ఇంధన పరిరక్షణపై కార్యక్రమాలు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరిన బీఈఈ
కలిసి పనిచేసేందుకు సన్నద్ధమవుతున్న ఏపీఎస్‌ఈసీఎం
సాక్షి, అమరావతి: భవిష్యత్ తరాల కోసం ఇంధన పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఇకపైనా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం బీఈఈతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి విద్యుత్ ఆదా చర్యలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) సన్నద్ధం అవుతోంది.
ఈ క్రమంలోనే బీఈఈ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి, ఏపీఎస్‌ఈసీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.ఎ.వి.పి. కుమార రెడ్డి, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఈ రెండు విభాగాల అధికారులు ప్రత్యేకంగా సమావేశమై విధి విధానాలపై తాజాగా చర్చించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదీ..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీఈఈతో కలిసి రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థలలో 1000 ఎనర్జీ క్లబ్‌లను ఏపీఎస్‌ఈసీఎం ఏర్పాటు చేసింది. పట్టణ ఉష్ణ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ‘ఏపీ కూల్ సర్ఫేస్ పాలసీ 2023–28’ అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహంతో రూపొందించింది.
59 భారీ పరిశ్రమల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) సహకారంతో ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా ‘పాట్’ పథకంలో దాదాపు 1.16 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనం ఆదా అయ్యేలా చేసింది. 1158 సినిమా థియేటర్ల స్క్రీన్లపై నాలుగు చిన్న వీడియోలతో పాటు నాలుగు ఎఫ్‌ఎం ఛానళ్లలో 3 జింగిల్స్‌ను ప్రసారం చేసింది.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని ఆంధ్రా భవన్, తిరుమల తిరుపతి దేవస్థానం, పలు జనరల్ హాస్పిటల్స్, విజయవాడలోని డెంటల్ హాస్పిటల్, 130 గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యుత్ ఆదా కోసం ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు, మోటార్లు అమర్చింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)ని నోటిఫై చేసింది. విశాఖపట్నంలో సూపర్ ఎనర్జీ కన్జర్వేటివ్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) భవన నిర్మాణాన్ని చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment