కోదండరెడ్డి.. ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకున్నారా?: కేటీఆర్‌ | BRS KTR Satirical Comments On Congress Party | Sakshi
Sakshi News home page

కోదండరెడ్డి.. ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకున్నారా?: కేటీఆర్‌

Feb 22 2025 8:38 AM | Updated on Feb 22 2025 10:10 AM

BRS KTR Satirical Comments On Congress Party

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరం అంటూ కేటీఆర్‌ కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌(KTR) ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ నేత కోదండరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల వచ్చిన కరువు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో  భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఏనాడూ భూగర్భజలాలు పడిపోలేదు. కానీ, కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి సమైక్యరాష్ట్రం నాటి దుస్థితి నెలకొంది.

రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడిపోయాయనడం దారుణం. కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం మరో విడ్డూరం.

అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం అన్నదాతలను వంచించడమే. ఎండుతున్న పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను మరిచి, మా వల్ల కాదని కాదు.. మీరే కాపాడుకోండని జారుకోవడం క్షమించరాని నేరం. మీ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కరువు కాటకాలు రావడం సహజం అన్నట్టుగా మాట్లాడి, కాంగ్రెస్ సృష్టించిన  ఈ సాగునీటి సంక్షోభం నుంచి తప్పించుకోలేరు.

ఇప్పటికే వ్యవసాయరంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక లక్షలాది మంది రైతులు అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పంటలకు సాగునీటి వసతి లేకపోవడంతో బోర్లు వేసినా చుక్కనీరు రాక మరింత ఆర్థికంగా చితికిపోతున్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న రాష్ట్ర రైతాంగంలో భరోసా నింపాల్సిన పాలకులే అస్త్రసన్యాసం  చేసిన సందర్భం దేశ చరిత్రలోనే లేదు. పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యం చేసినందుకు రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి.

రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మత్తులను వెంటనే పూర్తిచేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని ఎప్పటికీ క్షమించరు. జై కిసాన్.. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement