
ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి మల్లగుల్లాలు
జనసేన రెండు సీట్లు కోరుతున్నట్లు ప్రచారం
ఒకటి ఇప్పటికే నాగబాబుకు ఖరారు
మరొకటి కూడా కావాలంటున్న పవన్ కళ్యాణ్
ఇంకొకటి బీజేపీకి వదిలేయక తప్పని పరిస్థితి
ఇక టీడీపీకి మిగిలేది రెండే స్థానాలు
అవకాశం ఇవ్వాలని సీనియర్లు, సీటు దక్కని నేతల వేడుకోళ్లు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెలాఖరులో ఖాళీ అవుతున్న ఐదు సీట్లను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ స్థానాలను ఆశిస్తున్న నేతలు.. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి చేరుకుని ముఖ్యులను కలిసి తమ వాదన వినిపిస్తున్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సోమవారం సభ ముగిసిన తర్వాత ఇదే అంశంపై చర్చించిన విషయం బయటకు పొక్కడంతో ఆశావహుల్లో ఉత్కంఠత పెరిగింది. ఇప్పటికే ఒక స్థానం పవన్ సోదరుడు నాగబాబుకు దాదాపు ఖరారైంది. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవడం లాంఛనమే.
కూటమిలో రెండు నెలల క్రితం జరిగిన ఒప్పందం ప్రకారం నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తున్నారు. అయితే, జనసేన కోసం పనిచేసిన చాలామంది పదవులు కోరుతున్నారని వారికోసం మరో ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలని చంద్రబాబును పవన్‌కళ్యాణ్ కోరినట్లు జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఒక స్థానం కోసం బీజేపీ పట్టు..
బీజేపీ కూడా కచ్చితంగా ఒక స్థానం ఇవ్వాలని పట్టుబడుతోంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, పీఎన్‌వీ మాధవ్‌ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యాయంగా అయితే సోము వీర్రాజుకు అవకాశం దక్కాల్సివున్నా.. టీడీపీ పట్ల ఆయన వైఖరి కారణంగా చంద్రబాబు సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. బీజేపీకి ఒక స్థానం ఇస్తే మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు.
టీడీపీలో ఆశావహుల జాబితా చాంతాడంత..
జనసేన, బీజేపీ కోరిక మేరకు మూడు స్థానాలు వారికి పోతే టీడీపీకి మిగిలేది రెండే. ఆ పార్టీలో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. చంద్రబాబు సమకాలీకులు, ఆయనతో కలిసి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారితో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు దక్కని నేతలు గట్టిగా అడుగుతున్నారు. ఈ జాబితాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నేత బుద్ధా వెంకన్న, నెల్లూరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జి.మాడుగుల నాయకుడు పైలా ప్రసాదరావు, నెల్లిమర్ల నేత, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు తదితరులు గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు.
మంగళవారం అసెంబ్లీలో చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బుద్ధా, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, సిట్టింగ్ ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు తదితరులు కలిశారు. కొద్దిరోజులుగా పలువురు నేతలు చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇలాంటివారు 25 మందికిపైగా ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది లోకేశ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పరిశీలనలో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలినవారి పేర్లు ఇంకా బయటకు రాలేదు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment