సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్‌లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్‌లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్‌గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్‌లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది.
అదనపు నిధుల కోసం...
గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్‌రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు.
50 శాతానికి పైగా విద్యుత్ ఆదా
ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్‌మెంట్, డిస్కమ్‌లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు.
దేశానికి ఆదర్శంగా..
బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ
పొదుపులో అగ్రగామి
ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్‌మోడల్‌గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్‌భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్
Comments
Please login to add a commentAdd a comment