీచ్‌లకు వచ్చే ఊపిరి పీల్చుకుంటారు. 75 ఏళ్ల కుంతీ ఓజా అనే మహిళ మూడు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో ‘చిన్నప్పటి నుంచి చౌపాటి బీచ్‌కు వచ్చి ఆహ్లాదం పొందేదాన్ని. పసుపు రంగు ఇసుక చూడటం, చిరుతిళ్లు తినడం భలే ఉండేది. కాని ఇప్పుడు బీచ్ మొత్తం చెత్త. మా చిన్నప్పుడు మిగిలిన తిండి పారేసేవారు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ చెత్తను పారేస్తున్నారు’ అని రాసింది. ఆమె గోడు విన్నట్టుగా ఆ సమయంలోనే సీనియర్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అక్షత్ షా, శుభ్ మెహతా పర్యావరణ విధ్వంసం గురించి స్కూల్లో, బయట వింటున్న వార్తలతో ప్రభావితం అయ్యారు. అప్పుడే అమెజాన్ అడవులు తగలబడటం వారిని కలిచి వేసింది. ‘మన వంతుగా ఏదో ఒకటి చేద్దాం’ అని సోషల్ మీడియా వేదికగా ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్‌ను ప్రారంభించి ముంబైలోని బీచ్‌ల క్లీనింగ్‌కి నడుం కట్టారు. జూలై 2019న మొదటిసారి అక్షత్ షా, శుభ్ మెహతా జూలై, 2019లో మొదటిసారి చౌపాటి బీచ్‌ను క్లీన్ చేయడానికి సోషల్ మీడియాలో పిలుపునిచ్చినప్పుడు కేవలం 18 మంది టీనేజ్ విద్యార్థులు హాజరయ్యారు. వారంతా కలిసి బీచ్‌ను క్లీన్ చేయడం జనం వింతగా చూశారు. కాని మంచి పనికి కొత్త తరం అండ తప్పక లభిస్తుంది. క్రమం తప్పకుండా బీచ్‌లను క్లీన్ చేయడం, ఫొటోలను ప్రచారంలో పెట్టడంతో హైస్కూల్, కాలేజీ స్థాయి పిల్లలు స్పందించడం మొదలెట్టారు. తల్లిదండ్రులు కూడా ఈ మంచి పనికి అడ్డు చెప్పలేదు. ‘ఇప్పటి వరకూ మేము ముంబై బీచ్‌ల నుంచి 480 టన్నుల చెత్త పారబోశాం’ అంటారు అక్షత్ షా, శుభ్. ప్రస్తుతం అక్షత్ ముంబైలోనే ఉంటూ చదువుకుంటుంటే శుభ్ యూకేలో చదువుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. పాతిక వేలమంది వాలంటీర్లు ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ ఎంత సక్సెస్ అయ్యిందంటే ముంబై మొత్తం నుంచి 25,200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా చేరారు. బీచ్‌ల శుభ్రత గురించి ఛేంజ్ ఈజ్ అజ్ సభ్యులు స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రచారం చేయడం వల్ల కూడా ఈ చేరిక సాధ్యమైంది. వీరంతా తమకు వీలున్నప్పుడల్లా ముంబైలోని బీచ్‌లను శుభ్రం చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు, డిసెంబర్ 31 వంటి సందర్భాల్లో వీరి పని ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో బీచ్‌లు టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. పట్టణ, నగర సంస్థలు బీచ్‌ల శుభ్రత కోసం ఎంతోకొంత నిధులు వెచ్చిస్తున్నా నిరంతర అలల్లాగే నిరంతరం చెత్త పడుతూనే ఉంటుంది. అందుకే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం... తీరాల పొడవునా బీచ్‌లను శుభ్రం చేయడానికి విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలి. వారు కదిలితే పెద్దలూ కదులుతారు. -
‘ఈవీ’ విప్లవానికి ఏపీ తోడ్పాటు భేష్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాల విప్లవాన్ని సాధించే జాతీయ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న తోడ్పాటు బాగుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ ప్రశంసలు కురిపించారు. విద్యుత్ వాహనాల(ఈవీ)పై ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్), సీఈఎస్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ ఏడాది ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహæనాల అమ్మకాల్లో 80 శాతం వృద్ధి కనిపిస్తోందని, 2030 నాటికి మొత్తం వాహనాల్లో 30 శాతం ఈవీలే ఉండాలనేది కేంద్రం లక్ష్యమని విశాల్ కపూర్ అన్నారు. తద్వారా రానున్న ఏడేళ్లలో 846 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను, 474 మిలియన్ టన్నుల చమురు దిగుమతులను తగ్గించవచ్చని వివరించారు. ఇందులో భాగంగా ఈఈఎస్ఎల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ–బస్సుల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. సాధారణ బస్సులతో పోల్చితే ఈ–బస్సులు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందిస్తాయన్నారు. విద్యుత్ వాహనాల విప్లవానికి ఏపీ నాంది పలికిందని విశాల్ కపూర్ ప్రశంసించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తూ ఉద్యోగులకు లక్ష ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఏపీలో ప్రస్తుతం 65 వేల విద్యుత్ వాహనాలుండగా, 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం ఈవీలే ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇంధన శాఖ అధికారులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 400 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 266 స్టేషన్లు పనిచేస్తున్నాయని, మరో 115 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. -
జీవ ఇంధనాల కూటమి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ‘ప్రపంచ జీవ ఇంధనాల కూటమి’ని ప్రకటించింది. భూతాపానికి, తద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని, ఇందుకోసం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జీవ ఇంధనాల కూటమిపై ప్రకటన చేశారు. ఈ కూటమిలో చేరాలని, పుడమిని కాపాడుకొనేందుకు చేతులు కలపాలని జీ20 సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్’ అంశంపై జరిగిన చర్చలో మోదీ మాట్లాడారు. ‘జీ20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్’ను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ‘గ్రీన్ క్రెడిట్ అంకురార్పణ’పై కార్యాచరణ ప్రారంభించాలని జీ20 దేశాలను కోరారు. ఇంధన బ్లెండింగ్ రంగంలో ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం తగదనిమోదీ స్పష్టం చేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకోవడం చాలా ఉత్తమమని అభిప్రాయపడ్డారు. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో రకమైన బ్లెండింగ్ మిక్స్‌ను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. స్థిరమైన ఇంధన సరఫరా కావాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ సైతం ముఖ్యమేనని తేలి్చచెప్పారు. ప్రపంచ జీవ ఇంధనాల కూటమిలో భారత్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, సౌతాఫ్రికా, యూఏఈ, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా, సింగపూర్ పరిశీలక దేశాలుగా ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది. సమీకృత ఇంధన పరివర్తన వాతావరణ మార్పులు అనే పెనుసవాళ్లు ఎదురవుతున్న నేటి తరుణంలో ‘ఇంధన పరివర్తన’ చాలా అవసరమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సమీకృత ఇంధన పరివర్తన కోసం కోట్లాది డాలర్లు వ్యయం చేయాల్సి ఉంటుందని, అభివృద్ది చెందిన దేశాలు దీనిపై మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. క్లైమేట్ ఫైనాన్స్ కోసం ఏటా 100 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అభివృద్ధి చెందిన దేశాలు 2009లో అంగీకరించడం హర్షణీయమని పేర్కొన్నారు. అయితే, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు విఫలమవుతున్నాయని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమిటీ కూటమి? ప్రపంచంలో ప్రజలందరికీ శుద్ధమైన సౌర శక్తి చౌకగా అందాలని భారత్ ఆకాంక్షించింది. ఇందుకోసం 2015లో పారిస్‌లో జరిగిన సదస్సులో ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ)ను తెరపైకి తీసుకొచి్చంది. అదే తరహాలో ఇప్పుడు ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించింది. -
సునాక్ ఇంటిపై నల్లవస్త్రం
లండన్: బ్రిటన్ ప్రధాని ఇంటిపై నల్లటి వ్రస్తాన్ని కప్పిన నలుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తర ఇంగ్లాండ్‌లో నార్త్ యార్క్‌షైర్ ప్రాంతంలోని రిచ్మండ్లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై వారు నల్లటి వస్త్రం కప్పి తమ నిరసనను తెలియజేశారు. వీరు ‘గ్రీన్‌పీస్’ అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతను మరింత విస్తరిస్తూ సునాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. సునాక్ ఇంటిపైకి ఎక్కి 200 చదరపు మీటర్ల నల్ల వస్త్రాన్ని కప్పారు. అలాగే సునాక్ ఇంటి ముందు మరో ఇద్దరు కార్యకర్తలు ‘చమురు లాభాలు ముఖ్యమా? లేక మా భవిష్యత్తు ముఖ్యమా?’ అని ప్రశ్నిస్తూ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ సమయంలో సునాక్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంట్లో లేరు. -
తెలంగాణలో అంతా ‘గ్రీన్’!
మాదాపూర్ (హైదరాబాద్): పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ బిల్డింగ్ మూవ్మెంట్ 2001 నుంచి ప్రారంభమైందని, దాని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) గ్రీన్ ప్రాపర్టీ షో–2023ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలోనే మొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్‌హోమ్స్, గ్రీన్ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, ఫ్యాక్టరీ బిల్డింగ్లు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో గ్రీన్ ఫుట్‌ప్రింట్స్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ పార్కులు ఐజీబీసీ ప్రమాణాలతో ఉండేలా చూస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియేట్, టీహబ్, టీవర్క్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 33 జిల్లాల్లోని నూతన కలెక్టరేట్ భవనాలు, ప్రతి జిల్లాలో ఆస్పత్రులు, హెల్త్‌కేర్ క్యాంపస్‌లు గ్రీన్ సర్టిఫికేషన్‌కు లోబడి ఉన్నాయని చెప్పారు. భవనాలే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి పట్టణాలు ఐజీబీసీ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో హరితహారం 24 శాతం నుంచి 33 శాతానికి పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఏఐపీహెచ్ గ్రీన్‌సిటీ అవార్డు హైదరాబాద్‌కి దక్కిందని చెప్పారు. ఎనిమిదేళ్లలో 2.60 కోట్ల మొక్కలు పట్టణాలు, గ్రామాలకు కేటాయించిన బడ్జెట్లో 10 శాతం పచ్చదన పరిరక్షణకు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. గత 8 సంవత్సరాలలో 2.60 కోట్ల మొక్కలు నాటామని, వాటిలో కనీసం 85 శాతం మొక్కలను రక్షించే విధంగా కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు. గ్రామాలలో కూడా ఎల్ఈడీ లైట్లను అమర్చినట్టు తెలిపారు. వరంగల్‌లోని గంగాదేవి పల్లి గ్రామానికి గ్రీన్ విలేజ్ రేటింగ్‌లో ప్లాటినం అవార్డు వచ్చిందని చెప్పారు. అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి తెలంగాణలోని అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ది వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జవహర్‌నగర్‌లో ఉంది. బిల్డర్లు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీచార్జి వంటి నాలుగు సూత్రాలను పాటించి గృహ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. సీఐఐ (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) తెలంగాణ చైర్మన్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
చదువు.. సంస్కారం.. పర్యావరణం
పదో తరగతి చదివే పిల్లలు... స్కూలు, ట్యూషన్లు అంటూ బిజీబిజీగా ఉంటారు. ఆఖరి పరీక్షలు పూర్తయ్యేవరకు చదువు తప్ప మరో ధ్యాస ఉండదు వీరికి. అలాంటిది లితిషా బగాడియా చదువుతోపాటు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను నిర్మూలిస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. గత రెండేళ్లుగా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రకృతి సంరక్షణకు కృషిచేస్తోన్న లితిషాను ‘ద ప్రిన్సెస్ డయానా క్లైమెట్ యాక్షన్’ అవార్డు వరించింది. ఈ అవార్డుతో పిల్లలకు చదువు, సంస్కారంతోపాటు పర్యావరణ స్పృహ కూడా ఉండాలి అనడానికి ఉదాహరణగా నిలుస్తోంది లితిషా. ముంబైకు చెందిన లితిషాకు... చెత్తపేరుకుపోయిన నగరాల జాబితాలో ముంబై కూడా ఉండడం నచ్చలేదు. దీంతో నగరాన్ని శుభ్రం చేయాలనుకుంది. అదే విషయాన్ని తన స్నేహితురాలు సియా జోషికి చెప్పింది. ఇద్దరూ కలిసి ఎన్జీవోని ఏర్పాటు చేసి ముంబైని క్లీన్ చేద్దామనుకున్నారు. కానీ ఆ సమయంలో కరోనా ఆంక్షలు ఉండడంతో బయటకు రావడం కుదరలేదు. దీంతో 2021 ఆగస్టు 31న ‘ఐకా’ ఫౌండేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభించారు. ఐకా ద్వారా... పర్యావరణ సమస్యలు, వ్యర్థాల నిర్వహణ, టపాసులు కాల్చడం, నీటì వృథా... వంటి అంశాలపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించేవారు. ఇది నచ్చిన కొంతమంది ఔత్సాహికులు ముందుకు రావడంతో వారితో కలిసి చెత్తను శుభ్రం చేయడం మొదలు పెట్టారు. వీరికి మరికొంతమంది తోడవడంతో అంతా సమూహంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విస్తరించారు. ► పూల నుంచి పెర్ఫ్యూమ్స్ ప్రాజెక్ట్ ‘అవిఘ్న’ పేరుతో... వినాయక చవితి వేడుకల్లో మండపాల దగ్గర చల్లే పూలు, ఇతర పండుగల్లో వాడేసిన పూలను, నిమజ్జనం తరువాత మిగిలిపోయే ఇనుము వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. ఈ పూలను పెర్ఫ్యూమ్స్గా, ఎరువులుగా మార్చడం వల్ల నిరుపేదలకు ఆదాయం కూడా వస్తోంది. గణేష ఉత్సవాల్లో మూడువందల కేజీలకుపైగా పూల వ్యర్థాలను సేకరించి ‘మోబి ట్రాష్’ అనే స్టార్టప్‌కు అందించారు. ఈ స్టార్టప్ పూలను గిరిజన, మురికివాడల్లోని నిరుపేదలకు ఇచ్చి అగరు బత్తీలు, రంగులు తయారు చేయించి వారికి ఉపాధి కల్పిస్తోంది. దీనిద్వారా నగరంలో చెత్త శుభ్రం అవడమేగాక, పరిసరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ► ఈ వేస్ట్‌తోపాటు బీచ్‌క్లీనింగ్ వాడిపడేసిన ల్యాప్టాప్స్, ఫోన్ ఛార్జర్లు, ఇయర్‌ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను కూడా సేకరించి ఈ వేస్ట్ రీ సైక్లింగ్ సెంటర్లకు చేరవేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేకంగా ‘ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్’ నిర్వహించి వేస్ట్ సేకరిస్తున్నారు. ‘బీచ్క్లీన్ – అప్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీచ్‌లో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను ‘శక్తి ప్లాస్టిక్స్’ కంపెనీకి ఇస్తున్నారు. ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి ఫర్నీచర్, ఇతర వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. ఇవేగాక ఏడోతరగతి లోపు పిల్లలకు వర్క్‌షాప్స్ ద్వారా పర్యావరణ ప్రాముఖ్యత, కాలుష్యం నుంచి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. హోలీ, దీపావళి సమయాల్లో ఇకోఫ్రెండ్లీ సంబరాలు జరుపుతూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ► చదువుతూనే... ఇంకా జీవితంలో స్థిరపడేంతగా చదువుకోలేదు. అయినా ఇన్ని కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ ప్రస్తుతం తమ కాలేజీ చదువుని నిర్లక్ష్యం చేయకుండా ముంబైని క్లీన్ చేయడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో.. భవిష్యత్‌లో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఈ చిచ్చరపిడుగులు చెబుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇలాంటి బాలలు మరింతమంది తయారైతే మన దేశ భవిష్యత్ ఉజ్వలంగా వెలిగిపోతుంది. ‘‘ఈ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా స్నేహితురాలు, ఐకా ఫౌండేషన్ సహవ్యవస్థాపకురాలు సియా జోషి నా వెన్నంటే ఉండి ప్రోత్సహించడం వల్లే ఈ గౌరవం దక్కింది. అందుకే మరిన్ని ప్రాజెక్టుల ద్వారా అందరిలో అవగాహన కల్పిస్తూ.. పర్యావరణాన్ని కాపాడతాము’’ అని లితిషా బగాడియా చెబుతోంది. లితిషా బగాడియా -
111 రద్దుపై సుప్రీంకోర్టుకు..!
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చి న జీవో 111ను పూర్తిగా తొలగించడంపై స్వచ్ఛంద సంస్థలు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్‌ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల పర్యావరణ పరిరక్షణ సంస్థలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దూరదృష్టితో జీవో 111ను సమర్థించిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకుండానే ఏ విధమైన అధ్యయనం లేకుండానే జీవోను తొలగించిందన్నారు. జీవో 111పై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పర్యావరణానికి ముప్పు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారు. 1912లో మొదట గండిపేట్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి 1917లో పూర్తి చేశారు. ఆ తరువాత 1921లో హిమాయత్‌సాగర్ నిర్మాణం ప్రారంభించి 1927 నాటికి వినియోగంలోకి తెచ్చారు. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. ‘గోదావరి జలాల వల్ల భూగర్భ నీటిమట్టం పెరగదు. గతంలో నిర్మించిన ఏ ఎస్టీపీలు, రింగ్మెయిన్లు చెరువులను కాపాడలేకపోయాయి. ఇప్పటి కే నగరంలో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూతాపం విపరీతంగా పెరుగుతుంది’అని నిపుణులు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి హాని ఈ జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తివేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది హైదరాబాద్‌ను వరదల బారి నుంచి కాపాడేందుకు అప్పటి నిజాం నవాబు కట్టించిన జంట జలాశయాలు నగరాన్ని భూతా పం నుంచి రక్షిస్తున్నాయి. జీవ వైవిధ్యా న్ని రక్షించుకొనేందుకూ దోహదం చేస్తున్నాయి. జీవో 111ను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. సహజవనదరులను, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమం కాదు. – లూబ్నా సార్వత్, సామాజిక కార్యకర్త సూపర్ ఆర్డర్‌ను ఎలా ధిక్కరిస్తారు ఏ నగరంలో అయినా 20 శాతం నీటి వనరులు ఉండాలి. కానీ హైదరాబాద్‌లో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు కూ డా అలాగే మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సంపన్నులకు కొమ్ముకాసే పాలకులు పర్యావరణాన్ని కాపాడుతారనుకోవడం భ్రమే అవుతుంది. గతంలోనూ జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాం. జీవో 111ను సమర్థిస్తూ 2000 సంవత్సరంలో సుప్రీంకో ర్టు సూపర్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఎలా ధిక్కరిస్తారు. న్యాయనిపుణుల తో చర్చిస్తున్నాం. మరోసారి కోర్టుకెళ్తాం. – ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి -
‘పుడమి సాక్షిగా’ క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక ఏఎఫ్‌ఏఏ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న ‘పుడమి సాక్షిగా’క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఏషియా (ఏఐఏ) ఆధ్వర్యంలోని ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఏఎఫ్‌ఏఏ).. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ‘కార్పొరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్’సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఏఎఫ్‌ఏఏ చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, ఏఐఏ ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. పుడమి‘సాక్షి’గా లక్ష్యాలివే.. ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020–21లో ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్ తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి మనుషులే ప్రధాన కారణం. ఈ భూమి మళ్లీ పునర్వవైభవం దక్కించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు ఇందులో ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. దీంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటలపాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. -
పర్యావరణ పరిరక్షణకు వీమార్ట్ శ్రీకారం
ముంబై: ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ దేశవ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ ఉత్పత్తులు, ప్రక్రియలు, సాంకేతికత రూపంలో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. సీఎస్ఆర్ కార్యక్రమం కింద పర్యావరణ పరిరక్షణ, సామాజికాభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించామని పేర్కొంది. వాతావరణ మార్పుల సమస్యలకు దీర్ఘకాలం పాటు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం పరిష్కారమని కంపెనీ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. -
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం కోసం మన దైనందిన జీవితంలో అలవరుచుకోవలసిన, మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతులను పై నాలుగు అంశాలూ సుస్పష్టం చేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎంత మేలు జరుగుతుందో వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ మూడు దశల కార్యాచరణను సిఫారసు చేసింది. 2022–23 నుంచి 2027–28 మధ్య కాలంలో దేశంలోని 80 శాతం మంది ప్రజలను పర్యావరణ హితులుగా మార్చడమే లక్ష్యంగా ‘మిషన్ లైఫ్’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (పర్యావరణ హిత జీవన విధానం (లైఫ్) పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. గత వారంలోనే వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. మొదటిదశలో భాగంగా 2022–23లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హిత వ్యక్తిగత జీవనాన్ని అలవర్చుకునేలా పలు సూచనలు చేసింది. ఇంధనం, నీరు పొదుపు చేయడం, ప్లాసిక్ నియంత్రణ, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, వ్యర్ధాలను తగ్గించడం, ఆరోగ్యకర జీవనాన్ని అలవరుచుకోవడం, ఈ–వ్యర్థాలను తగ్గించడం అనే ఏడు కేటగిరీల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో 75 జీవన సూత్రాలను పేర్కొంది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల డిమాండ్‌లో మార్పు వస్తుందని వెల్లడించింది. దైనందిన జీవితంలో అలవరుచుకోవాల్సిన కొన్ని ప్రధాన సూచనలు, చేసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే.. ►ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వాడాలి ►వీలున్న ప్రతి చోటా ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించాలి ►స్నేహితులు, సహచరులతో కార్ పూలింగ్ (ఒక కారులో కలిసి వెళ్లడం) అలవరుచుకోవాలి ►ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రైల్వే గేట్ల వద్ద ఆగినప్పుడు వాహనాల ఇంజన్ ఆపేయాలి ►స్థానికంగా తిరిగేటప్పుడు, సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సైకిల్ మీద వెళ్లాలి ►అవసరం లేనప్పుడు సాగునీటి పంపులను నిలిపివేయాలి ►పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి ►వంటలో ప్రెషర్ కుక్కర్లకు ప్రాధాన్యమివ్వాలి ►పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. తక్కువ నీటిని తీసుకునే చిరుధాన్యాల పంటలను సాగుచేయాలి ►ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాల్లో వర్షపు నీటిని పొదుపు చేసే ఏర్పాట్లు చేసుకోవాలి ►కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి లేదంటే ఇతర అవసరాలకు వాడుకోవాలి ►చెట్లకు నీరు పోసేటప్పు డు, వాహనాలు, ఇళ్లు కడిగేటప్పుడు పైపులకు బదులుగా బకెట్లలో నీటిని ఉపయోగించాలి ►రోజువారీ నీటి వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రతి ఇంటికీ నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి ►ప్లాస్టిక్ సంచులకు బదులు నేత సంచులు వాడాలి ►వెదురు దువ్వెనలు, వేప బ్రష్‌లు ఉపయోగించాలి ►ఆహారం తీసుకునే సమయంలో చిన్న ప్లేట్లను ఉపయోగించాలి ►పాత దుస్తులు, పుస్తకాలను దానం చేయాలి ►రెండువైపులా ప్రింట్ వచ్చేలా ప్రింటర్‌ను సెట్ చేసుకోవాలి ►ఎలక్ట్రానిక్ పరికరాలను మరమ్మతు చేసి ఉపయోగించుకోవాలే తప్ప పడేయకూడదు. -
శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?
పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇండియా పనితీరు అట్టడుగున ఉందని యేల్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘ది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’ బయటపెట్టింది. దీన్ని కేంద్రం విమర్శించినప్పటికీ, ఇది దేశంలోని శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. సామాజిక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు కూడా వార్తలున్నాయి. దేశ రక్షణ ప్రాజెక్టులను మినహాయిస్తే, మిగిలిన పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు స్వాతంత్య్రముండాలి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా అట్టడుగున ఉందని ఇటీవలే విడుదలైన ‘ది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’ (ఈపీఐ) తెలపడం దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల స్వయం ప్రతిపత్తిపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమెరికాలోని సుప్రసిద్ధ యేల్ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన ఈ జాబితాపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితి వంటి పదకొండు వర్గాల్లో సుమారు 40 అంశాలను పరిశీలించి యేల్ యూనివర్సిటీ ‘ఈపీఐ’ని సిద్ధం చేయగా కేంద్రం మాత్రం ఈ అంశాల ఎంపికే తప్పని విమర్శించింది. అత్యధిక సమాచారం అవసరమయ్యే అంశాల ఆధారంగా ఒక దేశం పర్యావరణం, వన్యప్రాణి ఆవాస పరిరక్షణలకు చేస్తున్న ప్రయత్నా లను మదింపు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను ఇక్కడ మనం పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. ఈపీఐ విడుదలైన నేపథ్యంలోనే కేంద్రం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వ్యవహారం ఒకటి వెలుగు లోకి వచ్చింది. డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. అంటే యేల్ లాంటి సంస్థలు తప్పుడు అవగాహనతో, సమాచారాన్ని ఊహించుకుని ఈపీఐ వంటి జాబితాలను రూపొందిస్తున్నాయని ఆరోపిస్తూనే... ఇంకోవైపు పర్యావరణ సంబంధిత శాస్త్రీయ సమాచారాన్నిచ్చే సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర మంత్రిత్వ శాఖ చేస్తోందన్నమాట! నిజానికి ఇలా మంత్రిత్వ శాఖలు పరిశోధన సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. డబ్ల్యూఐఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోనే పనిచేస్తూం టుంది. ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి. నిధుల వితరణ మొదలుకొని అనేక అంశాల్లో మంత్రిత్వ శాఖలు సంస్థల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తూంటాయి. కరోనా మహమ్మారి ప్రబలిన సందర్భంలోనూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), వైద్య పరిశోధన విభాగాలు 2020 మే నెలలోనే దేశంలో సామాజిక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు వార్తలున్నాయి. ఈ వివరాలు ప్రచురి తమై ఉంటే వైరస్ నియంత్రణలో కేంద్రం భేషుగ్గా పనిచేస్తోందన్న ప్రచారంలోని డొల్లతనం ఇట్టే బయటపడేది. ఆ తరువాతి కాలంలో ఇదే విషయం రుజువైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోకి రాని పరిశోధనా సంస్థలపై కూడా పెత్తనం చలాయించే ప్రయత్నాలు చేసిన సందర్భాలు బోలెడు. భారత్‌లో ఎన్డీఎం–1 సూపర్ బగ్ ఉనికిని బ్రిటిష్ శాస్త్రవేత్తలు బట్టబయలు చేసినప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ రెండూ ఈ అంశంపై వ్యాఖ్యానించకుండా ప్రైవేట్ సంస్థ లనూ హెచ్చరించినట్లు సమాచారం ఉంది. వైద్యం కోసం పలువురు విదేశీయులు భారత్‌కు విచ్చేస్తున్నారన్న ‘మెడికల్ టూరిజం’ దెబ్బ తినకుండా ఈ ప్రయత్నం అన్నమాట. అయితే కొన్ని నెలల తరువాత ఆరోగ్య శాఖ స్వయంగా ఎన్డీఎం–1 కారణంగా కొన్ని మందులకు నిరోధకత ఏర్పడుతున్నట్లు అంగీకరించాల్సి వచ్చింది. ఈ అంశంపై ఒక టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నావీ1సీ పేరుతో ప్రయోగించిన ఓ ఉపగ్రహంలో తీవ్రస్థాయి లోపాలున్నాయనీ,వైఫై సిగ్నళ్లకు స్పందిస్తోందనీ 2018లో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల శాస్త్రవేత్తలు గుర్తించగా... ఇస్రో వారి గొంతును నొక్కేసిందని సమాచారం. డబ్ల్యూఐఐ, నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) వంటివి ఈ దేశానికి చాలా కీలకమైనవి. ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, పర్యావరణ పర్యవేక్షణకూ అవసరమైన పలు అంశాలపై ఈ సంస్థలు పరిశోధనలు చేస్తూంటాయి. భారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు వాటి కారణంగా వన్యప్రాణులకు, పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై కూడా ఈ సంస్థలే నివేదికలివ్వాలి. 1990ల మధ్యలో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు దేశంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల దయనీయ పరిస్థితిపై ఓ శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురించడం ఒక రకంగా సంచలనం సృష్టించిం దని చెప్పాలి. తూర్పు తీర ప్రాంతంలో ఈ తాబేళ్లకు భారీ ప్రాజెక్టులు, యాంత్రిక ట్రాలింగ్ల కారణంగా మరింత విపత్తు రానుందని డబ్ల్యూఐఐ హెచ్చరించింది కూడా! గహిర్మాత బీచ్‌లో వేల తాబేళ్లు సంతానోత్పత్తి చేస్తూంటాయి. అయితే ఈ ప్రాంతానికి దగ్గరలోని ఓ ద్వీపంలో క్షిపణి పరీక్షా కేంద్రం ఒకటి ఏర్పాటు కావడంతో తాబేళ్ల ఉనికి ప్రశ్నార్థకమైంది. ‘‘డీఆర్డీవో వాడే ప్రకాశవంతమైన లైట్లు ఆ తాబేళ్లకు ప్రాణాంతకంగా మారాయి’’ అని డబ్ల్యూఐఐ శాస్త్రవేత్త ఒకరు విస్పష్టంగా తన పరిశోధనా వ్యాసంలో రాశారు. ఆ తరువాత డీఆర్డీవో శాస్త్రవేత్తలు లైట్ల కాంతిని నియంత్రిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. పర్యావరణ సంబంధిత వ్యాజ్యాల్లో చాలా సందర్భాల్లో న్యాయ స్థానాలు కూడా పరిశోధనా సంస్థల, ఆయా రంగాల్లో నిపుణుల ‘స్వతంత్ర’ నివేదిక కోసం అడుగుతూంటాయి. చార్ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టుల విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే... జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పినా పర్యావరణ సంబంధిత ఆందోళనలను సమాధాన పరిచేందుకు ఓ పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సాంకేతిక సహాయం డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ‘నీరి’ అందించాయి. ఐఐటీ రూర్కీ వంటి సంస్థలు తయారు చేసిన నివేదికలు పలు జలవిద్యుత్ కేంద్రాలకు అనుమతు లివ్వడంలో ఉపయోగపడ్డాయి. అయితే గతంలో ‘నీరి’ నివేదికలపై కూడా చాలా విమర్శలు వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రాజెక్టును ప్రతిపాదించిన వారికి అవి అనుకూలంగా ఉన్నాయని పలువురు వేలెత్తి చూపారు. మధుర రిఫైనరీ వల్ల జరుగుతున్న వాయు కాలుష్యాన్ని తక్కువగా చూపి, చిన్న పరిశ్రమలనే తాజ్‌మహల్ కాలుష్యానికి నిందించినట్టుగా ‘నీరి’పై ఆరోపణలున్నాయి. ‘నీరి’ డైరెక్టర్ సేవలను అవినీతి ఆరోప ణల నేపథ్యంలో అర్ధంతరంగా ముగించాల్సి రావడం, కొత్త డైరెక్టర్ నియామకంలో విపరీతమైన జాప్యం జరగడం ఇటీవలి పరిణామాలే. ఏతావాతా... దేశ పర్యావరణ పరిరక్షణకు కీలకమైన సేవ లందిస్తున్న జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల వ్యవహారాల్లో వేలు పెట్టడం ఏ ఒక్కరికీ మంచి చేసే విషయం కాదు. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో అన్ని స్థాయుల్లోనూ ఈ రకమైన ధోరణి పెరిగి పోతోంది. లక్ష్యిత ప్రయోజనాలు ఏమైనప్పటికీ శాస్త్రీయ పరిశోధన లను మాత్రం స్థిరంగా కొనసాగించాలి. దేశ రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులను మినహాయిస్తే మిగిలిన పరిశోధనల వివ రాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. తమ పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు పూర్తి స్వాతంత్య్రం ఉండాలి. అయితే దేశంలో అత్యున్నత విధాన నిర్మాతలైన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌తో పాటు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి సంస్థలు ఈ స్వయం ప్రతిపత్తి విషయంలో మౌనంగా ఉంటున్నాయి. పరిస్థితి చేయి దాటక మునుపే మేలుకోవడం ఎంతైనా అవసరం! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఆ దేశాలతోనే పర్యావరణానికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, భారీగా కర్బన ఉద్గారాల విడుదలకు సంపన్న దేశాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భూమిపైనున్న సహజ వనరుల్ని విపరీతంగా దోపిడీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు ఆ దేశాల నుంచే విడుదల అవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ ప్రమేయాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ , నమామి గంగ, ఒకే సూర్యుడు–ఒకే ఇంథన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని మోదీ తెలిపారు. ముందుగానే లక్ష్యాలను చేరుకున్నాం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ముందే సాధించామని ప్రధాని చెప్పారు. పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని గడువు కంటే అయిదు నెలల ముందే సాధించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని డెడ్‌లైన్ కంటే తొమ్మిదేళ్లు ముందే సాధించామని తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ ద్వారా నేలలో సారం క్షీణించడంపై అవగాహన పెంచడానికి, సారాన్ని మెరుగుపరచడానికి ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని ప్రధాని అభినందించారు. మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ: జగ్గీ వాసుదేవ్ మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ సాధ్యమని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మట్టిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లైఫ్‌స్టైల్ ఉద్యమం ప్రారంభం పర్యావరణహితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉద్దేశించిన లైఫ్‌స్తైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ (లైఫ్) ఉద్యమాన్ని ప్రధాని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతుగా లైఫ్‌స్టైల్ మార్చుకుంటే వారిని ప్రోప్లానెట్ పీపుల్ అని పిలుస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. వాతావరణ మార్పుల నివారణతోపాటు వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ పాత్ర, నాయకత్వం చాలా కీలకమైందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. -
ప్రపంచ పర్యావరణ దినం: ఒక్కటే భూమి..ఒక్కటై కాపాడుకుందాం
భూగోళం వేడెక్కిపోతోంది. వాతావరణంలో కనీవినీ ఎరుగని విపరిణామాలు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న ఆదర్శం కాగితాలకే పరిమితమైంది. పారిస్ ఒప్పందాన్ని అమలు చెయ్యాలన్న పర్యావరణ శాస్త్రవేత్తల పిలుపులు కంఠశోషగానే మిగులుతున్నాయి. ఏడాదికోసారి పర్యావరణ పరిరక్షణ సదస్సులతో సరిపెడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూడటం ఖాయమని, ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు... జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాదితో దీనికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1972లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు స్వీడన్ ఆతిథ్యం ఇచ్చింది. వాతావరణ మార్పులను గమనించి, అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అప్పుడు తొలిసారిగా గుర్తించారు. 1973 నుంచి జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్ ఎర్త్’ థీమ్‌తో ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. గ్రీన్ లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వాలేం చేయాలి? ► పర్యావరణ పరిరక్షణకు అతి ముఖ్యమైన అడవులు, నదులు, సముద్రాలు , తేమ ప్రాంతాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. 1990వ దశకంలో ఏడాదికి 1.6 కోట్ల హెక్టార్ల చొప్పున అడవులను కోల్పోయాం! 2015–2020 మధ్య కూడా ఏటా కోటి హెక్టార్ల చొప్పున తగ్గింది. అడవుల్ని కాపాడుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. ► ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం మాంసాహారం తయారీ, రవాణా వల్ల 18% దాకా కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పశు పెంపకానికి నీటి వాడకమూ పెరుగుతోంది. దీన్ని తగ్గించాలంటే వ్యవసాయ రంగంలో చిన్న కమతాల్ని ప్రోత్సహించాలి. ► ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య 2015–2019 మధ్య 21 నుంచి ఏకంగా 58 శాతానికి పెరిగింది. దీన్నింకా పెంచడానికి దేశాలన్నీ కృషి చేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి వల్ల 35 శాతం ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అందు కే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. సోలార్, విండ్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలివ్వాలి. ► గ్లోబల్ వార్మింగ్‌కు 30 నుంచి 35 శాతం దాకా కారణమవుతున్న బ్లాక్ కార్బన్, మీథేన్, ఓజోన్, హైడ్రో ఫ్లోరో కార్బన్స్ నియంత్రణకు గట్టి విధానాలు రూపొందించాలి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడకుంటే.. ► ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 నుంచి 2 డిగ్రీల దాకా పెరుగుతాయి. అప్పుడు జనాభాలో 14% అత్యంత తీవ్రమైన ఎండ వేడిమికి గురవుతారు. అది క్రమంగా 37 శాతానికి చేరే ప్రమాదముంది. ► 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మెగా నగరాల్లోని 35 కోట్ల మందిని ఎండ వేడి బాధిస్తుంది. నీటి కరువుతో, కాటకాలతో నగర ప్రాంతాలు అల్లాడిపోతాయి. దక్షిణాసియా దేశాలకే ఈ ముప్పు ఎక్కువ. ► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, ఢాకా, కరాచీ నగర వాసులు ఎండతీవ్రతకి గురవుతారు. ► సముద్ర మట్టాలు 24 నుంచి 38 సెంటీమీటర్లు పెరిగి బ్యాంకాక్, జకార్తా, మనీలా నగరాలు మునిగిపోవచ్చు. ► 2050 నాటికి సగం జనాభాకు మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ ముప్పుంటుంది. అస్తమా వంటి వ్యాధులు పెరిగిపోతాయి. ► కీటకాలు, మొక్కలు, జంతువుల ఆవాస ప్రాం తాలు సగానికి తగ్గి జీవ వైవిధ్యం నశిస్తుంది. మనం చేయాల్సిందేమిటి? ► ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల బదులు రీ యూజబుల్ బ్యాగులు వాడాలి. ► కాగితం వాడకాన్ని తగ్గించాలి. అత్యవసరమైతే తప్ప ప్రింట్లు తీయొద్దు. ► వారానికి ఒక్క రోజన్నా శాకాహారమే తినాలి. వీగన్ డైట్ ద్వారా కర్బన్ ఉద్గారాలను 73 శాతం తగ్గించవచ్చు. ► కారు బదులు బైక్ వాడితే కిలోమీటర్‌కు 250 గ్రాముల కర్బన్ ఉద్గారాలను కట్టడి చయగలం. ► ఇంట్లో నీళ్ల పైపుల లీకేజీని ఎప్పటికప్పుడు సరి చేస్తే కోట్లాది గాలన్ల నీరు ఆదా అవుతుంది. ► ఇళ్లల్లో ఫ్లోరోసెంట్ బల్బులు వాడితే 75% కరెంటు ఆదా అవుతుంది. ► రీ యూజబుల్ కరోనా మాస్కులు వాడాలి. యూజ్ అండ్ త్రో మాస్కులతో జంతుజాలానికి ఎనలేని హాని జరుగుతోంది. ► డిటర్జెంట్స్, వాషింగ్, లిక్విడ్ సోపుల్లో కనిపించని ప్లాస్టిక్ కణాలుంటాయి. నేచరల్ ప్రొడక్టులు వాడటం మేలు. ► ఇంటా బయటా అందరూ పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: వాతావరణ మార్పుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ‘క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్’ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడారు. కాప్–26 సదస్సు నిరాశ పరిచిందని, పర్యావరణవాదుల ఆశలను నీరుగార్చిందని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ పాలసీ నిపుణుడు దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో రసాయన ఎరువులను వాడటం వల్ల, భూమిలో కర్బన శాతం పెరిగి, ఆహార పంటల్లో పోషక విలువలు తగ్గుతున్నాయని చెప్పారు. దీంతో మనిషి జీవన ప్రమాణ రేటు తక్కువగా ఉంటుందన్నారు. తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలపై రైతులు దృష్టి సారించాలని, వర్షాధార పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల జీవనశైలి, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. గ్లాస్గో నగరంలో నిర్వహిస్తున్న కాప్–26 సదస్సులో చర్చించిన అంశాలను, క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకుపోవాలనే లక్ష్యంతో స్థానిక ఎర్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీజీఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతీఒక్కరు కనీసం ఐదు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయిభాస్కర్రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, ధర్మసేవ ట్రస్ట్ చైర్మన్ నిశాంత్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వికాస్, నాగరాజు, అర్చన, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, సిటీ కాలేజీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
పచ్చందనమే పచ్చదనమే... తారలు ఏమంటున్నారంటే?
పర్యావరణాన్ని పరిరక్షించేది చెట్లే... చుట్టూ పచ్చని చెట్లు ఉంటే ఆహ్లాదానికి ఆహ్లాదం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పచ్చందమనే పచ్చదనమే.. అంటూ ఉల్లాసంగా ఉండొచ్చు. శనివారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు ప్రముఖ తారలు. ‘‘పర్యావరణం రోజు రోజుకు మరింత నాశనం అవుతోంది. ఈ సందర్భంగా పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించడానికి ఈరోజు అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన భూ గ్రహాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం’’ అని పేర్కొన్నారు మహేశ్‌బాబు. హీరో అల్లు అర్జున్ తన ఇంటి వద్ద మొక్కను నాటి, నీళ్లు పోస్తున్న ఫొటోని ట్విట్టర్లో షేర్ చేసి, ‘‘భూమిని రక్షించుకునేందుకు మనందరం మొక్కలు నాటుదామని, పర్యావరణాన్ని కలుషితం చేయని అలవాట్లను అలవరుచుకుంటామని, భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనంగా మార్చుదామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం’’ అన్నారు. ‘‘మనకు ఉన్న ఏకైక ఇల్లు భూమి. అలాంటి భూమిని నాశనం చేయడం ఆపేసి బాగు చేయడానికి సమయం కేటాయిద్దాం.. మనందరం చేతులు కలిపి మన ఇంటిని రక్షించుకుందాం’’ అని పోస్ట్ చేశారు సాయి తేజ్. ‘‘ప్రకృతి చేతుల్లోనే మనందరి ఆనందం, శాంతి దాగి ఉన్నాయి. అందుకే ప్రకృతిని సంరక్షించుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి చాలా మాట్లాడుకుంటాం. అయితే ఆ ఒక్కరోజే కాదు.. ప్రకృతి పట్ల ప్రతిరోజూ మనందరం బాధ్యతగా ఉందాం’’ అన్నారు రాశీ ఖన్నా. -
International Day for Biological Diversity: జీవవైవిధ్య దినోత్సవం
