ECBC
-
ఇంధన ఆదాకు రోల్‌మోడల్ ‘ఈసీబీసీ బిల్డింగ్’
సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్‌లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్‌గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్‌లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది. అదనపు నిధుల కోసం... గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్‌రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్మెంట్, డిస్కమ్‌లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా.. బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పొదుపులో అగ్రగామి ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్‌మోడల్‌గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్ -
విశాఖలో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ మోడల్ భవనం
సాక్షి, అమరావతి: ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) మోడల్ భవనాన్ని విశాఖలో నిర్మిస్తున్నట్టు ఇందన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం), విశాఖ నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అధికారులతో శుక్రవారం ఆయన వరŠుచ్యవల్ సమావేశం నిర్వహించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సహకారంతో జి+1 అంతస్తుల ఇంధన సామర్థ్యం ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను విశాఖలో తొమ్మిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. తక్కువ విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లుల తగ్గుదల, హీటింగ్, వెంటిలేషన్, కూలింగ్ లోడ్, పగటి కాంతి వంటివి సమర్థంగా ఉపయోగించడం ఈ భవనం ప్రత్యేకతలుగా చెప్పారు. సాధారణ భవనాలకంటే 30–40 శాతం మెరుగైన భవన నిర్మాణ సాంకేతికతతో ఈసీబీసీ భవనాలుంటాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 701 వాణిజ్య భవనాలను ఈ విధంగా నిర్మించేందుకు ‘ఈసీబీసీ’ ద్వారా అనుమతులిచ్చామని పేర్కొన్నారు. వీటితో పాటు దేశంలో నిర్మించే భవనాలకు వైజాగ్‌లో నిర్మించే భవనం సూపర్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 541 కోర్టు భవనాలు, 100 మోడల్ పాఠశాలలు, ఒక ప్రధాన ఆస్పత్రిలో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేసినట్లు స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగంలో (వాణిజ్య భవనాలు) ఇంధన డిమాండ్ దాదాపు 4,800 మిలియన్ యూనిట్లుగా ఉందని, ఈసీబీసీని అమలు చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుందన్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, డైరెక్టర్లు డి.చంద్రం, బి.రమేష్ ప్రసాద్, ఏవీవీ సూర్యప్రతాప్ పాల్గొన్నారు. -
ఆదా చేస్తేనే అనుమతి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వాణిజ్య భవనాలు నిర్మించాలనుకునేవారు ఇకపై విధిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ)ను అనుసరించాల్సిందే. లేని పక్షంలో అనుమతులివ్వరు. ప్లాట్ ఏరియా వెయ్యి చదరపు మీటర్లకు మించిన.. లేదా బిల్టప్ ఏరియా 2 వేల చదరపు మీటర్లకు మించిన వాణిజ్య భవనాలకు దీనిని జీహెచ్ఎంసీ తప్పనిసరి చేసింది. ఈసీబీసీని తప్పనిసరి చేస్తూ అనుమతులివ్వడం దేశంలో ఇదే తొలిసారి. ఈసీబీసీకి మూడేళ్ల క్రితమే చట్టం చేసినా.. ఏ రాష్ట్రం ఇంతవరకు దీన్ని అమలు చేయడం లేదు. దీన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీయే కానుంది. జనవరి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. విద్యుత్ వినియోగం పెరగడంతో.. విద్యుత్ వినియోగం భారీస్థాయిలో పెరుగుతుండటంతో ఇంధన పొదుపు కీలకంగా మారింది. వాణిజ్య భవనాలకు వర్తించే ఈ నిబంధన ఫ్యాక్టరీలు, నివాస సముదాయాలకు వర్తించదు. హాస్పిటళ్లు, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు మొదలైనవి రెండు వేల చదరపు మీటర్ల లోపున ఉన్నా ఈసీబీసీని పాటించాల్సిందే. దీని వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్(ఎన్ఆర్డీసీ) సహకారంతో దీని అమలుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఈసీబీసీ వల్ల విద్యుత్ ఆదాతోపాటు వాతావరణ మార్పు సమస్యల్ని ఎదుర్కొనేందుకూ ఉపయుక్తంగా ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసీబీసీ అమలు చేస్తే.. ► గోడలు, రూఫ్‌లు, కిటికీలు వంటి వాటిని దీనికి లోబడి నిర్మించాలి. ► విద్యుత్ లైట్లు ఎన్ని పడితే అన్ని వాడటానికి వీల్లేదు. ఎంత విస్తీర్ణం గదికి ఎన్ని వాట్ల విద్యుత్ వాడాలనే నిబంధనలు పాటించాలి. ► ఎయిర్ కండిషనింగ్ కూడా పరిమిత స్థాయిలోనే ఉండాలి. ► ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, వాటర్‌పంప్ సిస్టం తదితరమైనవి సూపర్ ఎఫీషియెంట్‌గా ఉండాలి. ► హోటళ్లు, హాస్టళ్ల వంటి వాటిల్లో నీటిని వేడిచేసేందుకు 60 శాతం వరకు సోలార్ పవర్‌ను వినియోగించాలి. ► ఈసీబీసీ అమలుతో విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. సహజసిద్ధమైన వెంటిలేషన్ ఉంటుంది. సదరు కార్యాలయాల్లో పనిచేసే వారి ఆరోగ్యానికి అది మేలు చేస్తుంది. కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరుగుతుంది ఈసీబీసీ వల్ల విద్యుత్ వ్యయం తగ్గడమే కాక, సదరు భవనాల్లోని ఉద్యోగులకు సహజసిద్ధమైన గాలి, వెలుతురు అందే వీలుంది. తద్వారా వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి సదుపాయాలున్న చోట కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది. – ప్రొఫెసర్ రాజ్‌కిరణ్, ఆస్కి మొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఈసీబీసీని అమలు చేయనున్న మొదటి రాష్ట్రం తెలంగాణ.. మొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కానున్నాయి. భవనాల డిజైన్‌ను ఆమోదించేందుకు నిపుణుల ఎంప్యానెల్ ఉంటుంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల్ని డెవలప్మెంట్ పర్మిషన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఆన్లైన్లో జారీ చేస్తున్నాం. ఈసీబీసీ అమలుకు సాఫ్ట్‌వేర్‌ను తగినవిధంగా రూపొందించాం. – ఎస్.దేవేందర్‌రెడ్డి, చీఫ్ సిటీప్లానర్, జీహెచ్ఎంసీ -
వాణిజ్య భవన అనుమతులూ ఆన్లైన్లోనే..!
