IGBC
-
అలాంటి ఇళ్లు కొనేవారికి ఎస్బీఐ ఆఫర్.. తక్కువ వడ్డీ రేటుకు లోన్
సాక్షి, సిటీబ్యూరో: హరిత భవనాలను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒకడుగు ముందుకేసింది. సాధారణ గృహ రుణ గ్రహీతలతో పోలిస్తే హరిత గృహ కొనుగోలుదారులు 5 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందుకోవచ్చని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ జీఎం, బ్రాంచ్ హెడ్ రాజేష్ కుమార్ తెలిపారు. అంటే ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేటు 8.50 శాతంగా ఉండగా.. హరిత గృహ రుణాలకు వడ్డీ రేటు 0.05 శాతం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే వడ్డీ రేటు 8.45 శాతంగా పడుతుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 527 ప్రాజెక్ట్ డెవలపర్లతో ఎస్బీఐ గృహ రుణ ఒప్పందం చేసుకుందని.. ఇందులో 75 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ పొందిన ప్రాజెక్ట్లేనని తెలిపారు. అపర్ణా, రాజపుష్ప, మైహోం, గిరిధారి, వాసవి, పౌలోమి, ప్రణవ వంటి నిర్మాణ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్ దేశవ్యాప్తంగా ఎస్బీఐ పోర్ట్‌ఫోలియో రూ.6.5 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో హైదరాబాద్ వాటా రూ.55 వేల కోట్లని చెప్పారు. 2022–23 ఆర్ధిక సంవత్సరంలో నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున రూ.12 వేల కోట్ల గృహ రుణాలు అందించామని.. ప్రస్తుతం నెలకు రూ.1,500 కోట్ల రుణాల చొప్పున రూ.16–18 వేల కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. -
తెలంగాణలో అంతా ‘గ్రీన్’!
మాదాపూర్ (హైదరాబాద్): పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ బిల్డింగ్ మూవ్మెంట్ 2001 నుంచి ప్రారంభమైందని, దాని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) గ్రీన్ ప్రాపర్టీ షో–2023ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలోనే మొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్‌హోమ్స్, గ్రీన్ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, ఫ్యాక్టరీ బిల్డింగ్లు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో గ్రీన్ ఫుట్‌ప్రింట్స్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ పార్కులు ఐజీబీసీ ప్రమాణాలతో ఉండేలా చూస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియేట్, టీహబ్, టీవర్క్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 33 జిల్లాల్లోని నూతన కలెక్టరేట్ భవనాలు, ప్రతి జిల్లాలో ఆస్పత్రులు, హెల్త్‌కేర్ క్యాంపస్‌లు గ్రీన్ సర్టిఫికేషన్‌కు లోబడి ఉన్నాయని చెప్పారు. భవనాలే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి పట్టణాలు ఐజీబీసీ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో హరితహారం 24 శాతం నుంచి 33 శాతానికి పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఏఐపీహెచ్ గ్రీన్‌సిటీ అవార్డు హైదరాబాద్‌కి దక్కిందని చెప్పారు. ఎనిమిదేళ్లలో 2.60 కోట్ల మొక్కలు పట్టణాలు, గ్రామాలకు కేటాయించిన బడ్జెట్లో 10 శాతం పచ్చదన పరిరక్షణకు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. గత 8 సంవత్సరాలలో 2.60 కోట్ల మొక్కలు నాటామని, వాటిలో కనీసం 85 శాతం మొక్కలను రక్షించే విధంగా కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు. గ్రామాలలో కూడా ఎల్ఈడీ లైట్లను అమర్చినట్టు తెలిపారు. వరంగల్‌లోని గంగాదేవి పల్లి గ్రామానికి గ్రీన్ విలేజ్ రేటింగ్‌లో ప్లాటినం అవార్డు వచ్చిందని చెప్పారు. అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి తెలంగాణలోని అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ది వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జవహర్‌నగర్‌లో ఉంది. బిల్డర్లు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీచార్జి వంటి నాలుగు సూత్రాలను పాటించి గృహ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. సీఐఐ (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) తెలంగాణ చైర్మన్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ చాంపియన్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక సంస్థ ‘ది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ (ఐజీబీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ చాంపియన్ అవార్డును అందజేసింది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈనెల 20 నుంచి శనివారం వరకు ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2022’ సదస్సు జరిగింది. ఇందులో కౌన్సిల్ ప్రతినిధులు ప్రభుత్వ ఎంఏయూడీ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. గ్రీన్ బిల్డింగ్ ఫుట్‌ప్రింట్‌లోనూ ఇంధన పొదుపును పాటించడంలోనూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది. కూల్ రూఫింగ్ పాలసీని అవలంభిస్తూ విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గించింది. కాగా, గ్రీన్బిల్డింగ్ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ‘గ్రీన్ బిల్డింగ్’ నిబంధనలతో పారిశ్రామికవాడలు రాష్ట్రంలో హరిత పారిశ్రామికవాడల ఏర్పాటుకు ఐజీబీసీతో తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతు ల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) శనివారం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్బిల్డింగ్ కాంగ్రెస్–2022 జాతీయ సదస్సులో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. టీఎస్ఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో గ్రీన్ బిల్డింగ్ విధానాలు, గ్రీన్ సిటీస్ ఏర్పాటును ప్రోత్స హించేందుకు ఐజీబీసీతో కుదిరిన ఒప్పందం దోహదం చేస్తుందని నర్సింహారెడ్డి వెల్లడించారు. 40 కొత్త పారిశ్రామికవాడలను రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో ఐజీబీసీ నేషనల్ చైర్మన్ గుర్మిత్‌సింగ్ అరోరా, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ సీఈ శ్యాంసుందర్ పాల్గొన్నారు. -
నాచారంలో రహేజా విస్తాస్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ కె రహేజా కార్ప్ హైదరాబాద్‌లో మరో టవర్‌ను ప్రారంభించింది. నాచారంలో రహేజా విస్తాస్‌లో ఇప్పటికే 3 టవర్లను నిర్మించి, విక్రయించేసింది. తాజాగా నాల్గో టవర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 12 అంతస్తుల ఈ నిర్మాణంలో 2, 3 పడక గదుల గృహాలుంటాయి. ప్రారంభ ధర రూ.40 లక్షలు. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు పొందింది. -
ఈ ఏడాది ఏపీలోకి అపర్ణా ప్రాజెక్ట్స్
35 లక్షల చదరపు అడుగుల్లో రెండు ప్రాజెక్టులు అపర్ణా సరోవర్ గ్రాండ్‌కు ఐజీబీసీ ప్లాటినం గుర్తింపు అపర్ణా కన్ స్ట్రక్షన్స్ డెరైక్టర్ డీఎస్ ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగు పెడుతోంది. ఈ ఏడాది ముగిసేనాటికి విజయవాడ-గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీకి చేరువలో 35 లక్షల చదరపు అడుగుల్లో రెండు భారీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సంస్థ డెరైక్టర్ డి.ఎస్.ప్రసాద్ చెప్పారు. హైదరాబాద్‌లోని నల్లగండ్లలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న అపర్ణా సరోవర్ గ్రాండ్ ప్రాజెక్టుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా శనివారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘అపర్ణా సంస్థను 1996లో ప్రారంభించాం. 2001 నుంచి రియల్టీ మార్కెట్లో క్రియాశీలంగా ఉన్నాం. గత 15 ఏళ్లుగా నగరంలో విభిన్న ప్రాజెక్టులతో అందుబాటు ధరల్లో కొనుగోలుదారుల సొంతింటి కలను నెరవేర్చాం’’ అంటూ సంస్థ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 1.5 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 40 ప్రాజెక్టులను పూర్తి చేశామని, ఇంకో కోటి చ.అ. విస్తీర్ణంలో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలియజేశారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ, తెలంగాణ, బెంగళూరుల్లో 3-4 కోట్ల చ.అ.ల్లో భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ‘‘శిక్షణ పొందిన నిపుణుల కొరత ప్రస్తుతం నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కానీ ఈ విషయంలో మాకైతే ఎలాంటి ఇబ్బందీలేదు. మా సంస్థలో ప్రత్యక్షంగా 1,200 మంది ఉద్యోగులు, 6,000 మంది రోజువారీ కూలీలు ఉపాధి పొందుతున్నారు. వీరంతా సుశిక్షితులే. అందుకే గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేసి కొనుగోలుదారులకు అందించగలుగుతున్నాం. ఇదే మా విజయ రహస్యం’’ అని ప్రసాద్ వివరించారు. గ్రీన్ బిల్డింగ్స్‌కు ఆదరణ: రాజన్న ఐదేళ్లుగా దేశంలో హరిత భవనాల సంఖ్య పెరుగుతూ వస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)-తెలంగాణ వైస్ చైర్మన్ వి.రాజన్న చెప్పారు. కొనుగోలుదారుల్లోనూ వీటిపై అవగాహన పెరిగిందన్నారు. ‘‘హరిత భవనాల విషయంలో ప్రపంచంలో మనది రెండో స్థానం. ప్రస్తుతం దేశంలో 360 కోట్ల చ.అ. విస్తీర్ణంలో సుమారు 3,600 ప్రాజెక్టులు ఐజీబీసీ గుర్తింపు పొందాయి. 2022 నాటికల్లా ఇది 1,000 కోట్ల చ.అ.కు చేరుతుంది. దాంతో ప్రపంచంలో నంబర్‌వన్ స్థానానికి చేరతాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణానికి 3-5 శాతం మాత్రమే ఎక్కువ వ్యయం అవుతుందని సీఐఐ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రఘుపతి చెప్పారు. కరెంటు, నీటి బిల్లులు తదితరాల్లో తగ్గుదల ద్వారా ఈ వ్యయం రెండేళ్లలో తిరిగొస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐజీబీసీకి 20 చాప్టర్లున్నాయని.. ఈ సంవత్సరాంతానికి మరో 20 చాప్టర్లను ప్రారంభించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో అపర్ణా వైస్ ప్రెసిడెంట్ కేవీకే రాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కటి నాలుగేళ్లుగా దేశంలో అపార్ట్మెంట్ల విభాగంలో ప్లాటినం రే టింగ్ పొందిన ప్రాజెక్టులు ఏడే. వాటిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ గుర్తింపు దక్కింది ఒక్క అపర్ణా సరోవర్ గ్రాండ్ ప్రాజెక్టుకే. ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థలం ఎంపిక నుంచి, ప్లానింగ్, నీరు, విద్యుత్ పునర్వినియోగం, నిర్మాణ సామగ్రి వాడకం, ఇండోర్, ఔట్‌డోర్ వసతుల వంటి ప్రతి విభాగంలోనూ ఐజీబీసీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరీ ఈ గుర్తింపునిస్తారు. మొత్తం వంద మార్కులకు గాను సరోవర్కు 81 మార్కులొచ్చాయి.