grater hyderabad
-
గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కరోజే 397 కరోనా కేసులు!!
సాక్షి హైదరాబాద్: గ్రేటర్‌జిల్లాల్లో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 482 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 397 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు రోజుకు సగటున వందలోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా విస్తరించింది. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. సరిహద్దు రాష్ట్రాల రోగులపై నిఘా.. డెల్టా సహా ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఇతర సరిహద్దు రాష్ట్రాల బాధితులు చికిత్స కోసం నగరానికి చేరుకుంటున్నారు. వీరికి సహాయంగా వచ్చిన బంధువులు సాధారణ రోగుల మధ్యే తిరుగుతున్నారు. వీరి ద్వారా ఇతర రోగులకు కూడా వైరస్ విస్తరిస్తుండటంతో పోలీసులు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులపై నిఘా పెట్టారు. రోగులు, వారి సహాయకులు బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన 23 మందికి.. విదేశాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న 423 మందిలో 23 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో వారిని టిమ్స్‌కు తరలించారు. వీరికి ఏ వేరియంట్ సోకిందో తెలుసుకునేందుకు వారి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సీ పరీక్షలకు పంపారు. ప్రస్తుతం 53 శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. -
గ్రేటర్ అలర్ట్: ఒమిక్రాన్ గుర్తింపుతో కంటైన్మెంట్ జోన్‌గా పారామౌంట్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యారోగ్యశాఖ సహా పోలీసు, జీహెచ్ఎంసీలు అప్రమత్తమయ్యాయి. టోలిచౌకి పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ సోకిన బాధితులు తిరిగిన ప్రదేశాల్లో హైపోక్లోరైడ్‌తో శానిటైజ్ చేస్తున్నారు. ఆ దారిలో ఇతరులెవరూ ప్రయాణించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. తల్లిదండ్రుల్లో బెంగ... ఇప్పటికే డెల్టా వైరస్‌తో ఛిన్నాభిన్నమైన కుటుంబాలు.. తాజా వేరియంట్‌తో మరింత భయాందోళనకు గురవుతున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపాలా? వద్దా? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో చాలా వరకు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. ఒకే గదిలో 50 నుంచి 60 మంది పిల్లలను కూర్చోబెడుతున్నారు. భౌతిక దూరం అనేది మచ్చుకు కూడా కన్పించడం లేదు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్, సబ్బులు, నీరు అందుబాటులో ఉండటం లేదు. మాస్కులు ధరిస్తున్నా.. తరచూ పక్కకు జారిపోతున్నాయి. ప్రస్తుతం వీస్తున్న చలిగాలుల కు అనేక మంది పిల్లలు ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. పాఠశాలల్లో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే స్క్రీనింగ్ వ్యవస్థ కూడా లేకపోవడం, ఇప్పటి వరకు పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆస్పత్రుల్లో 1,191 మంది బాధితులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,812 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 1,500పైగా కేసులు గ్రేటర్ జిల్లాల్లోనే ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 715 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1,191 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 284 మంది సాధారణ పడకలపై, 497 మంది ఆక్సిజన్‌పై, మరో 410 మంది ఐసీయూలోని వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. టోలిచౌకి, యూసుఫ్ గూడలో కలకలం నగరంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఒక యువతి సహా యువకుడికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ కాగా తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి వచ్చిన ఇద్దరు యువతులు (24), మరో వ్యక్తి(44)కి, యూకే సుంచి వచ్చిన యువకుని (31)కి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు నగరంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో ఆరు కేసులు ముప్పు లేని దేశాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో మూడు టోలిచౌకికి చెందినవి కాగా. మరొకరు నగరంలోని యూసుఫ్‌గూడకు చెందినవారిగా వైద్యులు ధ్రువీకరించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం టిమ్స్‌కు తరలించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త వేరియంట్ ఇటు టోలిచౌకి అటు యూసూఫ్‌గూడలో కలకలం సృష్టించింది. పాఠశాల విద్యార్థికి కరోనా స్థానికంగా ఉన్న ఓ సర్కారు బడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. రెండు రోజుల క్రితం స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్న విద్యార్థికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న బంజారాహిల్స్ వైద్య సిబ్బంది కరోనా కిట్ అందించి క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఇదే బడిలో మరో 50 మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తే అందరికీ నెగిటివ్ వచ్చిందని వారు తెలిపారు. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలని అనుకుంటున్నప్పటికీ పాఠశాలలో సమ్మెటివ్–1 పరీక్షలు నడుస్తుండటంతో అవి ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థిని పరీక్షిస్తామని వైద్యాధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్.. పారామౌంట్ కాలనీలో రెండు రోజుల క్రితం ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో ఫిలింనగర్ ప్రాథమిక కేంద్రంతో పాటు, జీహెచ్ఎంసీ, ఎంటమాలజీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 3ని ఇప్పటికే కంటైన్మెంట్గా ప్రకటించిన అధికారులు రోజుకు మూడుసార్లు శానిటైజ్ చేయడంతో పాటు సాయంత్రం వేళల్లో ఫాగింగ్ కూడా చేస్తున్నారు. మరో వైపు ఫిలింనగర్ ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ఇక్కడ 230 మందికి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారిణి జాస్పర్ జాయిస్ తెలిపారు. మరో 14 రోజులు అబ్జర్వేషన్లోనే.. ఇప్పటికే వంద క్లోజ్ కాంటాక్ట్‌లను గుర్తించి, వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాం. ఇంటింటి ఫీవర్ సర్వే కూడా చేపట్టాం. ఆ ప్రాంతాన్ని మరో 14 రోజుల పా టు అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఎవరికీ ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ కోసం రోజుకు సగటున పదివేల పరీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున ఆరువేల ఆర్టీపీసీఆర్ టెస్టులు, 8 నుంచి పది వేల ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నాం. – డాక్టర్ జె.వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్ మాస్క్ ఒక్కటే కాపాడుతుంది.. వైరస్ ఏదైనా మాస్క్ ఒక్కటే పరిష్కారం. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్లు, సబ్బులతో తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. విధిగా భౌతిక దూరం పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసులు కోవిడ్ టీకాలు వేసుకోవాలి. – డాక్టర్ శ్రీహర్ష, సర్వేలెన్స్ ఆఫీసర్, హైదరాబాద్ -
ఎల్పీజీ: అదనంగా రూ. 6 కోట్లు!
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్‌పై డెలివరీ బాయ్స్ ప్రతినెలా అదనంగా ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా.? అక్షరాల రూ.6 కోట్ల పైమాటే. ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం. ప్రతి వినియోగదారుడు సిలిండర్ రిఫిల్పై డెలివరీ బాయ్స్‌కు బిల్లుపై అదనంగా రూ.20 నుంచి రూ.30 చెల్లిస్తున్నారు. చిల్లరే కదా అనుకుని తేలిగ్గా తీసుకోవడంతో అది కాస్తా ‘తప్పనిసరి‘గా మారింది. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గ్యాస్ బండ( సిలిండర్) వినియోగదారులకు నానాటికి భారంగా మారుతోంది. ఓ వైపు ఆరు నెలలకోసారి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతుండగా, మరో వైపు డెలివరీ బాయ్స్ డిమాండ్ చేసి మరీ అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఎల్పీజీ రీఫిల్ బుక్ చేసి ఆన్లైన్లో నిర్ణీత ధర చెల్లించినా డెలివరీ సమయంలో అదనపు బాదుడు తప్పడం లేదు. ఇక నగదు చెల్లింపు అయితే బిల్లుతో కలిపి అదనంగా రూ. 30 వరకు వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ప్రధాన ఆయిల్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసం లేదని స్పష్టం చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తే నిర్ణీత ధర రూ.746.50పైసలు అయినా నగదు రూ.770 చెల్లించాల్సిందే. అదే చేతిలో చిల్లల లేకుంటే మరో పది రూపాయిలు కూడా పెరగొచ్చు. డెలివరీ బాయ్స్ వినియోగదారుడి చేతికి బిల్లు ఇచ్చి అదనపు మోత కలిపి వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఏజెన్సీల నిర్లక్ష్యం.. ఏజెన్సీలు వినియోగదారులకు రీఫిల్ డోర్ డెలివరీ బాధ్యతలో నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, గ్యాస్, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సిలిండర్ సరఫరా బాధ్యతను డెలివరీ బాయ్స్‌కు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అదనపు వసూళ్లపై డిస్ట్రిబ్యూటర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. చాలీచాలని వేతనాలు.. సిలిండర్ డెలివరీ బాయ్స్‌కు చాలీచాలని వేతనాల చెల్లిస్తుండటం కూడా వినియోగదారులపై అదనపు బాదుడుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు వారికి నామమాత్రపు వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు రీఫిల్ డెలివరీపై కమీషన్ ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధనల ప్రకారం బాయ్స్ సిలిండర్‌ను డోర్ డెలివరీ చేసే సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. అయితే ఈ నిబంధన ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు తప్ప బరువు చూపించాలన్న ధ్యాస లేకుండా పోయింది. నిబంధనలు ఇవీ ⇔ వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ చేసి డోర్ డెలివరీ చేయాలి ⇔ ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలివరీ ఇవ్వాలి. ⇔ ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణా చార్జీల పేరుతో రూ.10 వసూలు చేయవచ్చు. ⇔ 16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే రవాణా చార్జీగా రూ. 15 వసూలు చేయాలి ⇔ వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి. -
బల్దియా: ఆనాడే తొలి ఓటు..
సాక్షి, హైదరాబాద్: అది 1948 సెప్టెంబర్ 17.. అప్పటి వరకు రాచరిక పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో 1952 జనవరిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. వాటితో పాటే నాటి హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఎన్నికలు జరిగాయి. దీంతో హైదరాబాదీలు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించారు. 1956లో ఎంసీహెచ్ ఏర్పడినా.. అప్పుడు ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక అధికారితోనే బల్దియా పాలన సాగింది. హైదరాబాద్ సంస్థానంలో విలీనం అనంతరం హైదరాబాద్ బల్దియాకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి..? నిజాం పాలనలో జరిగిన ఎన్నికలు ఎలా జరిగేవి.. తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 1934 మున్సిపల్ కార్పొరేషన్ కోసం మొదటి ఎన్నికల జరిగాయి. కానీ ఇందులో అందరికీ ఓటు వేసే అధికారం ఉండేది కాదు. కేవలం కొంత మందికి మాత్రమే ఓటు వినియోగించే హక్కు నిజాం ప్రభుత్వం కల్పించింది. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో మొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగాయి. ఇందులో మొదటిసారి నగర ప్రజలు ఓటు వినియోగించారు. 1951 నవంబర్ 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 15న నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అప్పట్లో హైదరాబాద్ నగరంలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. అందులో ఇద్దరు అభ్యర్థుల నియోజకవర్గాలు రెండు ఉండేవి. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ రోజుల్లో హైదరాబాద్ కేవలం ఒక్క నియోజకవర్గంగా ఉండేది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు 1951 అక్టోబర్ 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరిగాయి. రోజుకో నియోజకవర్గంలో పోలింగ్ రాచరిక వ్యవస్థ అంతరించిన తర్వాత దేశంలో మొదటిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం, సిబ్బంది లేమి వల్ల నాడు రోజుకో నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించి నియోకవర్గాల్లో జనవరి 2 నుంచి 24వ తేదీ వరకు పోలింగ్ జరిగింది. మొత్తం స్థానాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 15న ఫలితాలను ప్రకటించారు. నిజాం హయాంలో కూడా బల్దియా ప్రతినిధుల కోసం ఎన్నికలు జరిగేవని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఆ రోజుల్లో ప్రజలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం దక్కేదికాదు. ప్రభుత్వం తరఫున కేవలం కొంతమంది ప్రతినిధులు ఓటు వినియోగించే వారు. ప్రజాసామ్య పద్ధతిలో బల్దియా ఎన్నికలు జరిగాయి. మొదట్లో హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ 60 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొదటి పాలక మండలి 1960 ఆగస్టు 3వ తేదీన కొలువుదీరింది. బల్దియా ఎన్నికలు మొదటిసారి 1956లో ఎంసీహెచ్ ఏర్పడింది. అప్పటి నుంచి 1960 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 1960లో మొదటిసారి బల్దియాకు ఎన్నికలు జరిగాయి. రెండవసారి 1964లో.. మూడోసారి 1968లో ఎన్నికలు జరిగాయి. 1968 నుంచి 1986 వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. తిరిగి 2002లో బల్దియాకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2007లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటికీ ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మారింది. గ్రేటర్ ఏర్పా టు అనంతరం రెండేళ్లకు 2009లో ఎన్నికలు జరిగాయి. 2009 నుంచి 2014 వరకు పాలకమండలి కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏడాదిన్నర తర్వాత మళ్లీ 2016 ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. 2016 ఫిబ్రవరి 11న ప్రస్తుత పాలకమండలి కొలువుదీరింది. వీరి పదవీ కాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. బల్దియాలో ప్రస్తుతం 8వ సారి జరుగుతున్న ఎన్నికలు. -
గ్రేటర్ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధీలో భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహా నగరంలోని పలు చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో క్షేత్ర స్థాయి అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేశారు. (కోస్తాకు నేడు వర్ష సూచన) బంగాళాఖాతంలో ఈ నెల 24న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి ననుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్భన్, కామారెడ్డి జిల్లాలోని ఒకంట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్య సూచనలు ఉన్నట్లు తెలిపింది. కాగా బుధవారం రాష్ట్రంలో 1.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
కాంగ్రెస్ పార్టీలో ‘గ్రేటర్’ చిచ్చు
-
అంజన్ వర్సెస్ అజార్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ‘గ్రేటర్’ చిచ్చు రాజుకుంది. ఈ చిచ్చు కారణం మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అజహరుద్దీన్ ఇటీవల చేసిన ప్రకటన.. గ్రేటర్ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. అజార్ ప్రకటనపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ భగ్గుమన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి ఈ సారి తానే పోటీ చేయబోతున్నట్లు ఆయన సమావేశంలో స్పష్టం చేశారు. అజహరుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంజన్ కుమార్ మాట్లాడుతుండగా మాజీ ఎంపీ వీ హనుమంతరావు విసురుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అంజన్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా, అజహరుద్దీన్‌కు వ్యతిరేకంగా కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. మధ్యలో కల్పించుకున్న మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ.. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ అంజన్‌దేనని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని నచ్చజెప్పారు. మరోవైపు ఈ సమావేశానికి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్, ఆయన తనయుడు విక్రమ్‌గౌడ్‌లు హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. -
ఆదా చేస్తేనే అనుమతి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వాణిజ్య భవనాలు నిర్మించాలనుకునేవారు ఇకపై విధిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ)ను అనుసరించాల్సిందే. లేని పక్షంలో అనుమతులివ్వరు. ప్లాట్ ఏరియా వెయ్యి చదరపు మీటర్లకు మించిన.. లేదా బిల్టప్ ఏరియా 2 వేల చదరపు మీటర్లకు మించిన వాణిజ్య భవనాలకు దీనిని జీహెచ్ఎంసీ తప్పనిసరి చేసింది. ఈసీబీసీని తప్పనిసరి చేస్తూ అనుమతులివ్వడం దేశంలో ఇదే తొలిసారి. ఈసీబీసీకి మూడేళ్ల క్రితమే చట్టం చేసినా.. ఏ రాష్ట్రం ఇంతవరకు దీన్ని అమలు చేయడం లేదు. దీన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీయే కానుంది. జనవరి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. విద్యుత్ వినియోగం పెరగడంతో.. విద్యుత్ వినియోగం భారీస్థాయిలో పెరుగుతుండటంతో ఇంధన పొదుపు కీలకంగా మారింది. వాణిజ్య భవనాలకు వర్తించే ఈ నిబంధన ఫ్యాక్టరీలు, నివాస సముదాయాలకు వర్తించదు. హాస్పిటళ్లు, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు మొదలైనవి రెండు వేల చదరపు మీటర్ల లోపున ఉన్నా ఈసీబీసీని పాటించాల్సిందే. దీని వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్(ఎన్ఆర్డీసీ) సహకారంతో దీని అమలుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఈసీబీసీ వల్ల విద్యుత్ ఆదాతోపాటు వాతావరణ మార్పు సమస్యల్ని ఎదుర్కొనేందుకూ ఉపయుక్తంగా ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసీబీసీ అమలు చేస్తే.. ► గోడలు, రూఫ్‌లు, కిటికీలు వంటి వాటిని దీనికి లోబడి నిర్మించాలి. ► విద్యుత్ లైట్లు ఎన్ని పడితే అన్ని వాడటానికి వీల్లేదు. ఎంత విస్తీర్ణం గదికి ఎన్ని వాట్ల విద్యుత్ వాడాలనే నిబంధనలు పాటించాలి. ► ఎయిర్ కండిషనింగ్ కూడా పరిమిత స్థాయిలోనే ఉండాలి. ► ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, వాటర్‌పంప్ సిస్టం తదితరమైనవి సూపర్ ఎఫీషియెంట్‌గా ఉండాలి. ► హోటళ్లు, హాస్టళ్ల వంటి వాటిల్లో నీటిని వేడిచేసేందుకు 60 శాతం వరకు సోలార్ పవర్‌ను వినియోగించాలి. ► ఈసీబీసీ అమలుతో విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. సహజసిద్ధమైన వెంటిలేషన్ ఉంటుంది. సదరు కార్యాలయాల్లో పనిచేసే వారి ఆరోగ్యానికి అది మేలు చేస్తుంది. కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరుగుతుంది ఈసీబీసీ వల్ల విద్యుత్ వ్యయం తగ్గడమే కాక, సదరు భవనాల్లోని ఉద్యోగులకు సహజసిద్ధమైన గాలి, వెలుతురు అందే వీలుంది. తద్వారా వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి సదుపాయాలున్న చోట కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది. – ప్రొఫెసర్ రాజ్‌కిరణ్, ఆస్కి మొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఈసీబీసీని అమలు చేయనున్న మొదటి రాష్ట్రం తెలంగాణ.. మొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కానున్నాయి. భవనాల డిజైన్‌ను ఆమోదించేందుకు నిపుణుల ఎంప్యానెల్ ఉంటుంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల్ని డెవలప్మెంట్ పర్మిషన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఆన్లైన్లో జారీ చేస్తున్నాం. ఈసీబీసీ అమలుకు సాఫ్ట్‌వేర్‌ను తగినవిధంగా రూపొందించాం. – ఎస్.దేవేందర్‌రెడ్డి, చీఫ్ సిటీప్లానర్, జీహెచ్ఎంసీ -
హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దాలి
-
హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో వాహన విస్ఫోటనం గ్రిడ్లాక్ దిశగా పరుగులు తీస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి వాహనాలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి తలెత్తే సంకేతం కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం అక్టోబర్ చివరి నాటికి నగరంలో వాహనాల సంఖ్య 48,70,017. అంటే సుమారు కోటి జనాభా ఉన్న గ్రేటర్లో దాదాపు సగం. వీటిల్లో 35.66 లక్షల ద్విచక్ర వాహనాలు ఉండగా, 9.06 లక్షల కార్లున్నాయి. రానున్న 2 నెలల్లో మరో లక్షకు పైగా వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని మెట్రో రైలు, పరిమిత మార్గాల్లోనే నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లు, ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో... ఇబ్బడిముబ్బడిగా వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయి. బెంగళూరులో సుమారు 6,000 ఆర్టీసీ సిటీ బస్సులు నడుస్తుండగా... నగరంలో 3,500 మాత్రమే అందుబాటులో ఉన్నారుు. ఇక హైదరాబాద్‌లో 6.06 శాతం రహదారులు మాత్రమే ఉండగా, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇది 8 శాతం కంటే ఎక్కువ ఉంది. హైదరాబాద్ లో అవసరానికి తగ్గట్టుగా రోడ్ల విస్తీర్ణం పెరగకపోవడం, ఉన్నవాటి నాణ్యత కొరవడటం వల్ల వాహనాల సగటు వేగం పడిపోయి... ట్రాఫిక్ జామయ్యి... గ్రిడ్లాక్ హెచ్చరికలను సూచిస్తున్నాయి. పడిపోయిన సగటు వేగం... ఐదేళ్ల క్రితం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లున్న వాహనాల వేగం... ఇప్పుడు 17 నుంచి 20 కిలోమీటర్లకు మించడంలేదు. ఏటా 1.5 లక్షల నుంచి 2 లక్షలు... రోజుకు 800 నుంచి 1,000 వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు నగరంలో నివాస ప్రాంతాలు తగ్గి, వాణిజ్య ప్రాంతాలు పెరిగిపోవడం కూడా ట్రాఫిక్ విలయానికి కారణమవుతోంది. ఐటీ రంగం విస్తరించడం, అంతర్జాతీయ స్థాయి వ్యాపార కార్యకలాపాలు అభివృద్ధి చెందడం వంటి అంశాలు కూడా వాహనాల పెరుగుదలకు ప్రధాన కారణం. ఇప్పటికిప్పుడు ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడం తప్ప గ్రిడ్లాక్ ముప్పు నుంచి నగరం తప్పించుకోవడం కష్టమేనని రవాణా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో కిలోమీటరు పరిధిలో 593 వాహనాలుంటే.. హైదరాబాద్‌లో 950 ఉన్నాయి. -
గ్రేటర్లో ఆ పంచాయతీల విలీనం లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో శివారు పంచాయతీలను విలీనం చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారంలో హైకోర్టు అక్షింతలు వేయడంతోపాటు ప్రజలు, ప్రజాప్రతినిధులూ విలీ నాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీల విలీనంపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, పురపాలక, చేనేత, జౌళిశాఖల మంత్రులు జానారెడ్డి, మహీధర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిం చారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు నాగిరెడ్డి, అదర్‌సిన్హా, పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంచాయతీల విలీనాన్ని ప్రజలు సైతం వ్యతిరేకించడం.. గ్రేటర్లో పంచాయతీల్ని విలీనం చేసుకునేది లేదంటూ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం తీర్మానించడం.. శివార్లలోని ఎమ్మెల్యేలూ విలీనం వద్దని, ఆ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చాలని ఒత్తిడి చేస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తం 37 పంచాయతీల్ని గ్రేటర్లో విలీనం చేయడానికి సర్కారు ఉత్తర్వులివ్వగా, వాటి ని సవాల్ చేస్తూ శివారు గ్రామాల ప్రజలు కోర్టుకెళ్లారు. విలీన ప్రక్రియలో సరైన నిబంధనలు పాటించలేదంటూ కోర్టు ఆ ఉత్తర్వుల్ని కొట్టేసింది. నిబంధనల మేరకు మళ్లీ నోటీసులిచ్చి విలీనం చేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించినా.. మారిన పరిస్థితుల్లో వాటిని ఒకేసారి గ్రేటర్లో విలీనం చేయకుండా మునిసిపాలిటీలుగా మార్చాలని మంత్రులు ప్రసాద్, జానా అభిప్రాయపడినట్టు సమాచారం. మహీధర్‌రెడ్డి కూడా వారితో ఏకీభవించినట్టు తెలిసింది. అయితే ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి జరగాలంటే వాటిని విలీనం చేస్తేనే మంచి దన్న అభిప్రాయం వ్యక్తమైనా.. ప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మునిసిపాలిటీలుగా మార్చడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై సీఎం కిరణ్‌తో చర్చిం చాక ఒక నిర్ణయానికి రావాలన్న అభిప్రా యం వ్యక్తమైనట్లు సమాచారం. పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఈ మేరకు ప్రతి పాదన వస్తే.. దానికి సంబంధించి కసరత్తు చేసి ముందుకు తీసుకెళ్తామని పురపాలక అధికారులు చెప్పినట్లు తెలిసింది. అలాగే విలీన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేశాక తీసుకున్న చర్యలపై కోర్టుకు నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. మరోవైపు విశాఖ మునిసిపల్ కార్పొరేషన్లో పది గ్రామాల విలీనానికి సంబంధించి ఇలాంటి వివాదమే ఉన్నందున ఏమి చేయాలని అధికారులు ప్రశ్నించగా.. దానికి సంబంధించి మళ్లీ నోటీసులు జారీ చేసి విలీనం చేసుకోవడానికి అధికారులకు వెసులుబాటు కల్పించనున్నట్టు మంత్రులు తెలిపారు. ఆ పంచాయతీల్ని విలీనం చేస్తే తప్ప.. భీమిలి మునిసిపాలిటీని గ్రేటర్లో కలవడానికి ఆస్కారం ఉండదని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఫైళ్లు వెనక్కి ఇచ్చేయండి: విలీన ఉత్తర్వుల్ని హైకోర్టు సస్పెండ్ చేసినందున పంచాయతీల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులను తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం జీహెచ్ఎంసీని ఆదేశించింది.