జీహెచ్ఎంసీలో సోమవారం నుంచి శ్రీకారం ⇒ ఇప్పటికే లేఔట్లు, నివాస భవన అనుమతులు ఆన్లైన్ ద్వారానే.. ⇒ టౌన్ ప్లానింగ్‌లో మాన్యువల్ ఫైలింగ్‌కు తెర ⇒ అవినీతికి ఆస్కారం ఉండదు.. పారదర్శకతకు పెద్దపీట ⇒ ఆన్లైన్ విధానంపై ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకూ నివాస భవన నిర్మాణ, లేఔట్ల అనుమతులను ఆన్ లైన్ ద్వారా జారీ చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ).. ఇకపై బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య భవ నాల నిర్మాణాల అనుమతులను సైతం ఆన్ లైన్ లోనే జారీ చేయనుంది. సోమవారం (20వ తేదీ) నుంచి దీనికి శ్రీకారం చుడు తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం గత ఏడాది జూన్ నుంచి నివాస భవనాలు, లేఔట్ల అనుమతుల జారీని ఆన్లైన్లో ప్రారం భించింది. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా.. ప్రస్తుతం దారిన పడటంతో వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకూ ఆన్లైన్ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీ చేపట్టనుంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే టౌన్ ప్లానింగ్‌లో ఇక మాన్యు వల్ ఫైలింగ్ అనేది ఉండదు. దరఖాస్తులో ఏవైనా లోపాలుంటే సంబంధిత సాఫ్ట్‌వేరే గుర్తిస్తుంది. తిరిగి సరిచేసి దరఖాస్తును అప్ లోడ్ చేయవచ్చు. అనుమతుల జారీలోనూ మానవ జోక్యం ఉండదని, తద్వారా టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి మచ్చ తొలగిపోనుందని అధికారులు భావిస్తు న్నారు. వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల అనుమతులను ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానంపై నగరంలోని ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ప్లానర్లకు సోమవారం ప్రత్యేక అవగాహన చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ ఆదా కోసం ఈసీబీసీ వర్తింపు.. వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసేవారు నివాస భవ నాలకంటే అదనంగా ఫైర్ సర్వీస్ నుంచి ఎన్ఓసీ, పర్యావరణ క్లియరెన్స్‌తోపాటు తగి నంత పార్కింగ్ స్థలం, ఈసీబీసీ (ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్)ని అమలు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఆదా కోసం ఈసీబీసీని వర్తింపచేయనున్నారు. తొలుత వాణిజ్య భవ నాలు, ప్రభుత్వ, కార్పొరేట్ కార్యాలయాలకు దీనిని పాటించాలని గత ఏడాదే జీహెచ్ఎంసీ నిర్ణయించినా అమలు చేయడం లేదు. ట్రాఫి క్, భారీ ఇంధన వినియోగం వల్ల కాలుష్యం ఆందోళనకరస్థాయికి చేరడంతో దీన్ని అధి గమించేందుకు ఈ చర్యలకు సిద్ధమయ్యారు. ఇవీ ప్రయోజనాలు.. ఆన్లైన్ ద్వారా అనుమతుల జారీతో పారదర్శకత పెరగడమే కాక.. పలు ఇబ్బందులు తప్పనున్నాయి. ఉన్న చోటు నుంచే ఆన్లైన్ ద్వారా 24 గంటల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చు. తొలుత దరఖాస్తు చేసిన వారికి తొలుత ప్రాతిపదికన దరఖాస్తుల్ని పరిశీలిస్తారు. ఫైలు ఎక్కడ ఉన్నదీ ఎప్పటికప్పుడు ఈమెయిల్/ఎస్ఎంఎస్/వెబ్‌పోర్టల్ ద్వారా సమాచారం అందుతుంది. నిబంధనల మేరకు ఆటోమేటిక్‌గా దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. తద్వారా పారదర్శకత ఉంటుంది. ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ సాఫ్ట్‌వేరే కనిపెడుతుందని, ఫైళ్లు, రికార్డులు ఎక్కడకీ పోవని.. మధ్యలో కాగితాలు మాయం కావని.. డిజిటల్ పత్రాలు అన్నివేళలా అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.