
ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాల్లేకుండా తనపై ముషీరాబా ద్, బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. 2023, నవంబర్ 27న ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ అప్పటి ముషీరాబాద్ ఏఎస్‌ఐ ఆర్.ప్రేమ్‌కుమార్ ఫిర్యాదు చేశారన్నారు.
అయితే, ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నామని, బాణాసంచాతో ఇబ్బందులు పడినట్లు ఎవరూ ఫిర్యాదు చేయ లేదని చెప్పారు. ఫిర్యాదుదారులు.. సాక్షులు ఇద్దరూ పోలీసులేనన్నారు. సరైన దర్యాప్తు చేయకుండానే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని.. కేసులను కొట్టేయాలని కోరారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కేటీఆర్‌తో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా ఉన్నారు.
అలాగే, కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి వసూలు చేసిన రూ.2,500 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పంపారంటూ 2024, మార్చి 27న కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.శ్రీనివాసరావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఒకట్రెండు రోజుల్లో జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment