మాదాపూర్ (హైదరాబాద్): పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ బిల్డింగ్ మూవ్‌మెంట్ 2001 నుంచి ప్రారంభమైందని, దాని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) గ్రీన్ ప్రాపర్టీ షో–2023ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలోనే మొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్‌హోమ్స్, గ్రీన్ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, ఫ్యాక్టరీ బిల్డింగ్‌లు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో గ్రీన్ ఫుట్‌ప్రింట్స్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ పార్కులు ఐజీబీసీ ప్రమాణాలతో ఉండేలా చూస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియేట్, టీహబ్, టీవర్క్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 33 జిల్లాల్లోని నూతన కలెక్టరేట్ భవనాలు, ప్రతి జిల్లాలో ఆస్పత్రులు, హెల్త్‌కేర్ క్యాంపస్‌లు గ్రీన్ సర్టిఫికేషన్‌కు లోబడి ఉన్నాయని చెప్పారు. భవనాలే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి పట్టణాలు ఐజీబీసీ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో హరితహారం 24 శాతం నుంచి 33 శాతానికి పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఏఐపీహెచ్ గ్రీన్‌సిటీ అవార్డు హైదరాబాద్‌కి దక్కిందని చెప్పారు.
ఎనిమిదేళ్లలో 2.60 కోట్ల మొక్కలు
పట్టణాలు, గ్రామాలకు కేటాయించిన బడ్జెట్‌లో 10 శాతం పచ్చదన పరిరక్షణకు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. గత 8 సంవత్సరాలలో 2.60 కోట్ల మొక్కలు నాటామని, వాటిలో కనీసం 85 శాతం మొక్కలను రక్షించే విధంగా కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు. గ్రామాలలో కూడా ఎల్‌ఈడీ లైట్లను అమర్చినట్టు తెలిపారు. వరంగల్‌లోని గంగాదేవి పల్లి గ్రామానికి గ్రీన్ విలేజ్ రేటింగ్‌లో ప్లాటినం అవార్డు వచ్చిందని చెప్పారు.
అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి
తెలంగాణలోని అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ది వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ జవహర్‌నగర్‌లో ఉంది. బిల్డర్లు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీచార్జి వంటి నాలుగు సూత్రాలను పాటించి గృహ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. సీఐఐ (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) తెలంగాణ చైర్మన్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment