
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వాణిజ్య భవనాలు నిర్మించాలనుకునేవారు ఇకపై విధిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ)ను అనుసరించాల్సిందే. లేని పక్షంలో అనుమతులివ్వరు. ప్లాట్ ఏరియా వెయ్యి చదరపు మీటర్లకు మించిన.. లేదా బిల్టప్ ఏరియా 2 వేల చదరపు మీటర్లకు మించిన వాణిజ్య భవనాలకు దీనిని జీహెచ్‌ఎంసీ తప్పనిసరి చేసింది. ఈసీబీసీని తప్పనిసరి చేస్తూ అనుమతులివ్వడం దేశంలో ఇదే తొలిసారి. ఈసీబీసీకి మూడేళ్ల క్రితమే చట్టం చేసినా.. ఏ రాష్ట్రం ఇంతవరకు దీన్ని అమలు చేయడం లేదు. దీన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీయే కానుంది. జనవరి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.
విద్యుత్ వినియోగం పెరగడంతో..
విద్యుత్ వినియోగం భారీస్థాయిలో పెరుగుతుండటంతో ఇంధన పొదుపు కీలకంగా మారింది. వాణిజ్య భవనాలకు వర్తించే ఈ నిబంధన ఫ్యాక్టరీలు, నివాస సముదాయాలకు వర్తించదు. హాస్పిటళ్లు, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు మొదలైనవి రెండు వేల చదరపు మీటర్ల లోపున ఉన్నా ఈసీబీసీని పాటించాల్సిందే. దీని వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్(ఎన్‌ఆర్‌డీసీ) సహకారంతో దీని అమలుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఈసీబీసీ వల్ల విద్యుత్ ఆదాతోపాటు వాతావరణ మార్పు సమస్యల్ని ఎదుర్కొనేందుకూ ఉపయుక్తంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈసీబీసీ అమలు చేస్తే..
► గోడలు, రూఫ్‌లు, కిటికీలు వంటి వాటిని దీనికి లోబడి నిర్మించాలి.
► విద్యుత్ లైట్లు ఎన్ని పడితే అన్ని వాడటానికి వీల్లేదు. ఎంత విస్తీర్ణం గదికి ఎన్ని వాట్ల విద్యుత్ వాడాలనే నిబంధనలు పాటించాలి.
► ఎయిర్ కండిషనింగ్ కూడా పరిమిత స్థాయిలోనే ఉండాలి.
► ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, వాటర్‌పంప్ సిస్టం తదితరమైనవి సూపర్ ఎఫీషియెంట్‌గా ఉండాలి.
► హోటళ్లు, హాస్టళ్ల వంటి వాటిల్లో నీటిని వేడిచేసేందుకు 60 శాతం వరకు సోలార్ పవర్‌ను వినియోగించాలి.
► ఈసీబీసీ అమలుతో విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. సహజసిద్ధమైన వెంటిలేషన్ ఉంటుంది. సదరు కార్యాలయాల్లో పనిచేసే వారి ఆరోగ్యానికి అది మేలు చేస్తుంది.
కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరుగుతుంది
ఈసీబీసీ వల్ల విద్యుత్ వ్యయం తగ్గడమే కాక, సదరు భవనాల్లోని ఉద్యోగులకు సహజసిద్ధమైన గాలి, వెలుతురు అందే వీలుంది. తద్వారా వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి సదుపాయాలున్న చోట కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది.
– ప్రొఫెసర్ రాజ్‌కిరణ్, ఆస్కి మొదటి కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ
ఈసీబీసీని అమలు చేయనున్న మొదటి రాష్ట్రం తెలంగాణ.. మొదటి కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ కానున్నాయి. భవనాల డిజైన్‌ను ఆమోదించేందుకు నిపుణుల ఎంప్యానెల్ ఉంటుంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల్ని డెవలప్‌మెంట్ పర్మిషన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నాం. ఈసీబీసీ అమలుకు సాఫ్ట్‌వేర్‌ను తగినవిధంగా రూపొందించాం.
– ఎస్.దేవేందర్‌రెడ్డి, చీఫ్ సిటీప్లానర్, జీహెచ్‌ఎంసీ
Comments
Please login to add a commentAdd a comment