సిరికొండ: సూక్ష్మజీవుల నంచి క్రిమికీటకాల వరకు వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్ని పరస్పర జీవనం గడపడమే జీవవైవిధ్యం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మానవుడు తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. సంరక్షణ మాట మరిచి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేయడం, విరివిగా రసాయనాల వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతు జీవవైవిధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణలో ఆహార గొలుసు చెడిపోకుండా 2002లో జీవవైవిధ్య చట్టం అమలులోకి వచ్చింది. దశాబ్దం తర్వాత 2014లో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ బోర్డు ఆరంభశూరత్వంలా మారింది. గ్రామ, మండల జీవవైవిధ్య కమిటీల ఏర్పాటు సాగుతూనే ఉండటం, జిల్లాల్లో తగినంత సిబ్బందిని నియమించకపోవడం, కమిటీలు ఏర్పాటైన సభ్యులకు సరైన శిక్షణ లేకపోవడం, నిధుల ఖర్చుపై ఆడిట్ లేకపోవడం సమస్యలుగా మారాయి. పేరుకు కమిటీలు.. ఉమ్మడి జిల్లాలో జీవవైవిధ్య అమలు కోసం ఇద్దరు సమన్వయకర్తలు ఉండాలి. ఒక్కరే ఉన్నారు. ఉమ్మ డి జిల్లాలో 51 మండలాలకు నాలుగు మండలాల్లో 1056 గ్రామ పంచాయతీలకు 219 గ్రామాలలో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు పథకం అమలు, జీవవైవిధ్య సంరక్షణపై తగిన శిక్షణ ఇవ్వాలి. వారసత్వ సంపదలైన వృక్షా లు, జంతువులు, పవిత్రవనాలు, జలాశయాలు, వారసత్వ కట్టడాలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిపై అవగాహన కలి్పంచాలి. కానీ గడిచిన ఏడెండ్లలో జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో తగిన శిక్షణ లేక కమిటీల పనితీరు నామమాత్రంగా మారింది. ప్రతి జిల్లాలో జీవవైవిధ్య కమిటీలకు రెండు దశల్లో నిధులు ఇవ్వాలని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా గ్రామ జీవవైవిధ్య కమిటీకి రూ.1.50 లక్షలు, మండల కమిటీకి రూ.1.50 లక్షలు, జిల్లా కమిటీకి రూ.2.30 లక్షలు ఇవ్వాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 24 గ్రామ పంచాయతీలకు రూ. 8.80 లక్షలు విడుదల అయ్యాయి. వీటిలో కార్యాలయ ఏర్పాటు అవసరమైన రికార్డులు ఫరీ్నచర్ కొనుగోలు క్షేత్ర స్థాయి పరిశోధనలకు కేటాయించాలి. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో వీటి ఏర్పాటు లేకుండానే నిధులు స్వాహ అయ్యాయి. సరైన ఆడిట్ లేనందువల్ల గత సర్పంచుల హయాంలో నిధులకు లెక్కలేకుండా పోయాయి. మిగతా నిధులు విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. దెబ్బతింటున్న జీవవైవిధ్యం ప్రకృతిలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో హనికరమైన వైరస్లు విజృంభిస్తున్నాయి. గడిచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 20 వేల జాతుల జీవులు వైరస్‌లతో అంతరించిపోయాయి. మానవుల తప్పిదాలతో 75 శాతం మేర జన్యుజీవవైవిధ్య పంటలు కనుమరుగయ్యాయి. 24 శాతం క్షీరదాలు, 12 శాతం పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. -
దిశా రవికి ఒక రోజు పోలీసు కస్టడీ
న్యూఢిల్లీ: ‘టూల్ కిట్’ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన పర్యావరణ పరిరక్షణ మహిళా కార్యకర్త దిశా రవిని ఒక రోజు పోలీసు కస్టడీకి సోమవారం ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు అనుమతించింది. ఇతర నిందితులతో కలిపి ఆమెను విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరడంతో మెజిస్ట్రేట్ పంకజ్ శర్మ ఈ ఆదేశాలిచ్చారు. అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన కేసు ఇదని పోలీసులు కోర్టుకు తెలిపారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందిన టూల్ కిట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సంబంధించి దిశా రవితో పాటు నికిత జాకోబ్, శంతను ములుక్‌లపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎవరితో కలిపి తనను విచారించాలని పోలీసులు చెబుతున్నారో.. ఆ సహనిందితులు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని, పోలీసు కస్టడీలో లేరని, అలాంటప్పుడు తన కస్టడీని పోలీసులు ఎలా కోరుతారని దిశా రవి మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువచ్చారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉంచి కూడా సహ నిందితులతో కలిపి తనను విచారించే అవకాశం ఉందని వాదించారు. మరోవైపు, దిశా రవి బెయిల్ పిటిషన్ సెషన్స్ కోర్టులో పెండింగ్‌లో ఉందని, మంగళవారం దానిపై తీర్పు వెలువడనుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
భారత్‌పై ట్రంప్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్‌పై నోరు పారేసుకున్నారు. చైనా, రష్యాలతో కలిసి భారత్ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. నార్త్ కరోలినాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. తన నేతృత్వంలో అమెరికా ఇంధన స్వయం సమృద్ధి సాధించిందని చెప్పారు. ‘‘ మన పర్యావరణ, ఓజోన్ ఇతర గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. మరోవైపు ఇండియా, చైనా, రష్యాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి’’ అని ఆయన ర్యాలీలో ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్ డీల్ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ 2017లో ప్రకటించారు. ఈ డీల్‌తో తమకు కోట్లాది డాలర్ల వ్యయం అవుతుందని, పలు ఉద్యోగాలు పోతాయని అప్పట్లో ట్రంప్ విమర్శించారు. అవకాశం వచ్చినప్పుడల్లా పర్యావరణం విషయంలో చైనాతో పాటు భారత్‌పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పారిస్ డీల్‌తో ఈ రెండు దేశాలకు బాగా మేలు జరుగుతుందని, యూఎస్‌కు ఏమీ ఉపయోగం ఉండదని ఆయన విమర్శించారు. తాజాగా ఇదే అక్కసును మరోమారు వెలిబుచ్చారు. పేపర్ వాడకంపై ఎద్దేవా పర్యావరణాన్ని రక్షించే క్రమంలో ప్లాస్టిక్ వాడకం తగ్గించి దాని బదులు పేపర్ వాడకం జరపాలన్న వాదనను ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇలాంటి సూచనలిచ్చేవాళ్లను ‘క్రేజీ’అంటూ ఎగతాళి చేశారు. అమెరికాలో స్వదేశీయులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. స్వదేశీయులను కాదని విదేశీయులతో ఉద్యోగాలు నింపినందుకు టెన్నెసీ వాలీ అథార్టీ చైర్మన్‌ను తాను తొలగించినట్లు చెప్పకొచ్చారు. అక్రమవలసదారులకు పౌరసత్వ కల్పిస్తానన్న బైడెన్ వ్యాఖ్యలను ఆయన దుయ్యబట్టారు.