పర్యావరణ పరిరక్షణ, ఇంధన సంరక్షణ లక్ష్యంగా బీఈఈ అడుగులు
గత ప్రభుత్వంలో విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, కర్నూలు ఎంపిక
ఇప్పుడు రాజమహేంద్రవరంపైనా బీఈఈ దృష్టి
ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన
‘మిషన్ లైఫ్’తో పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వృద్ధి, గ్రీన్ జాబ్స్ సృష్టించవచ్చని అంచనా
సాక్షి, అమరావతి: వాతావరణంలో జరుగుతున్న అనూహ్య మార్పులు మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణం పూర్తిగా దెబ్బతిని భావితరాలు భూమిపై మనుగడ సాగించడమే కష్టమయ్యే అవకాశముంది.
అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. నీరు, ఇంధనం తదితరాలన్నీ పొదుపుగా వినియోగించాలి. ప్లాస్టిక్‌ను విడనాడాలి.. కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ‘మిషన్ లైఫ్’కు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి పలు నగరాలు ఎంపికవ్వగా.. అందులో రాజమహేంద్రవరం కూడా చేరింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కృషితో..
భావితరాలకు ఇంధన వనరులను అందించడం కోసం.. పర్యావరణంలోని కర్బన ఉద్గారాలను తగ్గించి ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. బీఈఈ నేతృత్వంలో జరిగే ‘మిషన్ లైఫ్’ కార్యక్రమాలకు చేయూతనందించింది.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇంధన సంరక్షణ, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విడనాడడం, మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితం, చెత్త, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేసేందుకు బీఈఈ శ్రీకారం చుట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కర్నూలు నగరాలను బీఈఈ ఎంపిక చేసుకుంది. ఆ క్రమంలో రాజమహేంద్రవరంపైనా బీఈఈ దృష్టి సారించింది.
విస్తృత ప్రచారం..
మిషన్ లైఫ్‌లో భాగంగా విస్తృత ప్రచారం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటు చేయడం, సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై ప్రత్యేక డ్రైవ్‌లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్‌షాప్‌లు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్‌లను బీఈఈ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, వలంటీర్ల ద్వారా.. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజిన్‌లను ఆపివేసేలా ప్రత్యేక ప్రచారం, కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక డ్రైవ్‌లను చేపడుతోంది.
స్కూళ్లల్లో ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించేలా కృషి చేస్తోంది. దీని కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(సీసీసీ)ను రూపొందించింది. ఇందులో నిపుణులు, విద్యుత్ పంపిణీ సంస్థలు, మునిసిపల్, పట్టణాభివృద్ధి, రవాణా తదితర విభాగాలను భాగస్వాములను చేసింది. ఈ సెల్ వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంటుంది.
వంద కోట్ల మందికి భాగస్వామ్యమే లక్ష్యం
మిషన్ లైఫ్‌కు ఏపీలోని ఆరు నగరాలను ఎంపిక చేసుకున్నాం. ప్రజలు, వివిధ సంఘాలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నాం. తద్వారా రాష్ట్రంలో పర్యావరణ క్షీణతను అధిగమించడంతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం గ్రీన్ జాబ్స్ సృష్టించవచ్చని అంచనా వేస్తున్నాం. 2027–28 నాటికి వంద కోట్ల మంది భారతీయుల్ని మిషన్‌లైఫ్‌లో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – మిలింద్ దేవ్‌రా, బీఈఈ కార్యదర్శి
మనం మారితేనే..
» ట్రాఫిక్ లైట్లు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాల ఇంజన్‌లను ఆపితే ఏటా దాదాపు 22.5 బిలియన్ కిలోవాట్స్ ఇంధనం ఆదా చేయొచ్చు.
» షాపింగ్‌లకు క్లాత్ బ్యాగులను వినియోగిస్తే 375 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా నివారించవచ్చు.
» వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేయడం వల్ల 15 బిలియన్ టన్నుల ఆహారం వృథా కాదు.
» నీటి కుళాయిలను సకాలంలో ఆపివేయడం వల్ల 9 ట్రిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయొచ్చు.
» పని చేయని ఎలా్రక్టానిక్ గాడ్జెట్‌లను రీసైకిల్ చేయడం ద్వారా 0.75 మిలియన్ టన్నుల ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయొచ్చు.
» ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం, ఎల్రక్టానిక్ పరికరాలను ఇంధన పొదుపు మోడ్‌లో వాడడం, తక్కువ నీటిని వినియోగించే పంటలు వేయడం, గ్రామీణ నీటి వనరుల రీచార్జ్‌ను ప్రోత్సహించడం, ఎల్‌ఈడీ లైట్లను వినియోగించడం, ప్రజా రవాణా తదితర మంచి విధానాలను ఉపయోగిస్తే.. మిషన్ లైఫ్ లక్ష్యాలను చేరుకోవచ్చు.
» బీఈఈ ఇంధన సామర్థ్య పథకాలు, కార్యక్రమాల ద్వారా.. 2022–23లో 307 బిలియన్ యూనిట్ల విద్యుత్, 24.68 మిలియన్ టన్నుల చమురు సమానమైన థర్మల్ శక్తితో సహా సుమారు 306.40 మిలియన్ టన్నుల ఉద్గారాల్ని తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment