హైదరాబాద్లో వాహనాల సంఖ్య తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో వాహన విస్ఫోటనం గ్రిడ్లాక్ దిశగా పరుగులు తీస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి వాహనాలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి తలెత్తే సంకేతం కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం అక్టోబర్ చివరి నాటికి నగరంలో వాహనాల సంఖ్య 48,70,017. అంటే సుమారు కోటి జనాభా ఉన్న గ్రేటర్లో దాదాపు సగం. వీటిల్లో 35.66 లక్షల ద్విచక్ర వాహనాలు ఉండగా, 9.06 లక్షల కార్లున్నాయి. రానున్న 2 నెలల్లో మరో లక్షకు పైగా వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.
ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని మెట్రో రైలు, పరిమిత మార్గాల్లోనే నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లు, ప్రయాణికుల డిమాండ్కు తగినన్ని సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో... ఇబ్బడిముబ్బడిగా వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయి. బెంగళూరులో సుమారు 6,000 ఆర్టీసీ సిటీ బస్సులు నడుస్తుండగా... నగరంలో 3,500 మాత్రమే అందుబాటులో ఉన్నారుు. ఇక హైదరాబాద్లో 6.06 శాతం రహదారులు మాత్రమే ఉండగా, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇది 8 శాతం కంటే ఎక్కువ ఉంది. హైదరాబాద్ లో అవసరానికి తగ్గట్టుగా రోడ్ల విస్తీర్ణం పెరగకపోవడం, ఉన్నవాటి నాణ్యత కొరవడటం వల్ల వాహనాల సగటు వేగం పడిపోయి... ట్రాఫిక్ జామయ్యి... గ్రిడ్లాక్ హెచ్చరికలను సూచిస్తున్నాయి.
పడిపోయిన సగటు వేగం...
ఐదేళ్ల క్రితం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లున్న వాహనాల వేగం... ఇప్పుడు 17 నుంచి 20 కిలోమీటర్లకు మించడంలేదు. ఏటా 1.5 లక్షల నుంచి 2 లక్షలు... రోజుకు 800 నుంచి 1,000 వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు నగరంలో నివాస ప్రాంతాలు తగ్గి, వాణిజ్య ప్రాంతాలు పెరిగిపోవడం కూడా ట్రాఫిక్ విలయానికి కారణమవుతోంది. ఐటీ రంగం విస్తరించడం, అంతర్జాతీయ స్థాయి వ్యాపార కార్యకలాపాలు అభివృద్ధి చెందడం వంటి అంశాలు కూడా వాహనాల పెరుగుదలకు ప్రధాన కారణం. ఇప్పటికిప్పుడు ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడం తప్ప గ్రిడ్లాక్ ముప్పు నుంచి నగరం తప్పించుకోవడం కష్టమేనని రవాణా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో కిలోమీటరు పరిధిలో 593 వాహనాలుంటే.. హైదరాబాద్లో 950 ఉన్నాయి.