
ట్రేడ్ లైసెన్స్ లేదని మూసివేయించిన అధికారులు
సిరిసిల్ల టౌన్/హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘కేటీఆర్ టీస్టాల్’ను అధికారులు మూసివేయించడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్‌లైసెన్స్ లేకపోవడంతోనే మూసివేయించామని అధికారులు పేర్కొంటుండగా.. కేటీఆర్ పేరుతో టీస్టాల్ నిర్వహిస్తుండటంతో అధికారులు ఉద్దేశపూర్వకంగా మూసివేయించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
బుధవారం జిల్లా కేంద్రం మానేరుతీరంలోని మార్కెట్ కాంప్లెక్స్, బతుకమ్మఘాట్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. మడేలేశ్వర ఆలయం ఎదుట రెండు మున్సిపల్ టేలాల్లో టీస్టాల్స్ ఉండగా.. అందులో ఒకటి కేటీఆర్ టీస్టాల్ పేరుతో బత్తుల శ్రీనివాస్ దంపతులు నడిపిస్తున్నారు. కలెక్టర్ పర్యటనలో భాగంగా ఆ టీస్టాల్స్‌కు అనుమతులున్నాయా? అంటూ ఆరా తీస్తూనే ఒకవేళ లేకపోతే మూసివేయాలని మున్సిపల్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు.
విషయం తెలుసుకున్న శ్రీనివాస్ దంపతులు గుండెలు బాదుకుంటూ.. లైసెన్సు తీసుకోవాలని తమకు తెలియదని, అదేంటో చెబితే వెంటనే తీసుకుంటామని అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా కలెక్టర్ ఆదేశించారని పేర్కొంటూ టీ స్టాల్ మూసివేయించారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, కత్తెర వరుణ్, దార్ల సందీప్, గెంట్యాల శ్రీనివాస్, సబ్బని హరీశ్ ఆందోళన చేపట్టారు.
ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నా.. ఎవర్నీ వదలను
సిరిసిల్లలో జరిగిన ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ‘చిరువ్యాపారిపై కలెక్టర్ అనుచిత ప్రతాపం చూపించారు. ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నా.. ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదు. ఇదే మాట మీద ఉంటానని మీకు మాట ఇస్తున్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేర కు టీ షాపు యజమాని బి.శ్రీనివాస్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment